Share News

మా ఊరికి బస్సులు నడపండి

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:34 AM

పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తాం. ఇదే మా తొలి ప్రాధాన్యం. బస్టాండ్లు, కాంప్లెక్స్‌లలో మౌలిక సదుపాయాలపై శ్రద్ధపెట్టాం. మరుగుదొడ్ల నిర్మాణం, మంచినీరు, కుర్చీలు, ఫ్యాన్లు మొదలైన వాటిని సమకూరుస్తున్నాం.

మా ఊరికి బస్సులు నడపండి
ఫోన్‌లో సమస్యలు వింటున్న ఆర్టీసీ ఆర్‌ఎం వరప్రసాద్‌

‘ఆంధ్రజ్యోతి ఫోన్‌ ఇన్‌’లో ప్రయాణికుల వినతి

అధ్వానంగా బస్టాండ్లు.. లోపలకు రాని బస్సులు

తణుకు బైపాస్‌లో ఆపాలి.. వృద్ధులకు కేటాయించిన సీట్లను ఇవ్వాలి

సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ ఆర్‌ఎం వరప్రసాద్‌ హామీ

నరసాపురం–శ్రీశైలం బస్సు ఏర్పాటు చేస్తాం

నరసాపురం–పామర్రు, భీమవరం–పలాస కొత్త సర్వీసులు

వినియోగంలోకి ఆకివీడు, కాళ్ల బస్టాండులు

‘పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తాం. ఇదే మా తొలి ప్రాధాన్యం. బస్టాండ్లు, కాంప్లెక్స్‌లలో మౌలిక సదుపాయాలపై శ్రద్ధపెట్టాం. మరుగుదొడ్ల నిర్మాణం, మంచినీరు, కుర్చీలు, ఫ్యాన్లు మొదలైన వాటిని సమకూరుస్తున్నాం. వీటిని ఈ నెల 30వ తేదీలోగా పూర్తి స్థాయిలో కల్పించేలా ఆదేశాలు ఇచ్చాం. అలాగే బస్సులు సమయానికి నడిచేలా చూస్తున్నాం’ అని జిల్లా ప్రజా రవాణాధికారి ఎన్‌వీఆర్‌ వరప్రసాద్‌ చెప్పారు. బుధవారం ఆంధ్రజ్యోతి నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వచ్చిన ఫోన్‌లకు సమాధానాలు ఇచ్చారు. వారు వెలిబుచ్చిన సమస్యలను నమోదు చేసుకుని, పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు ఎక్కువగా నూతన బస్‌ సర్వీస్‌ల ఏర్పాటు, బస్టాండుల్లో మౌలిక వసతుల నిర్వహణలలో లోపాలను ఆర్‌ఎం దృష్టికి తీసుకుని వచ్చారు. ఏ సమస్యలు ఉన్నా.. తమ దృష్టికి తేవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

(భీమవరం టౌన్‌/అర్బన్‌–ఆంధ్రజ్యోతి)

అధ్వానంగా బస్టాండ్‌లు

ఆకివీడు ఆర్టీసీ బస్టాండ్‌ అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. కంట్రోలర్‌ లేకపోవడంతో అజమాయిషీ కరువైంది.

– పుప్పాల సత్యనారాయణ, వైస్‌ చైర్మన్‌, ఆకివీడు

ఆర్‌ఎం : కంట్రోలర్‌ను ఏర్పాటు చేస్తాం. పలుచోట్ల రీక్వెస్ట్‌ స్టాప్‌లు అడుగుతున్నారు. ఈ కారణంగా బస్టాండ్‌లోకి వచ్చే ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంది.

కాళ్ల ఆర్టీసీ బస్టాండు నిరుపయోగంగా మారింది. బస్సులు ఆగడం లేదు.

– డి.రామకృష్ణ, కాళ్ల

ఆర్‌ఎం : బస్టాండులోకి వెళ్లడానికి కొన్ని అడంకులు ఉన్నాయి. పంచాయతీ అధికారులు వాటిని తొలగిస్తే తక్షణం బస్సులు ఆపుతాం.

బస్సు సర్వీసులు నడపాలి

20 ఏళ్ల క్రితం చినమిల్లిపాడుకు బస్సు నడిచేది. ఇప్పుడు నిలిపివేశారు. దీనివల్ల ఆకివీడు వచ్చి నాలుగు కిలోమీటర్లు వెళ్లేందుకు రూ.100 ఖర్చు చేయాల్సి వస్తోంది. బస్సు ఏర్పాటు చేయండి.

– సన్నాళ్ల మురళీకృష్ణ, చినమిల్లిపాడు

ఆర్‌ఎం : భీమవరం డిపో అధికారులతో రూట్‌ సర్వే చేయించి, బస్సు సదుపాయం కల్పిస్తాం.

భీమవరం నుంచి వయా వీరవాసరం, బ్రాహ్మణచెరువు మీదుగా కాకినాడకు ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ నడపండి.

– వై.విశ్వనాధ్‌, పొలమూరు

ఆర్‌ఎం : రూట్‌ సర్వే చేసి బస్సు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.

గతంలో భీమవరం నుంచి వీరవాసరం, బ్రాహ్మణచెరు వు మీదుగా తణుకుకు బస్సు సర్వీస్‌ ఉండేది. కాలక్రమేణ నిలిపేశారు. తిరిగి పునరుద్దరించండి.

–పి.మారుతీకృష్ణ, బీజేపీ పెనుమంట్ర మండల అఽధ్యక్షులు

ఆర్‌ఎం : ఈ రూట్‌పై పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం.

భీమవరం నుంచి యండగండి, పిప్పర, తాడేపల్లిగూడెం మీదుగా రాజమండ్రికి బస్సు నడపండి. ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది.

– గోపాల్‌, యండగండి

ఆర్‌ఎం : రూట్‌ పరిశీలన చేసి అవసరమైతే నడుపుతాం.

గతంలో పాలకోడేరు మీదుగా కొణితివాడ బస్సుఉండేది తీసేసారు. ఆలాగే పాలకోడేరు, తోలేరు మీదుగా పాలకొల్లుకు సర్వీసు నడిచేది ఆపేసారు. పరిశీలించి బస్సును ఏర్పాటు చెయ్యండి.

– ఆర్‌.సత్యనారాయణ, పాలకోడేరు.

ఆర్‌ఎం : రూటును పరిశీలించి ఆమోదయోగ్యంగా ఉంటే సర్వీస్‌ను నడిపేందుకు ప్రతిపాదనలు పంపిస్తాం.

గతంలో నరసాపురం నుంచి శ్రీశైలంకు బస్సు ఉండేది. ఏమైందో తెలియదు. ఆపేశారు. వారంలో చివరి మూడు రోజులు నడిపినా బాగుంటుంది.

– డి.వరలక్ష్మి, మాదివాడ

ఆర్‌ఎం : సూచన బాగుంది. దీనిపై చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటాం.

నరసాపురం నుంచి అమలాపురం వెళ్లాలంటే నేరుగా బస్సు లేదు. చించినాడ బైపాస్‌ దగ్గర దిగి బస్సు మారాల్సి వస్తోంది.

– ఎన్‌.వెంకటేశ్వరరావు, నరసాపురం

ఆర్‌ఎం : ప్రతిపాదన మంచిదే. పరిశీలిస్తాం.

నరసాపురం బైపాస్‌ మీదుగా విజయవాడకు బస్సు నడిపితే సౌకర్యంగా ఉంటుంది.

– చెరుకురి బాలాజీ, నరసాపురం.

ఆర్‌ఎం : ఇప్పటికే కాకినాడ డిపో నుంచి బస్సు నడుస్తోంది. అనుకున్నంత ఆక్యుపెన్సీ లేదు. అందువల్ల కొత్త బస్సు ఏర్పాటు చేయలేం.

ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ చదువుకునేందుకు తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాల నుంచి ఎక్కువ మంది విజయనగరం వెళుతున్నారు. ఇక్కడ నుంచి అక్కడకు వెళ్లేందుకు నేరుగా బస్సు సదుపాయం లేదు. ఎక్కువగా ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నాం. రాత్రి వేళల్లో ఈ బస్సు సదుపాయం కల్పిస్తే బాగుంటుంది.

– కె.భాస్కరరావు, తణుకు

ఆర్‌ఎం : తణుకు, తాడేపల్లిగూడెం నుంచి ప్రస్తుతం విశాఖపట్నం వరకే నడుస్తున్నాయి. వీటిని పొడిగించేందుకు వున్న అవకాశాలను పరిశీలిస్తాం.

బైపాస్‌లో బస్సులు ఆపాలి

విజయవాడ నుంచి వచ్చే ఎక్స్‌ప్రెస్‌ బస్సులన్నీ తణుకు బైపాస్‌లో ఆగడం లేదు. వై.జంక్షన్‌, బస్టాండ్‌లోనే దింపేస్తున్నారు. దీనివల్ల ఉండ్రాజవరం జంక్షన్‌ మీదుగా వెళ్లే వారంతా ఆటోలను పట్టుకుని రావాల్సి వస్తోంది. అదే ప్రైవేటు బస్సులైతే షర్మిష్ట, ఉండ్రాజవరం జంక్షన్‌లలో ఆపుతున్నారు. ఎక్కువ మంది వీటినే ఆశ్రయిస్తున్నారు.

– పీఎస్‌ఆర్‌ ఆంజనేయమూర్తి, తణుకు

ఆర్‌ఎం : దీనిపై సంబంధిత డిపో అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటాం.

వృద్ధులకు సీట్లు ఇవ్వండి

బస్సులో వృద్ధులకు కేటాయించిన సీట్లలో ప్రయాణికులు కూర్చుండడంతో వృద్ధులు నిలబడాల్సి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించాలి.

– బొబ్బిలి బంగారయ్య, వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు, ఆకివీడు

ఆర్‌ఎం : సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి వృద్ధులకు బస్సులో కూర్చునేందుకు ప్రాధాన్యత కల్పిస్తాం.

జిల్లాకు కొత్త బస్సులు

పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం డిపోలకు ఇటీవల కొత్తగా నాలుగు స్టార్‌లైన్‌ స్లీపర్‌, 12 సూపర్‌ లగ్జరీ, మూడు ఆలా్ట్ర డీలక్స్‌, రెండు ఎక్స్‌ప్రెస్‌ బస్సులు వచ్చాయి. భీమవరం నుంచి పలాసకు, నరసాపురం నుంచి పామర్రుకు కొత్త సర్వీసులు నడిపేందుకు ప్రతిపాదనలు పంపించాం. ఆమోదం రాగానే ఏర్పాటు చేస్తాం.

అధికారులకు ఆదేశాలు

ఆంరఽధజ్యోతి నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో ప్రజలు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి ఆర్‌ఎం వరప్రసాద్‌ తక్షణం స్పందించారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన చాంబర్‌లో జిల్లా ఆర్‌టీసీ అధికారులతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం వాటిని తనకు తెలియజేయాలని తెలిపారు.

Updated Date - Mar 13 , 2025 | 12:38 AM