మలివిడత రీసర్వేకు సిద్ధం
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:15 AM
జిల్లాలో రెవెన్యూ భూముల రీ–సర్వే తుది అంకానికి చేరుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగో విడ త సర్వేకు అధికారులు సమాయత్తం అవు తున్నారు.
జనవరి 2 నుంచి ప్రారంభం
గ్రామాల ఎంపికకు జేసీ కసరత్తు
(భీమవరం– ఆంధ్రజ్యోతి)
జిల్లాలో రెవెన్యూ భూముల రీ–సర్వే తుది అంకానికి చేరుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగో విడ త సర్వేకు అధికారులు సమాయత్తం అవు తున్నారు. జిల్లాలో జనవరి రెండో తేదీ నుం చి మరో విడత సర్వే ప్రారంభం కానుంది. గ్రామాల ఎంపికపై జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి కసరత్తు చేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో మాదిరి ఆదరా బాదరాగా కాకుండా నిధానమే ప్రదానంగా కూటమి ప్రభుత్వం ఎంపికచేసిన గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేయిస్తోంది. మూడు నెలల వ్యవధి ఇచ్చి, అవసరమైన సిబ్బందిని కేటాయిస్తున్నారు. ముందస్తుగా రైతులకు నోటీసుల ద్వారా తెలియపరుస్తున్నారు. వారి నుంచి పత్రాలను సేకరించి రీ–సర్వేలో హద్దులతో సహా వెబ్‌ల్యాండ్‌లో పొందుపరుస్తున్నారు. రైతు అభ్యంతరం పెడితే పరిష్కరిస్తున్నారు. గత ప్రభుత్వంలో నిర్వహించిన రీ–సర్వేలో తలెత్తిన తప్పిదాలను పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో 69 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి భూముల వివరాలను వెబ్‌ల్యాండ్‌లో పొందుపరిచారు. మిగి లిన 52 గ్రామాల్లో నాలుగో విడతలో రీ సర్వేకు సిద్ధం చేస్తున్నారు.
జెఎల్పీ నెంబర్లకు స్వస్తి
వైసీపీ హయంలో రీ–సర్వే భూములకు రైతులకు ఇచ్చిన 30 వేల జాయింట్ ఎల్పీ నెంబర్లతో రైతులు ఇబ్బందులు పడ్డారు. బ్యాంకుల్లో రుణాలు పొందడానికి, భూముల క్రయ విక్రయాలకు అవకాశం లేకపోయింది. సర్వే శాఖ వీటిలో ఇప్పటి వరకు 10 వేల జాయింట్ ఎల్పీ నెంబర్లను పరిష్కరించారు. అందులో వున్న ప్రతీ రైతుకు వేర్వేరు ఎల్పీ నెంబర్లు కేటాయించారు. రీ–సర్వేలో ఈ నెంబర్లకు స్వస్తి చెప్పారు. రైతులు దస్తావేజుల ఆధారంగా హద్దులను చూస్తున్నారు. ఆక్వా చెరువుల్లో రైతుల దస్తావేజులన్నింటికి హద్దులు, విస్తీర్ణం సరిపోయితే వేర్వేరు ఎల్పీ నెంబర్లు కేటాయిస్తున్నారు.
గల్లంతైన భూములకు మోక్షం
వెబ్‌ల్యాండ్‌లో గల్లంతైన భూములకు మోక్షం కలిగించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో దర్శిపర్రు, జువ్వలపాలెం, ప్రాం తాల్లో 11 వందల ఎకరాలు, నరసాపురం సమీపంలోని చినమామిడిపల్లిలో 1,092 ఎకరాలు రీ–సర్వేలో గల్లంతయ్యాయి. ఆయా భూయజమానులు వీటి విక్రయాలకు, రిజిస్ర్టేషన్‌లకు, బ్యాంకు రుణాలు తీసుకునే అవకాశం లేకపోయింది. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ రాష్ట్ర భూపరిపాలన కమిషనర్‌తో పలుసార్లు చర్చలు జరిపిన మీదట గత ప్రభుత్వ తప్పిదాలను గుర్తించారు. తక్షణం వెబ్‌ల్యాండ్‌లో పొందు పరిచేలా చర్యలు తీసుకున్నారు.