Share News

లెక్క తేల్చేందుకు..!

ABN , Publish Date - Dec 29 , 2025 | 11:57 PM

జిల్లాలో నాల్గవ విడత భూముల రీ సర్వే జనవరి రెండు నుంచి ప్రారంభించాలని డైరెక్టరేట్‌ నుంచి కలెక్ట రేట్‌కు ఉత్తర్వులు అందాయి.

లెక్క తేల్చేందుకు..!

జనవరి రెండు నుంచి నాల్గవ విడత భూ సర్వే

64 గ్రామాల గుర్తింపు.. 2,73,962 ఎకరాల్లో సర్వేకు కసరత్తు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో నాల్గవ విడత భూముల రీ సర్వే జనవరి రెండు నుంచి ప్రారంభించాలని డైరెక్టరేట్‌ నుంచి కలెక్ట రేట్‌కు ఉత్తర్వులు అందాయి. ఈ ఏడాది జనవరి 17 నుంచి తొలి విడత పైలట్‌ ప్రాజెక్టుగా 24 గ్రామాల్లో భూముల రీ సర్వేను చేపట్టారు. రెండో విడతలో 30, ప్రస్తుతం జరుగుతున్న మూడో విడతలో 59 గ్రామాల్లో ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తం గా మూడు దశల్లో 103 గ్రామాల్లో భూముల రీ సర్వే ఫలితాలు త్వరలో కొలిక్కి రానున్నాయి. ఈ రికార్డుల ఆధారంగా రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీ చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది.

వచ్చే ఏడాది చివరినాటికి పూర్తి

అన్ని జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌, పోరంబోకు, గ్రామకంఠాలు ఇతరత్రా భూముల లెక్కలను వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించింది. విడతల వారీగా సిబ్బంది నిర్వహణ తదితర ఏర్పాట్లకు పాతిక లక్షలకు తక్కువ కాకుండా నిధులను విడుదల చేస్తోం ది. రోవర్ల సంఖ్యను ఇటీవల పెంచినా సిబ్బంది పెంపు జరగలేదు. దీంతో నాల్గొవ విడత లక్ష్యం భారీగా ఉండడంతో అధికారులు కింది స్థాయిలో కసరత్తులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏలూ రు రూరల్‌ మండలం గుడి వాకలంక, ప్రత్తికోళ్లలంక గ్రామాల్లో 17,168 ఎకరాలు సర్వే కోసం పెట్టారు. కొల్లేరు పరివాహక ప్రాంతంలోని అన్ని భూము ల సర్వే లెక్కలను యంత్రాంగం కొలిక్కి తెచ్చే యోచనలో ఉంది. వైసీపీ హయాంలో ఏర్పడిన భూముల చిక్కులను తొలగించేందుకు ఇటీవల 22ఏ నిషేధిత జాబితాలోని భూములకు మోక్షం కల్పించేందుకు ప్రభుత్వం సన్నద్దం అయ్యింది.

ఓవరాల్‌గా ఏలూరు డివిజన్‌ అత్యధికం

భూముల రీ సర్వేలో ఈసారి ఎక్కువగా ఏలూరు డివిజన్‌ పరిధిలోనే భూములు కొలతలు తీయాల్సి ఉంది. దాదాపుగా 12 మండలాల్లో లక్షా 30 వేల 213 ఎకరాల మేర సర్వే చేపట్టనున్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్‌లోని ఆరు మండలాల్లో 96,172 ఎకరాల్లో చేపడతారు. నూజివీడు సబ్‌ డివిజన్‌ ఆరు మండలాల్లో 47,577 ఎకరాల్లో భూమి లెక్కలు తేల్చనున్నారు.

పారదర్శకంగా రీ సర్వే

జిల్లా ల్యాండ్‌,సర్వేశాఖ ఏడీ ఎండీ అన్సారీ

జిల్లాలో మూడో విడత సర్వేను ఈ నెలాఖరుకు పూర్తి చేస్తాం. రికార్డుల పరిశీలన జరుగుతోంది. నాల్గొవ విడతలో ప్రభుత్వం విధించిన భారీ లక్ష్య ఛేదనలో అందరిని కలుపుకుని ముందుకు సాగుతాం. 2లక్షల73 వేల ఎకరాల భూములు రీ సర్వే చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - Dec 29 , 2025 | 11:57 PM