Share News

ఇదేం న్యాయం!

ABN , Publish Date - Nov 20 , 2025 | 11:44 PM

ఆర్టీసీ పెట్రోల్‌ బంకులో నిధుల దుర్వినియోగంలో కిందిస్థాయి సిబ్బంది నలు గురిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ కేసులో చాలా కాలం కిందట పనిచేసిన అధికారులను విచారణ లోకి తీసు కోకుండా కిందిస్థాయి ఉద్యోగులపై వేటు వేయడంపై దుమారం రేగు తోంది.

ఇదేం న్యాయం!
ఏలూరు కొత్తబస్టాండ్‌ సమీపంలోని పెట్రోల్‌ బంకు

ఆర్టీసీ పెట్రోల్‌ బంకు నిధుల దుర్వినియోగం వ్యవహారం

నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్‌

అధికారులపై చర్యలు నిల్‌

నేడు ఆర్టీసీ యూనియన్ల ఆధ్వర్యంలో ధర్నా

ఏలూరు,నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ పెట్రోల్‌ బంకులో నిధుల దుర్వినియోగంలో కిందిస్థాయి సిబ్బంది నలు గురిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ కేసులో చాలా కాలం కిందట పనిచేసిన అధికారులను విచారణ లోకి తీసు కోకుండా కిందిస్థాయి ఉద్యోగులపై వేటు వేయడంపై దుమారం రేగు తోంది. అధికారులను కాపాడడానికే స్వాహా చేసిన మొత్తంలో కొంత సొమ్ము జమ చేయించి నట్టు తెలిసింది. కొంతకాలం క్రితం ఇక్కడ నుంచి బదిలీపై వెళ్లిన వారిని విచారించక పోవడం విమర్శలకు తావిస్తోంది.

ఏలూరు ఆర్టీసీ (పీటీడీ) కొత్తబస్టాండ్‌ సమీపంలోని పెట్రోల్‌ బంకులో నిధులు దుర్వినియోగంలో కిందస్థాయి సిబ్బంది నలుగురిపై అఽధికారులు వేటు వేయడం తీవ్ర దుమారం రేపుతోంది. వైసీపీ ప్రభుత్వం హయాంలో 2021లో ఏర్పాటు చేసిన ఈ పెట్రోల్‌ బంకులో ఫోన్‌ పే, గూగుల్‌ పే, ఇతర విధాలుగా వినియోగదారులు జమ చేసిన సొమ్ములను ప్రతిరోజు కొంత మొత్తాలను స్వాహా చేసేశారు. బంకు ఏర్పాటు చేసిన కాలం నుంచి ఆడిట్‌ జరగలేదు. చాలా కాలం తర్వాత ఇటీవల చేపట్టిన ఆడిట్‌లోనే ఉద్యోగులు బండారం బయటపడింది. తూతూమంత్రంగా విచారణ చేపట్టిన అధికారులు అప్పటి డివిజన్‌, జిల్లా స్థాయి అధికా రుల జోలికి వెళ్లకుండా నిధులు దుర్వినియోగం వ్యవహారం ఇటీవల తేల్చారు. ఇందులో మొత్తం రూ.83 లక్షలు మొత్తాలు దుర్వినియోగమైనట్టు నిర్ధారించారు. ఈకేసును తేల్చేయాలని నిర్ణయించిన అధికారులు బుధవారం పొద్దుపోయాక ఈ విభాగంలో సీనియర్‌ అక్కౌంటెంట్‌ ఎంఎస్‌ రావు, ఆడిట్‌ సెక్షన్‌ ఉద్యోగి సీహెచ్‌ సుందరయ్య, బంకు ఏడీసీ బాలరాజు, మెకానికల్‌ ఫోర్‌మెన్‌ ప్రేమ్‌ కుమార్‌లను డీపీటీవో షేక్‌ షబ్నం సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ వివరాలను గోప్యంగా ఉంచడం కొసమెరుపు.

ఆ పదిమంది సేఫ్‌..

నిధులు దుర్వినియోగంలో ఏలూరు డిపోలో పనిచేసిన అధికారులపై విచారణలు లేవు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొన్న 14 మందిలో 10 మంది దాదాపుగా రూ.50 లక్షల వరకు స్వాహా చేసిన మొత్తాలను తలో 5,10, 12 లక్షల చొప్పున ఆర్టీసీ బంకు అక్కౌంట్‌లో ఇటీవల జమ చేసినట్టు చెబుతున్నారు. ఇలా కట్టిన వారిలో కార్గో, డిపోల్లో పనిచేసిన డివిజన్‌ స్థాయి అధికారులు ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా సస్పెండైన నలుగురిలో ఒకరే ఎక్కువ మొత్తాలను పక్కదారి పట్టించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ విజిలెన్స్‌ అధికారులు విచారణలో ఎవరెంత అవినీతికి పాల్పడ్డారు? తప్పు చేసిందెవరో..? తేల్చకుండానే కేసును క్లోజ్‌ చేసే దిశగా పావులు కదుపుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఆర్టీసీ డిపో ముందు నేడు ధర్నా

ఉద్యోగులను బలి పశువులను చేస్తూ సస్పెండ్‌ చేయడంపై నిరసన గళమెత్తేందుకు ఆర్టీసీ సంఘాలు జేఏసీగా ఏర్పడి శుక్రవారం డిపో ముందు ఆందోళన చేయాలని నిర్ణయించాయి. ఇందులో దళిత సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఉద్యమించే దిశగా అడుగులు వేస్తున్నారు.

Updated Date - Nov 20 , 2025 | 11:44 PM