బాలల దినోత్సవం నాడు పరీక్షలా?!
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:09 AM
బాలల దినోత్సవాన్ని పిల్లలకు దూరం చేసేలా ఈనెల 14న సమ్మేటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ–1) పరీక్షలను నిర్వహించడానికి విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్న డీఈవో వెంకటలక్ష్మమ్మ
రేపు జరగాల్సిన ఎస్‌ఏ–1 పరీక్షలు వాయిదా వేయాలని ఎన్టీఏ డిమాండ్
ఏలూరు అర్బన్, నవంబరు12(ఆంధ్రజ్యోతి):బాలల దినోత్సవాన్ని పిల్లలకు దూరం చేసేలా ఈనెల 14న సమ్మేటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ–1) పరీక్షలను నిర్వహించడానికి విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 10న ప్రారంభమైన సమ్మేటివ్ పరీక్షలు ఏకబికిన 19వ తేదీ వరకు రెండుపూటలా జరిగేలా ఇప్పటికే టైంటేబుల్ అమలవుతోంది. ఈ వ్యవధిలోనే బాలల దినోత్సవం వచ్చింది. సాధారణంగా చిల్డ్రన్స్ డే వేడుకలను అధికారికంగా ప్రభుత్వమే నిర్వహిం చడం ఆనవాయితీగా వస్తోంది. ఆ మేరకు ఈఏడాది బాలల దినోత్సవానికి మరొక్క రోజు మాత్రమే గడువు ఉండగా, ఆ రోజున పిల్లలకు నిర్వహిం చాల్సిన వినోద కార్యక్రమాలు, పోటీలపై విద్యాశాఖనుంచి బుధవారం రాత్రివరకు ఎటువంటి షెడ్యూలు విడుదలకాలేదు. ఇదే విషయాన్ని డీఈవో వెంకటలక్ష్మమ్మ కూడా ధ్రువీకరించారు. టైంటేబుల్ ప్రకారమే సమ్మేటివ్ పరీక్షలు జరుగుతాయని స్పష్టతనిచ్చారు. బాలల దినోత్సవం కార్యక్రమాలపై ఉన్నతాధికారులతో మాట్లాడతానన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 14న బాలల దినోత్సవాన్ని నిర్వహించాలా, వద్దా అనే దానిపై డైలమా నెలకొంది. వాస్తవానికి ఆ రోజున అన్ని పాఠశాలల్లో బాలబాలికలంతా ఉత్సాహంగా గడిపేందుకు వీలుగా టీచర్లు, హెచ్‌ఎంలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీనికిభిన్నంగా ప్రస్తుతం సమ్మేటివ్ పరీక్షలు జరుగుతుండడం చిల్డ్రన్స్ డే కార్యక్రమాల నిర్వహణ ప్రశ్నార్ధకంగా మారింది.
వాయిదాకు ఎన్టీఏ డిమాండ్
బాలల దినోత్సవం రోజున సమ్మేటివ్ పరీక్షలు జరిపేలా టైంటేబుల్‌ను నిర్ణయించడాన్ని తప్పుబడుతూ, ఆ రోజున అన్ని తరగతులకు జరగాల్సిన పరీక్షలను వాయిదావేయాలని డిమాండ్ చేస్తూ డీఈవో వెంకటలక్ష్మమ్మకు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రాంబాబు, రాము వినతిపత్రాన్ని బుధవారం అందజేశారు. ఆ రోజున జరగాల్సిన అన్ని తరగతుల పరీక్షలను మరో తేదీకి వాయిదా వేయాలని కోరారు.