Share News

ఇసుక నిల్వలు సిద్ధం

ABN , Publish Date - Jul 09 , 2025 | 12:41 AM

జిల్లాలో వర్షాకాలం ఇసుక కొరత లేకుండా స్టాక్‌ పాయింట్ల వద్ద మొత్తం 1,39,945 మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వ చేశారు.

ఇసుక నిల్వలు సిద్ధం
ఉంగుటూరు స్టాక్‌ పాయింట్‌లో నిల్వ చేసిన ఇసుక

జిల్లాలో 5 స్టాక్‌ పాయింట్లు

1,39,945 మెట్రిక్‌ టన్నుల నిల్వ

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో వర్షాకాలం ఇసుక కొరత లేకుండా స్టాక్‌ పాయింట్ల వద్ద మొత్తం 1,39,945 మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వ చేశారు. భూగర్భ, గనుల శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్‌, మే నుంచి జిల్లాలోని స్టాక్‌ పాయింట్ల వద్ద ఇసుక నిల్వ చేశారు. పొరుగు జిల్లా తాడిపూడి ఇసుక ర్యాంప్‌ నుంచి జిల్లాకు కేటాయింపు మేరకు ఐదు స్టాక్‌ పాయిం ట్లకు తరలించారు. కూటమి ప్రభుత్వం ఇసుక పాలసీలో సమూల మార్పులు చేయడంతో సామాన్యులకు అందబాటులోకి వచ్చింది. వర్షాకాలం ఇసుక కొరత ఉండదని అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో ఐదు స్టాక్‌ పాయింట్లు

ఏలూరు జిల్లాలో పోలవరం, దెందులూరు నియోజకవర్గాలకు సమీపంలోనే ఇసుక నిల్వలు లభిస్తుండడంతో వీటిని మినహాయించి ఐదు చోట్ల ఇసుక స్టాక్‌ పాయింట్లను ఏర్పాటు చేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌, కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి సూచనలతో ఇసుక రవాణాకు టెండర్లు ఆహ్వానించారు. చింతలపూడి నియోజకవర్గానికి షన్వీ కనస్ట్రక్షన్స్‌, ఉంగుటూ రుకు కేవీవీఎస్‌ఎన్‌ ఎస్టేట్స్‌, ఏలూరు నియోజక వర్గానికి చొదిమెళ్ల వద్ద స్టాక్‌ పాయింట్‌ను బీఆర్‌సీ కనస్ట్రక్షన్స్‌, కైకలూరు(చావలిపాడు), నూజివీడు(మీర్జాపురం) స్టాక్‌ పాయిం ట్లను గోదావరి, కృష్ణా వాటర్‌వేస్‌ టెండర్లు దక్కించుకున్నాయి.

కైకలూరులో 9,561, చేబ్రోలు స్టాక్‌ పాయింట్‌ వద్ద 1,19,053, చింతలపూడి వద్ద 613 మెట్రిక్‌ టన్నులు, చొది మెళ్ల వద్ద 1023 మెట్రిక్‌ టన్నులు, నూజివీడుకు 9,695 మెట్రిక్‌ టన్నుల నిల్వలను ఉంచారు. ఉంగుటూరు వద్ద మెట్రిక్‌ టన్ను రూ.554, చింతలపూడి, ఏలూరుకు రూ.630, కైకలూరు, నూజి వీడుకు రూ.730 ధర జిల్లా కమిటి నిర్థారించింది. ఇప్పుడున్న నిల్వలు రాబోయే అక్టోబరు వరకు సరిపోతుందని అంచనా వేస్తున్నారు.

Updated Date - Jul 09 , 2025 | 12:41 AM