Share News

స్కూల్‌ బస్సు భారమే..!

ABN , Publish Date - Jun 11 , 2025 | 12:25 AM

ప్రైవేటు స్కూల్‌ విద్యలో ఇటు పుస్తకాలు, ఫీజుల మోతతోపాటు బస్సు రవాణా మరింత బరువెక్కింది.

స్కూల్‌ బస్సు భారమే..!

స్కూల్‌ నుంచి రూరల్‌కు రూ.19,500,

పట్టణ పరిధిలో రూ.13 వేలు వసూళ్లు

పెరిగిన ఫీజులు, పుస్తకాలకు ఇది అదనం

తల్లిదండ్రులకు విద్యార్థుల రవాణాపై ఆపసోపాలు

భీమవరం రూరల్‌, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు స్కూల్‌ విద్యలో ఇటు పుస్తకాలు, ఫీజుల మోతతోపాటు బస్సు రవాణా మరింత బరువెక్కింది. ఏటా స్కూల్‌ ఫీజులు పెంచుతున్న విద్యా సంస్థలు ఈ సారి బస్సుల ఫీజులు వదలలేదు. గతంలో పట్టణానికి సమీపంలోని రూరల్‌ గ్రామాలకు వెళ్లే బస్సులలో ఒక్కో విద్యార్థికి రూ.9 వేలు, పట్టణ పరిధిలో రూ.6500 వసూలు చేసేవారు. కొన్నేళ్ళలోనే ఇది రెట్టింపు అయ్యింది. ఈ విద్యా సంవత్సరంలో రూరల్‌ విద్యార్థికి రూ.19,500, అర్బన్‌ పరిధిలో రూ.13 వేలుగా నిర్ణయించారు. చిన్న స్కూల్స్‌లో ఒకటో తరగతి ఫీజు రూ.15 వేలు ఉంటే బస్సు రవాణాకు రూ.19 వేలు. దీంతో తల్లిదండ్రులలో బస్సు ట్రాన్స్‌పోర్ట్‌ భారంగా మారింది. ఇద్దరు పిల్లలు స్కూల్‌ బస్సులకు చెల్లించే సొమ్ముతో పట్టణంలోనే ఏడాదిపాటు ఇల్లు అద్దె చెల్లించవచ్చనే ఆలోచనలు చేస్తున్నారు. బస్‌ భారంతో స్కూల్‌ విద్యలోనే తరగతి చదివించేందుకు భారీ మొత్తం అవుతుంది.

ప్రచారం కోసమేనా..

ప్రైవేట్‌ స్కూల్‌కు గుర్తింపు ఉండాలంటే.. అధిక ఫీజులు, బుక్స్‌కు ధర ఎక్కువ ఉండాలి. అన్ని ప్రాంతాలకు బస్సులు ఉండాలి. అప్పుడే మంచి స్కూల్‌గా గుర్తింపు వస్తుందనే కొన్ని స్కూల్స్‌ యాజమాన్యాలు భావిస్తున్నాయి. దీంతో చిన్న పాఠశాల నుంచి కార్పొరేట్‌ స్కూల్స్‌ వరకు బస్సు సౌకర్యంతో అన్నిచోట్ల పెట్టేశారు. జిల్లాలో 344 ప్రైవేట్‌ పాఠశాలల్లో లక్షా 38 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి వందల సంఖ్యలో బస్సులు ఉన్నాయి. బస్‌ రవాణాకే తల్లిదండ్రులు ఏడాదికి కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. దీనినిబట్టి చూస్తే స్కూల్‌ బస్సుల రవాణా ప్రయివేట్‌ యాజమాన్యాలకు వ్యాపారం.. తల్లిదండ్రులకు భారంగా మారింది.

Updated Date - Jun 11 , 2025 | 12:25 AM