Share News

ఆగుతూ..సాగుతూ!

ABN , Publish Date - Jul 08 , 2025 | 12:42 AM

ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జాతీయ రహదారి విస్తరణ పనులు ఏళ్ల తరబడి ముందుకు కదలడం లేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధి కారులు సమీక్షలు జరిపినా తుతూ మంత్రంగా పనులు ప్రారంభించి రెండు రోజు ల్లోనే ముగించేస్తున్నారు.

ఆగుతూ..సాగుతూ!
ముదినేపల్లిలో డ్రెయిన్‌ నిర్మాణానికి తవ్వి వదిలేసిన దృశ్యం

పామర్రు–దిగమర్రు 165 జాతీయ రహదారి విస్తరణ పనులు

ఏళ్ల తరబడి పూర్తికాని వైనం

పట్టించుకోని అధికారులు

అసంపూర్తి పనులతో ప్రమాదాలు

ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు, విద్యార్థులు

కైకలూరు, జూలై 7(ఆంధ్రజ్యోతి):

ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జాతీయ రహదారి విస్తరణ పనులు ఏళ్ల తరబడి ముందుకు కదలడం లేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధి కారులు సమీక్షలు జరిపినా తుతూ మంత్రంగా పనులు ప్రారంభించి రెండు రోజు ల్లోనే ముగించేస్తున్నారు. ప్రణాళికా బద్ధంగా విస్తరణ పనులు నిర్వహిం చాల్సి ఉన్నా ఎన్‌హెచ్‌ అధికారులు ఉదాసీనతతో లేక కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యమో తెలియదు కానీ ప్రజల పాలిట శాపంగా మారింది.

కృష్ణా జిల్లా పామర్రు నుంచి పశ్చిమగోదావరి జిల్లా దిగమర్రు వరకు 165వ జాతీయ రహదారి విస్తరణ పనులు ఆరేళ్ల క్రితం ప్రారంభమ య్యాయి. అయితే నేటికీ ఈ పనులు పూర్తి కాలేదు. కైకలూరు నియోజకవర్గంలో భైరవ పట్నం నుంచి పెదపాలపర్రు వరకు 60 శాతం పనులు పూర్తయినా పలుచోట్ల పూర్తి స్థాయిలో పనులు నిర్వహించలేదు. కైకలూరు మండలంలో శింగాపురం నుంచి ఆలపాడు వరకు రహదారి నిర్మాణం ప్రజలకు దినదిన గండంగా మారింది. ఎక్కడికక్కడే విస్తరణ పనుల కోసం తవ్వకాలు చేసి వదిలివేయడం తో వాహనదారులు, విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాత్రుళ్లు రహదారి కనిపించక ప్రమాదాలబారిన పడు తున్నారు. శింగాపురంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రహ దారిపై దుమ్ము, రాళ్లు లేచిపోయి వాహన దారులపై పడుతున్నాయి. భుజబలపట్నం జడ్పీ హైస్కూల్లో చదువుతున్న విద్యార్థులపై రాళ్లు ఎగిరిపడి గాయపడ్డారు. దీంతో కొద్ది మేర విస్తరణ పనులు పూర్తిచేసి ఏడాదిగా మరలా వదిలివేశారు. రోడ్డు విస్తరణ కోసం రెండేళ్ల క్రితం తవ్విన గోతుల్లో తుమ్మ మొక్క లు, జమ్ము దట్టంగా పేరుకుపోయింది. శింగా పురం నుంచి ఆలపాడు వరకు ఇదే పరిస్థితి నెలకొంది. పలుచోట్ల పంటబోదెలపై కల్వర్టుల నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో చేపట్టలేదు. ఎక్క డ చూసినా రహదారి సగభాగం తవ్వేసి వదిలివేయడంతో వాహనదారులు ప్రమాదా లకు గురవుతున్నారు.

డ్రెయిన్ల నిర్మాణంలో అష్టవంకర్లు..

ప్రణాళికబద్ధంగా విస్తరణ పనుల్లో డ్రెయి నేజీ నిర్మాణం చేయాల్సి ఉండగా నిబంధన లను తుంగలో తొక్కి కాంట్రాక్టర్‌ ఇష్టాను సారంగా అష్టవంకర్లు తిప్పుతూ డ్రెయినేజీ నిర్మాణాన్ని చేపట్టారు. ముదినేపల్లిలో రహదారికి ఇరువైపుల డ్రెయినేజీ నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి. దీంతో చిన్నపాటి వర్షానికి రహదారిపై ప్రయాణించలేని పరిస్థితులు నెల కొన్నాయి. మండవల్లిలో నాలుగు లైన్ల రహదారి నిర్మాణాన్ని చేపట్టారు. మధ్యలో డివైడర్‌ను ఏర్పాటు చేశారు. అయితే అనేకచోట్ల భూసమస్యలు తలెత్తడంతో గ్రామంలో డివైడర్‌ లేకుండా కొద్దిమేర నిర్మాణం చేశారు. రహదారిని కుదించి నిర్మాణం చేస్తున్నారు. డ్రెయిన్‌ నిర్మాణంలో భూసేకరణ జరగని ప్రదేశాల్లో అష్టవంకర్లు తిప్పుతూ నిర్మాణం చేశారు. కొన్నిచోట్ల నిర్మాణాన్ని వదిలివేశారు.

పల్లెవాడలో ప్రారంభం కాని బైపాస్‌

కైకలూరు మండలం పల్లెవాడలో ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారిలో అనేక మలు పులు ఉండడంతో పూసపాటి అమ్మవారి ఆలయం నుంచి ఎలాంటి మలుపులు లేకుండా బైపాస్‌ నిర్మాణం చేసేందుకు ప్రణాళిక చేశారు. అందుకు కావాల్సిన భూసేకరణ జరిగిన ప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణపు పనులు చేపట్టలేదు. సుమారు రెండు కిలోమీటర్ల మేర ఈ రహదారి నిర్మాణం చేయాల్సి ఉండగా నేటికీ పనులు ప్రారంభించలేదు.

పనులు పూర్తిచేయకపోతే ఆందోళన

ఐదేళ్లుగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టినా నేటికీ పూర్తికాలేదు. ఎక్కడికక్కడ రహదారి తవ్వేసి వదిలివేయడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. వేసవిలో పనులు చేయ కుండా వర్షాకాలంలో పనులు ప్రారంభించి రెండు రోజుల్లో తూతూమంత్రంగా ముగించేస్తున్నారు. నిరంతరాయంగా విస్తరణ పనులు చేపట్టి పూర్తి చేయకుంటే ఆందోళన చేస్తాం.

– కంతేటి సాయి, భుజబలపట్నం గ్రామస్థులు

Updated Date - Jul 08 , 2025 | 12:42 AM