నరసాపురం సెంట్రల్ బ్యాంక్‌లో స్కాం!
ABN , Publish Date - May 06 , 2025 | 01:02 AM
నరసాపురం సెంట్రల్ బ్యాంకులో భారీ రుణ కుంభకోణం వెలుగు చూసింది.
రుణం తీసుకునేందుకు వారసులు వెళ్లడంతో వెలుగు చూసిన భారీ మోసం
ఇప్పటికే మీ భూమిపై రుణం తీసుకున్నారన్న బ్యాంకు అధికారులు
అవాక్కయ్యి.. నిలదీసిన హక్కుదారులు.. రాత్రి వరకు ఉద్రిక్తత
పోలీసుల విచారణ.. నిబంధనల ప్రకారం చేశామన్న మేనేజర్ ప్రకాశ్
నరసాపురం, మే 5 (ఆంధ్రజ్యోతి): నరసాపురం సెంట్రల్ బ్యాంకులో భారీ రుణ కుంభకోణం వెలుగు చూసింది. రైతులకు తెలియకుండా లీజు అగ్రిమెంట్లను సృష్టించి.. ఇద్దరు వ్యక్తులు బ్యాంకులో రూ.4 కోట్ల రుణం తీసుకున్నారు. లీజుకు ఇచ్చారని చెబుతున్న వారిలో ఓ రైతు నాలుగేళ్ల క్రితం చనిపోయారు. గత ఏడాది చనిపోయిన ఈ రైతు లీజుకు ఇచ్చినట్లు పత్రాలు సృష్టించారు. సోమవారం అసలు రైతులు బ్యాంకుకు వెళ్లి రుణం తీసుకునేందుకు పత్రాలు ఇవ్వగా.. ఈ భాగోతం వెలుగుచూసింది. దీంతో బ్యాంకు అధికారులను రైతులు నిలదీశారు. ఐదు గంటలపాటు బ్యాంకులో ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు విచారణ చేపట్టారు. అయితే మేనేజర్ ప్రకాశ్ అంతా నిబంధనల ప్రకారమే రుణం ఇచ్చామని చెబుతున్నారు. వివరాలివి..
నరసాపురం మండలం వేములదీవికి చెందిన అగ్ని కుల క్షత్రియ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తిరుమాని నాగరాజు, ఆయన సోదరుడు శ్రీనివాస్, తల్లి పద్మావతి, తండ్రి వడ్డీకాసులకు 19 ఎకరాల భూమిలో చెరువులు ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం వడ్డీకాసులు మృతి చెందారు. సోమవారం నాగరాజు, శ్రీనివాస్ రుణం కోసం ఓ జాతీయ బ్యాంకుకు పొలం దస్తావేజులు తీసుకువెళ్లారు. సర్వే నెంబర్లను పరిశీలించిన బ్యాంకు అధికారులు ఈ పొలాలపై నరసాపురం సెంట్రల్ బ్యాంకులో రుణాలు ఉన్నాయని చెప్పడంతో షాక్ తిన్నారు. వెంటనే ఆ బ్యాంకుకు వెళ్లి మేనేజర్ ప్రకాశ్‌ను నిలదీశారు. తమకు తెలియకుండా తమ పొలాలపై రుణం ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించారు. అయితే మేనేజర్ గత ఏడాది పట్టణానికి చెందిన కూనపరెడ్డి ప్రసాద్, డి.శేఖర్ పొలాలను లీజుకు చేస్తున్నట్లు అగ్రిమెంట్లు చూపించి రూ.4 కోట్లు రుణం తీసుకున్నట్లు తెలియజేశారు. దీంతో బాధిత రైతులు షాక్ తిన్నారు. కనీసం తమ దృష్టికి తీసుకురాకుండా అంత గుడ్డిగా ఇంత పెద్ద మొత్తంలో రుణాలు ఎలా ఇచ్చారంటూ నిలదీశారు. దీంతో బ్యాంకులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న నరసాపురం టౌన్ ఎస్‌ఐలు ముత్యాలరావు, జయలక్ష్మి బ్యాంకుకు చేరుకుని రికార్డులను పరిశీలించారు.
చనిపోయిన నాన్న పేరిట రుణం
మాకు వేములదీవిలో 19 ఎకరాలు భూమి ఉంది. నా పేరు, మా తమ్ముడు శ్రీనివాస్, అమ్మ పద్మ, నాన్న వడ్డీకాసుల పేరున ఈ పొలాలు ఉన్నాయి. మా నాన్న చనిపోయి నాలుగేళ్లు అయింది. మా పొలాలు, చెరువులను లీజ్ చేస్తున్నట్లు చూపించి రుణం తీసుకున్నారు. కనీసం రుణం ఇచ్చేటప్పుడు మా దృష్టికి బ్యాంకు అధికారులు తీసుకు రాలేదు. మృతి చెందిన మా నాన్న సంతకాలను ఫోర్జరీ చేశారు. విచారిస్తే ఎన్నో స్కాంలు వెలుగుచూస్తాయి.
–తిరుమాని నాగరాజు, వేములదీవి
ఆస్తుల్ని తాకట్టు పెట్టుకునే రుణం ఇచ్చారు
నేను బ్యాంకును, రైతులను మోసం చేయలేదు. రుణం కావాలని బ్యాంకుకు వచ్చా. వాళ్లే ఈ లీజు డాక్యుమెంట్లు అన్ని నాకిచ్చారు. నేను రైతులతో లీజుకు సంబంధించి ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. రుణం ఇప్పించ డంలో మరో మధ్య వ్యక్తి ఉన్నాడు. అతన్ని పట్టుకుని విచారిస్తే మొత్తం విషయం బయటకొస్తుంది. బ్యాంకు అధికారులు నా ఆస్తులను తాకట్టు పెట్టుకునే రుణం ఇచ్చారు. నేను ఇప్పటికే రూ.5 లక్షలు వడ్డీ కట్టా.
–కూనపరెడ్డి ప్రసాద్, వ్యాపారి
అంతా నిబంధనల ప్రకారమే..
అంతా నిబంధనల ప్రకారమే రుణం ఇచ్చాం. రైతుల పొలాలను లీజు చేస్తున్నట్లు రుణం తీసుకున్న ఇద్దరు వ్యక్తులు చూపించారు. వారిద్దరి ఆస్తులను తాకట్టు పెట్టుకునే లోన్ ఇచ్చాం. రుణం ఇచ్చేటప్పుడు చెరువులను పరిశీలించి ఇచ్చాం.
–ప్రకాశ్, మేనేజర్