నిర్ణీత గడువులో సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Aug 05 , 2025 | 12:38 AM
ప్రజల అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని ఇన్‌చార్జి కలెక్టర్, జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు.
భీమవరం టౌన్, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ప్రజల అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని ఇన్‌చార్జి కలెక్టర్, జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించి 191 అర్జీలను స్వీకరించినట్లు ఆయన తెలిపారు. అధికారులు ప్రత్యేక పర్యవేక్షణతో నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు.
తన పెద్ద కుమారుడు భోగరాజు నా ఇంటిని కోడలు పేరున బలవంతంగా రాయించుకొని తనను ఇంటి నుంచి గెంటేశాడని కాళ్ళ మండలం బొండాడ పేటకు చెందిన అరిటాకుల లక్ష్మి అధికారుల వద్ద వాపోయింది. తనకు ఆధారం లేదని, కొడుకుపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేసింది.
తనకు చెవులు వినపడవని సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేస్తే వెన్నెముక సమస్యతో సర్టిఫికెట్ ఇచ్చారని పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామానికి చెందిన కోరాడ గణేష్ నాగ శివకుమార్ వాపోయాడు. ఆ సర్టిఫికెట్ రద్దు చేసి తన సమస్యపై సర్టిఫికెట్ ఇవ్వాలని అధికారులను కోరాడు.
పోలీసులకు 11 అర్జీలు
భీమవరం క్రైం, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి 11 అర్జీల ను స్వీకరించారు. పూర్తిస్థాయి విచారణ జరిపి శాశ్వత పరిష్కారం అందిస్తామని భరోసా ఇచ్చారు. సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్‌లో సూచనలు ఇచ్చారు. ఏఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, సిబ్బంది పాల్గొన్నారు.