కాళీపట్నం భూ సమస్య పరిష్కరిస్తాం
ABN , Publish Date - Jul 27 , 2025 | 12:40 AM
కాళీపట్నం భూ సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతుందని, రైతులు కూడా సహకరించాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు.
అధికారులు, రైతులతో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష
ప్రభుత్వం తీసుకున్న చర్యలు వివరించిన జేసీ
సమస్యలు విన్నవించిన రైతులు
రైతులంతా ఒకే మాటపై ఉండాలన్న మంత్రి
ముఖ్యమంత్రితో చర్చిస్తానని హామీ
నరసాపురం, జూలై 26(ఆంధ్రజ్యోతి): కాళీపట్నం భూ సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతుందని, రైతులు కూడా సహకరించాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు. రైతులంతా ఒక్క మాటపై ఉంటే సమస్య త్వరితగతిన పరిష్కారమవుతుందన్నారు. కాళీపట్నం భూ సమస్యలపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులు, రైతులతో శనివారం ఆయన సమావేశమయ్యా రు. జాయింట్ కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డి భూ సమస్యను మంత్రికి వివరించారు. ఇప్పటివరకు ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు, దానికి రైతులు, న్యాయపరంగా ఇబ్బందులను మంత్రికి వివరించారు. రైతులు రామకృష్ణంరాజు, మెటుపల్లి రాంభాస్కర్ కూడా మంత్రికి వివరాలు ఇచ్చారు. 1945 నాటి భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు. మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ సమస్య పరి ష్కారానికి జీవో జారీ చేస్తే ఎవరో ఒకరు కోర్టుకు వెళతారు.. సమస్య మొదటికొస్తుందన్నారు. సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి నిర్ణయం తీసుకుంటామని, సానుకూల వాతావరణంలోనే పరిష్కారిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఐదు గ్రామాల్లో గ్రామ కంఠం భూములకు ఇబ్బందులు లేకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చేవిధంగా ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్ నాయకర్, ఆర్డీవో దాసిరాజు, కార్పొరేషన్ చైర్మన్లు మంతెన రామరాజు, కొల్లు పెద్దిరాజు, మాజీ ఎమ్మెల్సీ ఆంగర రామ్మోహన్, టీడీపీ ఇన్‌చార్జి రామరాజు పాల్గొన్నారు.