Share News

రైతులకు మేలైన విత్తనాలు అందించండి

ABN , Publish Date - May 02 , 2025 | 12:15 AM

జిల్లాలోని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా రైతులకు మేలైన విత్తనాలను అందించాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అన్నారు.

రైతులకు మేలైన విత్తనాలు అందించండి
డ్రోన్‌తో పిచికారి చేసే విధానాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ నాగరాణి

వరి పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశంలో కలెక్టర్‌

పెనుమంట్ర, మే 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా రైతులకు మేలైన విత్తనాలను అందించాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అన్నారు. మార్టేరు ప్రాంతీయ వరి పరిశోధనా స్థానంలో గోదావరి మండలం పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశంలో గురువారం కలెక్టర్‌ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో వరదలు, వర్షాలతో నీళ్లు నిలబడినప్పుడు వరి పంట దెబ్బతింటుందని, తట్టుకునే వరి వంగడాలను అందించాలన్నారు. కలుపు నివారణకు కూడా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ఫంగస్‌, వైరస్‌ను తట్టుకొని, తడి నేలల్లో ఇబ్బందిలేని రకాలను సూచించాల న్నారు. పరిశోధనా సంచాలకుడు పీవీ.సత్యనారాయణ, విస్తర ణ సంచాలకుడు జి.శివన్నారాయణ, మార్టేరు సహ పరిశోధనా సంచాలకుడు టి.శ్రీనివాస్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్డు వెంకటేశ్వరరావు కొత్త వరి వంగడాలు, కలుపు నివారణ మందులు వివరాలు, డీకంపోజ్‌ మందులు, నూతన వరి వంగడాల విస్తరణ, అంతర పంటల సాగు, తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పిచారు. పీవీఎస్‌ గోపాల కృష్ణం రాజు, ఎం.రాంబాబు, సత్యనారాయణరాజు, పెమ్మరాజు తదితర అభ్యుదయ రైతులు వ్యవసాయ సాగులో ఇబ్బందులు, డ్రోన్ల వినియోగం తదితర అంశాలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.

అనంతరం ఫార్మా రోబోతో పురుగుమందుల పిచికారి, డ్రోన్లు వినియోగంతో మందుల పిచికారీని కలెక్టర్‌ నాగరాణి స్వయంగా పరిశీలించారు. సమావేశంలో ప్రిన్సిపల్‌ సైంటిస్టులు డాక్టర్‌ గిరిజారాణి, డాక్టర్‌ రాజమణి, డాక్టర్‌ చంద్రమోహన్‌ రెడ్డి, డాక్టర్‌ మోహన్‌రెడ్డి, డాక్టర్‌ రమణ డాక్టర్‌ మునిరత్నం, అభ్యుదయ రైతులు, మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2025 | 12:15 AM