Share News

రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తాం

ABN , Publish Date - Jul 31 , 2025 | 12:31 AM

చనుబండ శివారు సూరంపాలెంలో ఆక్రమణకు గురైన రోడ్డు వ్యవహారంపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో రైతులు ఆందోళన చేశారు. ఫలితంగా అధికారుల్లో కదలిక వచ్చింది. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తాం
రోడ్డు ఆక్రమణ పరిశీలిస్తున్న ఎస్‌ఐ, తహసీల్దార్‌, అధికారులు

చాట్రాయి, జూలై 30(ఆంధ్రజ్యోతి):చనుబండ శివారు సూరంపాలెంలో ఆక్రమణకు గురైన రోడ్డు వ్యవహారంపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో రైతులు ఆందోళన చేశారు. ఫలితంగా అధికారుల్లో కదలిక వచ్చింది. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ భూములకు వెళ్లే రోడ్డు ప్రారంభంలో ములగలపాటివారిపాలెంకు చెందిన పొద్దుటూరు రాములు కొంత భూమి ఆక్రమించి షెడ్డు నిర్మిస్తున్నాడని రెండు నెలల క్రితం రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ భూమి చాట్రాయి, విస్సన్నపేట మండలాల్లో ఉండడంతో రెండు జిల్లాల కలెక్టర్లకు, పోలీస్‌, రెవెన్యూ ఆర్‌అండ్‌బీ అధికారులకు అర్జీలు సమర్పించినా స్పందించలేదు. దీంతో టీడీపీ నాయకుడు నక్కా రాము ఆధ్వర్యంలో మంగళవారం రైతులు విజయవాడ–సత్తుపల్లి రహదారిపై రాస్తారోకో చేశారు. బుధవారం విస్సన్నపేట తహసీల్దార్‌ లక్ష్మీ కల్యాణి, చాట్రాయి డీటీ ఈశ్వరరావు, ఎస్‌ఐలు డి.రామకృష్ణ, జి.రామకృష్ణ కదలివచ్చారు. తామంతా చందాలు వేసుకొని రూ.ఐదు లక్షలతో రెండు కిలో మీటర్ల మేర రోడ్డు వేసిన తర్వాత ఆక్రమించుకోవడంతో పొలాల్లోకి వెళ్లే దారి లేక భూములు సాగు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని అధికారులు రైతులకు హామీ ఇచ్చారు. తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2025 | 12:31 AM