Share News

దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

ABN , Publish Date - Jun 22 , 2025 | 11:43 PM

ద్వారకాతిరుమలలో ఆర్టీసీ బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ అవ్వగా డ్రైవర్‌ చాకచక్యంతో పెనుప్రమాదం తప్పింది.

దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిన బస్సు

డ్రైవర్‌ చాకచక్యంతో తప్పిన ముప్పు ..

ఎనిమిది మందికి స్వల్ప గాయాలు

ద్వారకాతిరుమలలో ఘటన

ద్వారకాతిరుమల, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): ద్వారకాతిరుమలలో ఆర్టీసీ బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ అవ్వగా డ్రైవర్‌ చాకచక్యంతో పెనుప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న 80మంది ప్రయాణికుల్లో ఎనిమిది మందికి స్వల్పగాయాలయ్యాయి. వారిని స్థానిక పీహెచ్‌సీకి తరలించి ప్రఽథమ చికిత్స చేయించి పంపించారు. తణుకు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం సాయంత్రం ద్వారకా తిరుమల బస్టాండ్‌ నుంచి ప్రయాణికులతో తణుకుకు బయలుదేరింది. ఆలయ సెంటర్‌లో కొందరు ప్రయాణికులను ఎక్కించుకుని బస్సు బయలుదేరింది. డీసీసీబీ బ్రాంచి వద్దకు వచ్చేసరికి బ్రేక్‌ వదిలి వేయడంతో డ్రైవర్‌ శ్రీనివాస్‌ అప్రమత్తమై ఎడమవైపునకు బస్సును తిప్పాడు. బస్సు దూసుకుంటూ వెళ్లి రోడ్డు మార్జిన్‌లో కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి అనంతరం ఓ లాడ్జి శ్లాబ్‌ను తాకి ఆగింది. ప్రమాదంలో బస్సు ముందుభాగం పాక్షికంగా ఽధ్వంసం అయ్యింది. ద్వారకా తిరుమల పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిత్యం రద్దీగా ఉండే ఆ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించకపోతే బస్సు దిగువకు దూసుకెళ్లి ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు పేర్కొంటున్నారు.

Updated Date - Jun 22 , 2025 | 11:43 PM