Share News

పల్లెలకు రోడ్లు

ABN , Publish Date - Dec 19 , 2025 | 12:28 AM

గ్రామ పంచాయతీల రూపురేఖలు మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పాలనాపరమైన సంస్కరణలతో పల్లెలు అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నాయి.

పల్లెలకు రోడ్లు

సాస్కీ పథకంలో జిల్లాకు రూ.111.01 కోట్లు

207 కిలోమీటర్ల మేర 97 సీసీ రహదారులు

నాబార్డు నుంచి నిధులు.. కేంద్రం అంగీకారం

పరిపాలన అనుమతులిచ్చిన రాష్ట్రం

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

గ్రామ పంచాయతీల రూపురేఖలు మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పాలనాపరమైన సంస్కరణలతో పల్లెలు అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే పంచాయతీలను అప్‌ గ్రేడ్‌ చేశారు. ఏ ఏ మార్గాల్లో కేంద్రం నుంచి నిధులు తీసుకు రావాలో ఆ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం నిధులతో సీసీ రహదారులు, డ్రెయిన్‌లు నిర్మించారు. తాజాగా స్పెషల్‌ అసిస్టెన్స్‌ టు స్టేట్స్‌ ఫర్‌ కేపిటల్‌ ఇన్వెస్టిమెంట్‌ (సాస్కీ) పథకంలో నాబార్డు నుంచి పెద్ద మొత్తంలో నిధులను రాష్ట్రానికి కేటాయించింది. ఈ పథకం కింద కేంద్రం రాష్ర్టాలకు ఉచిత వడ్డీపై రుణాలను మంజూరు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు రూ.2,122.97 కోట్లు మంజూరు చేయగా, ఇందులో తొలిఫేజ్‌లో పశ్చిమ గోదావరికి రూ.111.01 కేటాయించారు. వీటితో 207.93 కిలోమీటర్ల మేర 97 సీసీ రహదారులు నిర్మించనున్నారు. ఈ మేరకు పరిపాలన అనుమతులు మంజూరుచేసింది. ఇప్పటికే పంచాయతీల నుంచి సీసీ రహదారుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. వాటిని పరిశీలించిన ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వీటికి టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టనున్నారు.

కొరత తీరినట్టే..

వైసీపీ హయాంలో పంచాయతీలకు పెద్దగా నిధులు మంజూరు కాలేదు. సచివాలయ భవనాల నిర్మాణానికే పెద్దపీట వేశారు. పంచాయతీల్లో రహదారులు, డ్రెయిన్‌లు నిర్మాణానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చేపట్టిన పనులకు సకాలంలో బిల్లులు మంజూరు చేయలేదు. దీంతో గడచిన ఎన్నికల ముందు ప్రతి పంచాయతీకి రూ.20 లక్షల వుంతున నిధులు కేటాయించినప్పటికీ పనులు చేపట్టలేకపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీలకు పండగొచ్చింది. ఉపాధి హామీలో రూ.47 కోట్లతో రహదారులు నిర్మించారు. తాజాగా ప్రతి నియోజకవర్గానికి రూ.4 కోట్లు వంతున మరో పర్యాయం ఉపాధి నిధులు మంజూరు చేస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం సాస్కీ పథకంలో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడంతో పంచాయతీల్లో జోష్‌ నెలకొంది.

Updated Date - Dec 19 , 2025 | 12:28 AM