కరుగుతున్న ఉప్పు
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:44 AM
జిల్లాలో ఒకప్పుడు వేసవి వచ్చిందంటే తీరప్రాంతంలో ఎక్కడ చూసినా.. ఉప్పు మడులే దర్శనమిచ్చేవి. ఆరు నెలలపాటు సాగే ఈ పంట ప్రత్యేకంగా పరోక్షంగా వందలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించేది. లక్షల రూపాయల వ్యాపారం సాగేది.

వేల నుంచి వంద ఎకరాలకు.. పడిపోయిన సాగు
చినలంక, పీఎం లంక గ్రామాలకే పరిమితం
మార్కెట్‌లో కేజీ రూ.25, రైతుకు దక్కేది రూ.5
గిట్టుబాటు ధర లేక ప్రత్యామ్నాయం వైపు రైతులు
జిల్లాలో ఒకప్పుడు వేసవి వచ్చిందంటే తీరప్రాంతంలో ఎక్కడ చూసినా.. ఉప్పు మడులే దర్శనమిచ్చేవి. ఆరు నెలలపాటు సాగే ఈ పంట ప్రత్యేకంగా పరోక్షంగా వందలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించేది. లక్షల రూపాయల వ్యాపారం సాగేది. నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. నాలుగేళ్ల నుంచి సాగు విస్తీర్ణం తగ్గిపోతూ వచ్చేది. గత ఏడాది ఎనిమిది వందల ఎకరాల్లో సాగిన ఈ సాగు నేడు వంద ఎకరాల లోపే పరిమితమైంది. అది కూడా నరసాపురం మండలంలోని చినలంక, పీఎంలంక గ్రామాల్లోనే ఉంది.
నరసాపురం రూరల్ (ఆంధ్రజ్యోతి)
సాగు విస్తీర్ణం తగ్గడానికి కారణాలెన్నో..
ఇక్కడ పండిన ఉప్పు పంటను కృష్ణా, ఏలూరు, రాజమహేంద్రవరం, అమలాపురం తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. హోల్‌సేల్ వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేసి మార్కెట్‌లో అమ్ముతుంటారు. రిటైల్ మార్కెట్‌లో ఉప్పు రాశులు కేజీ రూ.25పైనే ఉంది. కానీ రైతులకు రూ.5 కూడా ఇవ్వడం లేదు. ఈ కారణంగానే గిట్టుబాటు కాక చాలా మంది రైతులు సాగుకు ఆసక్తి చూపించడం లేదు. ఇటు ప్రభుత్వం కూడా ఈ పంటకు గిట్టుబాటు కల్పించలేదు. కనీసం రైతులకు రుణాలు కూడా ఇవ్వడంలేదు. మరో కారణం నల్లిక్రిక్.. పోటుపాటులకు సముద్ర నీరు పొలాల్లోకి పోటెత్తుతుంది. ఈ కారణంగా కొన్నిసమయాల్లో పంటలు మునిగి పెట్టుబడు లన్నీ నీటి పాలవుతున్నాయి. నల్లిక్రిక్ పూడిక పనులు చేపట్టకపోవడం వల్లే కొంతమంది రైతులు సాగుకు మొగ్గు చూపడం లేదు.
మొదలైన ఉప్పు మడులు
ఉప్పు పంట ప్రకృతిపైనే ఆధారపడి పండుతుంది. ఎండ ఎంత తీవ్రతగా ఉంటే దిగుబడి అంత ఎక్కువగా ఉంటుంది. డిసెంబరులో మడులు కట్టే పనులు మొదలుపెడతారు. ఫిబ్రవరి వరకు ఈ పనులు జరుగుతాయి. ప్రతిరోజు మడుల్లో నీరు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు మట్టిని తొక్కుతుంటారు. ఇలా భూమి గట్టిబడిన తరువాత ఆ మడుల్లో నీరు నింపుతారు. ఎండలకు ఆ నీరు ఎండి ఉప్పుగా మారుతుంది. అత్యధికంగా ఏప్రిల్, మేలోనే దిగుబడి వస్తుంది. ఎకరానికి 30 నుంచి 40 వేల వరకు ఖర్చవుతుంది. ప్రకృతి అనుకూలించి ధర పలికితే రూ.70 వేల వరకు ఆదాయం వస్తుంది. ఈ విధంగా వచ్చిన ఆదాయాన్ని రైతులు మిగిలిన ఆరు నెలలు కుటుంబ పోషణకు వినియోగించుకుంటారు.
నల్లి క్రిక్ తవ్వితేనే సాగు పెంపు
నల్లిక్రిక్ పూర్తిగా పూడికపోయింది. ఈ కారణంగా పోటు పాటులకు నీరు పొలాల్లోకి వచ్చేస్తుంది. పొలాలు మునిగిపోయి పెట్టిన పెట్టుబడులన్నీ నీటిపాలవుతున్నాయి. దీంతో పాటు గిట్టుబాటు ధర ఉండడం లేదు. ఖర్చులు పెరిగాయి. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేదు.
– తిరుమాని సుబ్బు, పీఎంలంక, రైతు
గిడ్డంగులు లేవు
ఉప్పును భద్రపర్చుకునేందుకు తీరంలో గిడ్డంగులు లేవు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రోడ్లపక్కనే ఉప్పును దాచడం వల్ల ఆ నీరుకు కరిగిపోతుంది. ఇన్ని కష్టాల మధ్య సాగును చేయలేక ఉప్పు చేలును వదిలేస్తున్నారు. కొంతమంది ఆక్వా చెరువులకు లీజ్‌లకు ఇచ్చేస్తున్నారు.
– తిరుమాని నర్సింహస్వామి పీఎంలంక