Share News

రుణం మాకే ఇప్పించండి!

ABN , Publish Date - May 18 , 2025 | 11:17 PM

నిరుపేద ఎస్సీ సామాజిక వర్గంలో యువత మహిళలకు స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా వివిధ యూనిట్లను మంజూరు చేసింది.

రుణం మాకే ఇప్పించండి!

ఎస్సీ కార్పొరేషన్‌ యూనిట్లకు జోరుగా పైరవీలు

ఇదే అదునుగా కొందరు కమిషన్ల వసూలు

ఏలూరు రూరల్‌, మే 18 (ఆంధ్రజ్యోతి) : నిరుపేద ఎస్సీ సామాజిక వర్గంలో యువత మహిళలకు స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా వివిధ యూనిట్లను మంజూరు చేసింది. మొత్తం మూడు రకాల స్వయం ఉపాధి యూనిట్లు, వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా సబ్సిడీ ప్రకటించింది. ఈ క్రమంలో జిల్లాలో స్వయం ఉపాధి రుణ యూనిట్లకు పైరవీలు మొదలయ్యాయి. వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లల్లో ఎస్సీ కార్పొరేషన్‌ను పూర్తిగా మూసేసి రుణం అనేది మంజూరు చేయలేదు. ఇన్నేళ్ల తర్వాత పథకం అమలవుతుండడంతో ఎలాగైనా పథకం ద్వారా లబ్ధి పొందాలని కొందరు రాజకీయ ఒత్తిళ్లకు దిగుతున్నారు. ముఖ్యంగా ఈ పథకం కింద కార్లు, గూడ్స్‌ ట్రక్కులు, ఆటోలకు సబ్సిడీ రుణం వస్తుంది. రూ.పది లక్షల యూనిట్‌ విభాగంలో ఇచ్చే కార్లు, ట్రక్కులు, ఆటోలకు ప్రభుత్వం నుంచి నలభై శాతం సబ్సిడీ వస్తుండడం, మరో 55 శాతం బ్యాంక్‌ నుంచి రుణం మంజూరు కానుండడంతో తమకే రుణం వచ్చేలా చూడాలంటూ వివిధ పార్టీల నేతల చుట్టూ తిరుగుతున్నారు. ఖర్చు అయినా పర్వాలేదని పథకానికి ఎంపిక చేయాలంటూ అధికారులకు ఫోన్లు చేయిస్తున్నారు. అటు ఇదే అదనుగా కొందరు చోటా నేతలు దరఖాస్తుదారుల నుంచి ముందే కమీషన్లు పుచ్చుకుంటూ రుణ మంజూరుకు హామీలు ఇచ్చేస్తున్నారు. రూ.నాలుగు లక్షలు సబ్సిడీకి రూ.లక్ష ఇవ్వాలంటూ బేరాలు సాగిస్తున్నారు.

దరఖాస్తుల వెల్లువ.. జిల్లాకు 1,111 యూనిట్లు

జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సేవా సహకార సంస్థ ఆధ్వర్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ నిరుద్యోగ యువతకు సబ్సిడీతో కూడిన రుణాలు అందించేందుకు 1,111 యూనిట్లు మంజూరు చేసింది. ఇందుకు రూ.20 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. రూ.లక్ష నుంచి గరిష్ఠంగా రూ.పది లక్షల వరకు రుణాలను పొందేందుకు అవకాశం ఉంది. ఏలూరు జిల్లాకు 1111 యూనిట్లను మంజూరు చేయగా 6,045 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో యూనిట్‌కు 25 మంది పోటీ పడుతున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యుల్‌ ప్రకారం ఏప్రిల్‌ 14 నుంచి మే పదో తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించాలి. అయితే కొన్ని కారణాల వల్ల ఏడో తేదీ నుంచి ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ నిలిచిపోయింది. మరో రెండు, మూడు రోజుల్లో మళ్లీ వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 32 కేటగిరీలకు సంబంధించి వస్తు తయారీ, సేవల యూనిట్లకు రుణాలు అందిస్తున్నారు. ఈ సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంటుందన్నారు.

Updated Date - May 18 , 2025 | 11:30 PM