నిద్రపోతున్న నిఘా..!
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:20 AM
ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఏలూరు జిల్లాలోని చింతలపూడి, జీలుగమిల్లి మీదుగా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది.
సరిహద్దు దాటుతున్న ఇసుక
చింతలపూడి, జీలుగుమిల్లి మీదుగా తెలంగాణకు అక్రమ రవాణా
చోద్యం చూస్తున్న రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖలు
ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఏలూరు జిల్లాలోని చింతలపూడి, జీలుగమిల్లి మీదుగా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా తాడిపూడి నుంచి ఏలూరు జిల్లా అవసరాలకు కేటాయించిన 1.34లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకలో సింహభాగం తెలంగాణకు తరలిపోయింది. చెక్‌పోస్టులు లేకపోవడం, మైనింగ్ అధికారులు ఇసుక మాఫియాకు దారులు తెరిచేయడంతో ఇసుక తరలిపోతోంది. అక్రమార్కులకు కాసుల వర్షం కురుస్తోంది.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
గోదావరి జిల్లాల ఇసుక నాణ్యమైనది కావడంతో నిర్మాణాలకు అధికంగా వినియోగిస్తారు. స్థానిక అవ సరాలకు ఇసుక అందుబాటులో ఉండడంతో అక్ర మార్కులు రెచ్చిపోతున్నారు. స్థానికుల ఆధార్ నంబ ర్లు, ఫోన్ నెంబర్లు సేకరించి ఇసుకను సరిహద్దులను దాటించేస్తున్నారు. ఇటీవల ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్ వెట్రిసెల్వి నిఘా పెంచాలని ఆదేశించినా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావి స్తోంది. ఇసుక స్టాక్ పాయింట్ వద్ద సీసీ కెమెరాలు, పోలీస్ పహారా లేకుండా ఇసుక లోడు లారీలు సాగి పోతున్నాయి. దీనికి మైనింగ్, రెవెన్యూ శాఖల అండ దండలున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా జీలుగుమిల్లిలో ఇసుకను తరలిస్తున్న 5 లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రూట్ మారిందా..!
తెలంగాణ రాష్ట్రం నుంచి లారీలు తీసుకొచ్చి ఎవరు నింపుతున్నారనే కోణంలో మైనింగ్ అధికారు లు దృష్టి పెట్టడం లేదు. అన్ని తెలంగాణ రిజిస్ట్రేషన్ వాహనాలే వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. చింతలపూడి మండలంలోని యర్రగుంటపల్లి మీదు గా తెలంగాణకు ఇసుక తరలిపోతుండగా, ఇప్పుడు జీలుగమిల్లి మీదుగా రూట్ మారింది. జీలుగుమిల్లి మండలంలో కామయ్యపాలెం, రాచన్నగూడెం, తాటా కులగూడెం (తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు) మీదుగా ఇసుక తరలిపోతుంది. చెక్‌పోస్ట్ చాలా కాలం క్రితమే ఎత్తివేయడంతో అక్రమార్కులు రూట్ మార్చేశారు. చింతలపూడి ఇసుక పాయింట్ వద్ద నిల్వలు బయటకు వెళ్లకుండా అడ్డుకోవడంతో కొవ్వూ రు మీదుగా టి.నరసాపురం, కామవరపుకోట మండ లం మక్కినవారిగూడెం మీదుగా జీలుగుమిల్లి జాతీ య రహదారిపై తెలంగాణకు తరలిస్తున్నారు. జీలుగమిల్లి జాతీయ రహదారిపై చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తే ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టే అవకాశం ఉంది. జిల్లా అవసరాలకు కేటాయించిన ఇసుకను తరలిపోతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. వర్షాకాలం తర్వాత జిల్లాలో నిర్మాణాలకు అవసరం పెరుగుతుంది. నిఘా నిద్రపోవడంతో అక్రమార్కులు ఇసుకను అలవోకగా రాష్ట్రం దాటించేస్తున్నారు. అధికారులు ఇసుక అక్రమ తరలింపుపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఆర్టీఏ, రెవెన్యూశాఖల అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.
పోలీసుల అదుపులో 5 లారీలు
జీలుగుమిల్లి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ఇసుక అక్రమంగా తరలిస్తున్న లారీలను ఎస్సై వి.క్రాంతి కుమార్ అదుపులోకి తీసుకున్నారు. జీలుగుమిల్లిలో సోమవారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తుండగా కొవ్వూరు నుంచి తెలంగాణకు ఇసుక తరలిస్తున్న లారీలను గుర్తించారు. వాహనాల తనిఖీ చేసి రికార్డులు పరిశీలించి ఇసుకు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. 5 లారీలను స్వాధీనం చేసుకుని ఎస్సై కేసు నమోదు చేశారు. కొవ్వూరు నుంచి జీలుగుమిల్లి వయా మక్కినవారిగూడెం యర్రగుంటపల్లి మీదుగా తెలంగాణకు ఇసుక తరలిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు.