Share News

వైద్యంపై విజిలెన్స్‌

ABN , Publish Date - Nov 23 , 2025 | 12:26 AM

వైసీపీ హయాంలో అక్రమ మార్గాల్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లిన ఏలూరు చైత్ర ఆసుపత్రి నేడు అదే బాణిలో పేదల నుంచి అడ్డగోలుగా దోచుకుంటున్నది.

వైద్యంపై విజిలెన్స్‌
ఆసుపత్రిలో తనిఖీలు

నిబంధనలకు విరుద్ధంగా ఏలూరు చైత్ర ఆసుపత్రి నిర్వహణ

గడువు తీరిన మందుల విక్రయం.. వినియోగం

ఉచిత వైద్యానికి పరీక్షల పేరిట సొమ్ము వసూళ్లు

అనుమతులు లేని భవనంలో ఆసుపత్రి

పేషెంట్లు కట్టిన సొమ్ములకు ఇవ్వని బిల్లులు

అనుమతులు లేకుండా యంత్రపరికరాల వినియోగం

భవన నిర్మాణంలో లోపాలు.. రోడ్డుపైనే జనరేటర్‌

విజిలెన్స్‌ ఆధ్వర్యంలో పలు శాఖల తనిఖీల్లో వెల్లడి

ఏలూరు క్రైం, నవంబరు 22(ఆంధ్ర జ్యోతి):వైసీపీ హయాంలో అక్రమ మార్గాల్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లిన ఏలూరు చైత్ర ఆసుపత్రి నేడు అదే బాణిలో పేదల నుంచి అడ్డగోలుగా దోచుకుంటున్నది. దీనిపై అందిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం కన్నెర్ర చేసింది. రాష్ట్ర విజిలెన్స్‌ డీజీ ఆదేశాల తో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విజిలెన్స్‌ ఎస్పీ కె.నాగేశ్వరరావు పర్యవేక్షణలో డీఎస్పీ ఎస్‌.వెంకటేశ్వరరావు, డీఈ శ్రీనివాసన్‌, ట్రాన్స్‌ కో, వైద్య ఆరోగ్య శాఖ, అగ్నిమాపక, ఏలూరు టౌన్‌ప్లానింగ్‌, జిల్లా డ్రగ్స్‌ కంట్రోల్‌, విద్యుత్‌ శాఖ అధికారులు సంయుక్తంగా ఏకకాలంలో శనివారం ఉదయం ఏలూరు అశోక్‌నగర్‌లోని చైత్ర ఆసుపత్రిపై దాడి చేసి తనిఖీలు చేపట్టారు. ‘తనిఖీల్లో ఆసుపత్రిలో గడువు తీరిన మం దులు లభించాయి. రోగులకు బిల్లులు ఇవ్వడం లేదు. ఫలితంగా ప్రభుత్వానికి కట్టాల్సిన జీఎస్టీ చెల్లించడం లేదు. ఆరోగ్య శాఖ నుంచి అనుమతులు లేకుండా వైద్య యంత్ర పరికరాలు వినియోగిస్తున్నారు. ఎక్స్‌రే, ఆల్ర్టా సౌండ్‌ పరీక్షలకు అనుమతులు లేనప్పటికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్‌ వైద్యసేవలో చేయాల్సిన ఉచిత ఆపరేష న్లకు వివిధ టెస్టుల పేరుతో సొమ్ములను వసూలు చేస్తున్నారు. భవన నిర్మాణంలో లోపాలు ఉన్నాయి. పార్కింగ్‌ స్థలంలో మెడికల్‌ షాపు, డాక్టర్‌ రూమ్‌ నిర్మించారు. రోడ్డుపైనే జనరేటర్‌ బిగించారు. రోడ్డును ఆక్రమించి పార్కింగ్‌గా వాడుతున్నారు. అనుమతికన్నా అక్రమంగా విద్యుత్‌ లోడును వినియోగిస్తున్నారు. అగ్ని ప్ర మాదం జరిగితే మంటలను ఆర్పడానికి అవ సరమైన పరికరాలు లేవ’ని గుర్తించారు. వైద్యులు, సిబ్బందికి అర్హతలు, వేర్వేరు ఆసు పత్రుల్లో ఏమైనా రిజిస్టర్‌ అయ్యారా ? అనే కోణంలోను పరిశీలన చేస్తున్నారు. సాయంత్రం వరకు తనిఖీలు నిర్వహించి అక్కడి లోపాలపై ఏ శాఖకు ఆ శాఖ నివేదికలను సిద్ధం చేసి విజిలెన్సు అధికారులకు అందించారు. విజిలెన్సు ఎస్పీ కె.నాగేశ్వరరావు ఈ నివేదికను రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించనున్నారు.

కరోనా సమయంలో ఆసుపత్రిలో బాధితుల నుంచి అధిక మొత్తం లో సొమ్ములు వసూలు చేయడం, ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో వాడాల్సిన రెమిడిసివర్‌ ఇంజక్షన్లు ఈ ఆసుపత్రిలో ఉండడాన్ని గుర్తిం చి అప్పట్లో చర్యలు తీసుకున్నారు. దాడుల్లో విజిలెన్సు డీఎస్పీ సింగులూరి వెంకటేశ్వరరావు, విజిలెన్స్‌ డీఈ శ్రీనివాసన్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ విక్రమ్‌, విజిలెన్సు సీఐ గంగాభవాని, జీఎస్టీ అధికారి కృష్ణ తాతాజీ, డీఎంహెచ్‌వో శాఖ తరపున కావ్య, విజిలెన్స్‌ ఎస్‌ఐలు రంజిత్‌, నాగరాజు, ఏవో మీరయ్య పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2025 | 12:26 AM