స్కూల్ బస్సు బోల్తా
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:43 AM
ముదినేపల్లి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి):స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో స్కూల్ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు తీవ్రంగాను, పలువురికి స్వల్పంగాను గాయాలయ్యాయి.
ఇద్దరికి తీవ్రంగా, పలువురికి స్వల్పంగా గాయాలు
పెదకామనపూడి సమీపంలో ప్రమాదం.. విద్యార్థుల హాహాకారాలు
రక్షించిన స్థానికులు.. ఆసుపత్రులకు తరలింపు
స్టీరింగ్ రాడ్ విరిగిపోవడమే కారణం
ముదినేపల్లి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి):స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో స్కూల్ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు తీవ్రంగాను, పలువురికి స్వల్పంగాను గాయాలయ్యాయి. ముదినేపల్లికి చెందిన ఇండో సాక్సన్ స్కూలు బస్సు విద్యార్థులను ఎక్కించుకుని బుధవారం ఉదయం చిగురుకోట నుంచి ముదినేపల్లి బయలుదేరింది. పెదకామనపూడి సమీపంలో స్టీరింగ్ మెయిన్ రాడ్ విరిగి బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. బస్సులోని విద్యార్థులు హాహాకారాలు చేశారు. అరుపులు, కేకలు, ఏడుపులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఇది విని అటుగా వెళుతున్న వడాలికి చెందిన వీరంకి నాంచారయ్య, రాజా శివపార్వతి, మోర్త సింహాచలంతోపాటు స్థానికులు బస్సు అద్దాలు పగులకొట్టి విద్యార్థు లను, డ్రైవర్ ప్రభాకరరావును సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వీరిలో చిగురుకోట చెందిన చంద్రిక(8), ఆమె సోదరుడు సుమంత్(7)కు తీవ్రగాయాలు కాగా, మిగిలిన వారికి స్వల్పంగాను దెబ్బలు తగిలాయి. వీరిని ముదినేపల్లి, గుడివాడ ప్రభుత్వ, స్థానిక ప్రైవేటు ఆస్పత్రు లకు తరలించారు. విషయం తెలిసిన వెంటనే కైకలూరు సీఐ రవికుమార్, ఎస్‌ఐ వీరభద్రరావు, పోలీసు సిబ్బంది, తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చంద్రిక తండ్రి తమ్మా నరసింహారావు ఫిర్యాదు మేరకు ముదినేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 31 మంది విద్యార్థులు ఉన్నారు. ఘటనపై ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. విద్యార్థులను కాపాడిన స్థానికులను అభినందిం చారు. టీడీపీ నియోజక వర్గ సమ న్వయ కమిటీ కన్వీనర్ వీరమల్లు నరసింహా రావు తదితరులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
స్కూలు బస్సులపై 15 కేసులు నమోదు
ఏలూరు క్రైం/ముదినేపల్లి/కలిదిండి, ఆగస్టు 6(ఆంధ్ర జ్యోతి):పెదకామనపూడిలో ప్రైవేటు స్కూలు బస్సు బోల్తా ఘటనపై పోలీసు, రోడ్ ట్రాన్స్‌పోర్టు అఽథారిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ షేక్ కరీమ్ పర్యవేక్షణలో అధికారులు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థల బస్సులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 15 కేసులు నమోదు చేసి రూ.26 వేలు అపరాధ రుసు ము విధించారు. విద్యార్థులను తరలించే విషయంలో నిబంధనలు పాటించని విద్యా సంస్థల బస్సులను, ప్రైవేటు వాహనాలను సీజ్ చేస్తామని డీటీసీ కరీమ్ హెచ్చరించారు. ముదినేపల్లి, కలిదిండిలోని అన్ని ప్రైవేటు పాఠశాలల బస్సులను తనిఖీచేశారు. ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ ఆదేశాలతో కైకలూరు రూరల్ సీఐ వి.రవి కుమార్ ఆధ్వర్యంలో ఏలూరు మోటారు వెహికల్ ఇన్ స్పెక్టర్ సురేష్‌బాబు, ఎస్‌ఐలు వీరభద్రరావు, వి.వెంకటేశ్వ రరావు, కలిదిండి బ్రేక్ ఇన్‌స్పెక్టర్ స్వామి, బస్సుల ఫిట్‌నెస్, డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్సు లను, ఇతర పత్రాల ను పరిశీలించారు.