Share News

ఆర్‌ఎంపీ.. పీఎంపీల వైద్యంతో ప్రాణం పోతోంది..!

ABN , Publish Date - Sep 04 , 2025 | 12:34 AM

ఉమ్మడి పశ్చిమ గోదావరిలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ. ప్రస్తుతం ప్రాథమిక వైద్య చికిత్సల పేరుతో ఫస్ట్‌ఎయిడ్‌ సర్టిఫికెట్లను పొందినవారు వైద్యుల అవతారం ఎత్తేశారు.

ఆర్‌ఎంపీ.. పీఎంపీల వైద్యంతో ప్రాణం పోతోంది..!

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

చీమకుట్టినా యాంటీబయోటిక్స్‌, స్టెరాయిడ్స్‌

బలవుతున్న ఉమ్మడి జిల్లాలో గ్రామీణ ప్రజలు

విచ్చలవిడిగా క్లినిక్‌, ల్యాబ్‌లు

కొందరు పీఎంపీ, ఆర్‌ఎంపీలు లక్షాధికారులు!

ఉమ్మడి పశ్చిమ గోదావరిలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ. ప్రస్తుతం ప్రాథమిక వైద్య చికిత్సల పేరుతో ఫస్ట్‌ఎయిడ్‌ సర్టిఫికెట్లను పొందినవారు వైద్యుల అవతారం ఎత్తేశారు. కాలు తెగినా కట్టు కట్టాలే తప్ప కుట్లు వేయడానికి అర్హత లేని వారు డాక్టర్‌ బోర్డులు పెట్టుకుని క్లినిక్‌లు, ల్యాబ్‌లను నిర్వహిస్తున్నారు. మరి కొంతమంది మెడికల్‌ షాపులు, ఆసుపత్రులు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. సినిమాలో శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ చేయడానికి మోసం చేస్తే నిజ జీవితంలో ఆర్‌ఎంపీలు ఏకంగా వైద్యం చేసేస్తున్నారు.! అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే కొన్ని చోట్ల ప్రాణాంతక సమస్యలు తలెత్తుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు.

ఉంగుటూరు మండలానికి చెందిన ఒక వైద్యుడు ఆర్‌ఎంపీలపై హైకోర్టులో కేసు వేయగా ఆర్‌ఎంపీలు సొంతంగా వైద్యం చేయకూడదని, క్వాలిఫైడ్‌ ఎంబీబీఎస్‌ వైద్యులు ఇచ్చిన ప్రిస్ర్కిప్షన్‌లోని మందులను, ఇంజక్షన్లను మాత్రమే చేయడానికి రోగికి సలహాలు ఇవ్వాలే తప్ప వారు సొంతంగా ప్రిస్ర్కిప్షన్‌ రాయకూడదని తీర్పు ఇచ్చారు. సుప్రీంకోర్టు కూడా ఇలాంటి తీర్పులే ఇచ్చినప్పటికీ అమలు చేయడంలో ప్రభుత్వాలు వైఫల్యం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులు లక్షాధికారులుగా మారిపోతున్నారు.

జంగారెడ్డిగూడెం మండలంలోని ఒక ఆర్‌ఎంపీ వల్ల ఒక వ్యక్తి కళ్లు పోగొట్టుకున్నాడు. మరో యువకుడు మోకాళ్లు అరిగిపోయాయి.

గిరిజన ప్రాంతంలో ఒక మహిళ ఆర్‌ఎంపి వైద్యురాలి చేతిలో గిరిజన మహిళ ప్రాణాలే కోల్పోయింది.

ఈనెల 2న ఏలూరులో ఒక మహిళ జ్వరం వచ్చిందని వంగాయిగూడెంలో ఉన్న ఆర్‌ఎంపీ సురేష్‌బాబు అలియాస్‌ నాని వద్దకు వెళ్లగా రెండు ఇంజక్షన్లు చేసి ప్రాణాలు గాలిలో కలిపేశాడు.

ఏలూరులోని ఒక ఆర్‌ఎంపీ మూడేళ్ల పసిబిడ్డకు వైద్యం చేసి ప్రాణాలు గాలిలో కలిపేశాడు. చివరకు ఆ కుటుంబానికి లక్షల పరిహారం చెల్లించుకుని పోలీస్‌ కేసు నుంచి బయటపడ్డాడు.

ఏలూరు క్రైం, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు ఐదు వేల మందికిపైగా ఆర్‌ఎంపీలు, పీఎంపీలుగా పనిచేస్తున్నారు. వీరు గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులుగా అవతారం ఎత్తి సూపర్‌ స్పెషలిస్టులుగా వెలుగొందే ప్రయ త్నాలు చేస్తూ ప్రజలపై తమ వైద్య ప్రయోగాలు చేస్తున్నారు. మరికొంత మంది తమ హస్తవాసి మంచిదంటూ ఆపరేషన్లు కూడా చేసి ప్రాణాలను గాలిలో కలిపేస్తు న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రాత్రివేళ ప్రభుత్వ వైద్యులు, క్వాలిఫైడ్‌ వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్లే ఆర్‌ఎంపీలు, పీఎంపీలు తెల్లవారితే వారి గుమ్మంలో వాలుతున్నారు. సమయానికి వైద్యం చేయడంతో ప్రజల్లో వారిపై నమ్మకం కలుగుతోంది.

యాంటీ‘భయా’టిక్స్‌

కొందరు ఆర్‌ఎంపీలు ప్రమాదకర యాంటీబయోటిక్స్‌, స్టెరాయిడ్స్‌ రాస్తున్నారు. చీమకుట్టి దద్దుర్లు వచ్చినా ఇవే. ఉమ్మడి జిల్లాలో పది సాధారణ మరణాలు జరిగితే పరోక్షంగా ఆర్‌ఎంపీల ప్రభావం 50 శాతం ఉంటుందని చెప్పవచ్చు. వారు ఇచ్చిన స్టెరాయిడ్స్‌, అత్యధిక పవర్‌ కల్గిన యాంటీబయోటిక్స్‌ వల్ల తదుపరి వైద్యం చేయడానికి ఆస్కారం లేకుండా పోతుంది.

కార్పొరేట్‌ హాస్పిటల్స్‌తో ఒప్పందం

కొంత మంది ఆర్‌ఎంపీలు, పీఎంపీలు కార్పొరేట్‌ సంస్ధలతో ఒప్పందాలు చేసుకుని తమ ప్రాంతాల నుంచి రోగులను పంపించి పర్సంటేజీలను అందుకుంటున్నారు. ఇంకా కొంత మంది ఆర్‌ ఎంపీలు, పీఎంపీలు జనరిక్‌ మందులను కొనుగోలు చేసి ప్రజలకు ఇచ్చి అడ్డంగా సొమ్ములను వసూలు చేసుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతం, గిరిజన ప్రాంతాల్లో వారి హవా ఎక్కువ.

వృద్ధుల ప్రాణాలతో చెలగాటం

కొంత మంది ఆర్‌ఎంపీ, పీఎంపీలు వృద్దుల ప్రాణాలతోనే చెలగాటం అడుతున్నారు. వృద్ధులు దూర ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రులకు వెళ్లలేక, తమ కుటుంబ సభ్యులకు ఖాళీలేక ఊరిలో ఆర్‌ఎంపీలను ఆశ్ర యిస్తు న్నారు. ఇదే అదునుగా వారు ఆ క్షణంలో ఆర్‌ఎంపీలు సూపర్‌ స్పెషలిస్టులుగా అవతారం ఎత్తి యాంటీబయోటిక్స్‌ను, స్టెరాయిడ్స్‌ను ఇవ్వడంతో వారు కోలుకుంటున్నారు. కానీ చాపకింద నీరులా ఆ మందులు వాడినకి వ్యాధి నిరోధక శక్తి క్రమేపీ తగ్గిపోతుంది. తరువాత చిన్న వ్యాధిని కూడా తగ్గించు కోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

షుగర్‌.. బీపీ సమస్యలు

ఆర్‌ఎంపీలు, పీఎంపీల వద్ద వైద్యం చేయించుకున్న వారికి 15 ఏళ్లలోపే షుగరు, బీపీలు వస్తున్నాయని ఇటీవల జరిగిన ఒక పరిశోధన లో స్పష్టమైంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆర్‌ఎంపీలు, పీఎంపీలపై తనిఖీలు లేకపోవడంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారు. కేవలం ఫస్ట్‌ఎయిడ్‌ సర్టిఫికెట్‌ లేదా ప్రైవేటు మెడికల్‌ ప్రాక్ట్సీనర్‌ సర్టిఫికెట్‌ పొంది వైద్యుల అవతారం ఎత్తుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖాధికారు ప్రత్యేక దాడులు నిర్వహించి ప్రజల ప్రాణాలు గాలిలో కలవకుండా కాపాడాలని పలువురు కోరుతున్నారు.

కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలి

ఆర్‌ఎంపీ, పీఎంపీల వైద్య సేవలపై సుప్రీం కోర్టు, హైకోర్టు ఎన్నో తీర్పులు వెలువరించాయి. ప్రభుత్వాలు అమలు చేయకపోవడం వల్ల ప్రజలు ప్రాణాలకు ముప్పు తలెత్తింది. అరకొర పరిజ్ఞానంతో కొంత మంది ఆర్‌ఎంపీ, పీఎంపీలు స్టెరాయిడ్స్‌, యాంటీబయోటిక్స్‌ ఇచ్చేస్తున్నా రు. దీనివల్ల ఆ పేషెంటుకు భవిష్యత్తులో ఎలాంటి వ్యాధి వచ్చినా మందులు పనిచేయడం లేదు. ఆర్‌ఎంపీల వైద్యం వికటించి ప్రాణాలు పోతున్నాయి. తెలిసీతెలియని వైద్యంతో మానవ శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతోంది. దీనివల్ల చిన్న వయసులోనే షుగరు, బీపీ, కిడ్నీలు పోవడం, కాలేయం వంటి అవయవాలు, ఎముకల వ్యాధులు వస్తున్నాయి. ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాలి.

డాక్టర్‌ సి.శ్రీనివాసరాజు, వైస్‌ చైర్మన్‌, హాస్పటల్స్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా

Updated Date - Sep 04 , 2025 | 12:34 AM