గ్రావెల్ వేశారు.. తారు మరిచారు!
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:50 AM
పట్టణంలోని శ్రీనివాసపురం బీటీ ఆలస్యమ వడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. నవంబరు లో గ్రావెల్ పోసి తారు వేయకపోవడంతో రోడ్డు పై రాళ్లు పైకి లేచి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నా రు.
రాళ్లు పైకి లేచి ఇబ్బందుల పాలవుతున్న వాహనదారులు
210 మీటర్ల రోడ్డుపై ప్రయాణం నరకం
జంగారెడ్డిగూడెం,డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని శ్రీనివాసపురం బీటీ ఆలస్యమ వడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. నవంబరు లో గ్రావెల్ పోసి తారు వేయకపోవడంతో రోడ్డు పై రాళ్లు పైకి లేచి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నా రు. రోడ్డుపై దుమ్ము లేచి వాహనదారుల కళ్లలో పడు తోందని, రోడ్డుకు ఇరుపక్కలా ఉన్న ఇళ్ళలోకి దుమ్ము వచ్చి చేరడంతో వృద్ధులు,చిన్నపిల్లలతో అనారోగ్యాల బారి న పడుతున్నట్టు నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ సాధారణ నిధులు రూ.70 లక్షలు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.70 లక్షలు మొత్తం రూ.కోటి నలభై లక్షలతో స్థానిక లక్ష్మీనారాయణ థియేటర్ నుంచి బైపాస్ రోడ్డు వరకు 1100 మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులను అక్టోబరు 27న ప్రారంభించారు. కాంట్రాక్టర్ రోడ్డుపై గ్రావెల్‌తో లేయర్, స్టోన్ రస్ట్, వెట్ మిక్స్ వేసి వదిలేశారు. డిసెంబరు మొదటి వారంలో రోడ్డు పనులు పూర్తవుతాయని అధికారులు చెప్పినా నెల ఆఖరు వారంలోకి వచ్చినా ఇప్పటికీ రోడ్డు పనులు పూర్తి కాలేదు.
రెండు వందల పదిమీటర్ల రోడ్డుపై నరకయాతన
లక్ష్మీనారాయణ థియేటర్ నుంచి బైపాస్ రోడ్డు వరకు 1310 మీటర్ల రోడ్డు వేయాల్సి ఉండగా కేవలం 1100 మీటర్ల మేర రోడ్డుకు మాత్రమే నిధులు సరిపోవడంతో రెండు వందల పది మీటర్ల రోడ్డును వదిలేశారు. దీంతో ఆ కొద్ది రోడ్డుపై ప్రయాణం చేయాలంటే నరకం చూస్తున్నా మని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపెద్ద గ్రావెల్ రాళ్లు పైకి లేచి ద్విచక్ర వాహనాలు నడపలేక పోతున్నామని చెబుతున్నారు. ఇటీవల ఓ మహిళ తన ద్విచక్ర వాహనంపై ఆ రోడ్డులో వెళ్తూ ప్రమాదవశాత్తు కింద పడగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
‘శ్రీనివాసపురం రోడ్డులో మిగిలిన రెండు వందల పది మీటర్ల రోడ్డుకు మున్సిపల్ సాధారణ నిధుల నుంచి రూ.25 లక్షలు ఖర్చు చేయడానికి కౌన్సిల్ ఆమోదిం చింది.ప్రస్తుతం టెండర్ ప్రక్రియలో ఉంది. టెండర్ ఖరారు కాగానే రోడ్డు పనులు పూర్తి చేస్తాం’ అని మునిసిపల్ కమిషనర్ కేవీ రమణ తెలిపారు. ‘ ఇప్పటి వరకు రోడ్డును బాగా క్యూరింగ్ చేశాం. ఆ తడి ఆరకుండా తారు వేస్తే రోడ్డు త్వరగా పాడై పోతుంది.డిసెంబరు 26 తర్వాత తారు వేసి రోడ్డు పనులు పూర్తి చేస్తాం’ అంటూ రోడ్డు కాంట్రాక్టర్ ఎం.గాంధీ పేర్కొన్నారు.