Share News

శాప్‌ నిర్లక్ష్యం.. ఉన్నత చదువుకు దూరం

ABN , Publish Date - Sep 20 , 2025 | 12:53 AM

క్రీడాకారుల ప్రయోజనాన్ని కాపాడాల్సిన స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అధికారుల నిర్లక్ష్యం కార ణంగా నూజివీడుకు చెందిన బాస్కెట్‌బాల్‌ జాతీయ స్థాయి క్రీడాకారులు తమ అవకాశాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

శాప్‌ నిర్లక్ష్యం.. ఉన్నత చదువుకు దూరం
నూజివీడు విక్టోరియా టౌన్‌ హాలు గ్రౌండ్‌లో నిరసన చేపట్టిన క్రీడాకారులు

నూజివీడులో నిరసన చేపట్టిన బాధితులు

మంత్రులు పట్టించుకోవాలని వేడుకోలు..

(నూజివీడు టౌన్‌ – ఆంధ్రజ్యోతి)

క్రీడాకారుల ప్రయోజనాన్ని కాపాడాల్సిన స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అధికారుల నిర్లక్ష్యం కార ణంగా నూజివీడుకు చెందిన బాస్కెట్‌బాల్‌ జాతీయ స్థాయి క్రీడాకారులు తమ అవకాశాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 10వ తరగతి తరువాత ట్రిపుల్‌ ఐటీ సాధించటం విద్యార్థుల కల. గ్రామీణ స్థాయి విద్యార్థులకు అత్యున్నత సాంకేతిక విద్యను అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆర్జీయూకేటీలో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఇంజినీరింగ్‌కు సంబంధించి స్పోర్ట్స్‌ కోటా కింద నూజివీడుకు చెందిన ముగ్గురు విద్యార్థినిలు అర్జీ దాఖలు చేశారు. అండర్‌–14 నుంచి సీనియర్స్‌ వరకు ఈ విద్యార్థినులు జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొన్నారు. సంబందిత సర్టిఫికెట్లతో ఆర్జీయూకేటీలో అడ్మిషన్లకు అర్జీ దాఖలు చేశారు. స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లకు సంబంధించి జన్యూనెస్‌ సర్టిఫికెట్‌ను బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అధికారులు నిర్ధారించాల్సి ఉంది. బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ జన్యూనెస్‌ సర్టిఫికెట్స్‌ను శాప్‌ (స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌)కు పంపినా సంబంధిత సర్టిఫికెట్లను ట్రిపుల్‌ ఐటీకి జారీ చేయ టంలో తీవ్ర నిర్లక్ష్యం ఏర్పడింది. ఫలితంగా ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలకు నూజివీడుకు చెందిన క్రీడాకారు లకు అవకాశం లభించలేదు. మరోసారి జన్యూనెస్‌ సర్టిఫికెట్లను దాఖలు చేయాలని ఆర్జీయూకేటీ విద్యార్థులకు సమాచారం ఇచ్చింది. దీనిపై బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ను, శాప్‌ను విద్యార్థులు ఆశ్రయించగా, శాప్‌ నుంచి సరైన సమాధానం లభించలేదు. అన్ని అవకాశాలు ఉన్నా జన్యూనెస్‌ సర్టిఫికెట్ల జారీలో శాప్‌ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా నూజివీడుకు చెందిన బి.ప్రభుదీపిక, షేక్‌ అశ్రా, బర్రె ప్రణవిలు దాదాపు ఐదు నుంచి పది నేషనల్స్‌ ఆడినా క్రీడాకారులకు ట్రిపుల్‌ ఐటీలో అడ్మిషన్లు పొందలేని పరిస్థితి నెలకొంది. ఈ నెల 20వ తేదీ నుంచి ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలకు సంబంధించి స్పోర్ట్స్‌ కోటా కింద కౌన్సెలింగ్‌ను నిర్వహించవలసి ఉంది. ఇందుకు సంబంధించి ఆర్జీయూకేటీ 20 మందితో ఫైనల్‌ లిస్ట్‌ విడుదల చేయడంతో తమకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ క్రీడాకారులు నూజివీడులోని విక్టోరియా టౌన్‌హాల్‌ గ్రౌండ్‌లో నిరసనకు దిగారు. మంత్రులు నారా లోకేశ్‌, పార్థసారథి క్రీడాకారులకు జరిగిన అన్యాయాన్ని సరిచేసి వారికి అడ్మిషన్లు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Sep 20 , 2025 | 12:53 AM