చేయి తడపాల్సిందే !
ABN , Publish Date - Jul 11 , 2025 | 12:26 AM
రెవెన్యూశాఖను అవినీతి జాడ్యం పట్టిపీడి స్తోంది.వైసీపీ హయాంలో పాలకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిన రెవెన్యూ సిబ్బంది.. ఆ ఛాయల నుంచి ఇంకా బయటకు రాలేన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
రెవెన్యూలో పెచ్చు మీరుతున్న అవినీతి
కొర్రీలతో కాలయాపన.. కాసులకు కక్కుర్తి
కొందరు వీఆర్వోల నుంచి తహసీల్దార్ల వరకు అదేతీరు
పీజీఆర్‌ఎస్‌లో వినతులే నిదర్శనం
క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ కరువు
ముదినేపల్లి మండలం ఊటుకూరు పంచాయతీ పరిధిలో దాదాపు 2.40 ఎకరాల భూమికి పట్టా ఇవ్వడానికి ఓ వీఆర్వో రూ.50 వేలు డిమాండ్ చేశాడు. సంబంధిత రైతు ఇటీవల కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో ఉన్నతాధికారులను కలిస్తే ఏలూరు ఆర్డీవో కార్యాలయానికి వెళ్లమ న్నారు. అక్కడ సూపరింటెండెంట్ మిమ్మల్ని పిలుస్తామని చెప్పారు. ఇరవై రోజులు గడిచినా ఇంతవరకు అధికారులు స్పందించ లేదు.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
రెవెన్యూశాఖను అవినీతి జాడ్యం పట్టిపీడి స్తోంది.వైసీపీ హయాంలో పాలకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిన రెవెన్యూ సిబ్బంది.. ఆ ఛాయల నుంచి ఇంకా బయటకు రాలేన్న విమర్శలు విన్పిస్తున్నాయి.ఆరోపణలు వస్తే మాకేంటి.. మాపని మాదేనంటూ మొండిగా వెళ్లిపోతున్నారు. సిటిజన్ చార్టర్ ప్రకారం ఎక్కడా పనులు చేయడం లేదు. కాసులకు కక్కుర్తి పడి నెలలు తరబడి పాస్‌బుక్‌లు, పట్టాలు, అడంగల్ ఇతర పత్రాలను ఇవ్వడా నికి రైతులను కార్యాలయాలు చుట్టూ తిప్పించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ప్రతీవారం జరిగే పీజీఆర్ ఎస్‌లో రెవెన్యూతో సంబంధం ఉన్న భూము లు, ఆక్రమణలపైనే అత్యధిక అర్జీలు అంద డం దీనికి నిదర్శనం. వాస్తవాలు తేల్చాల్సిన అధి కారులే మిన్నకుండిపోతున్నారు.
వీఆర్వోలు చెప్పిందే వేదం..
గ్రామాల్లో ప్రతీ పనికి ఒక రేటు పెట్టి వీఆర్వోలే చక్రం తిప్పుతున్నారు. కింది స్థాయిలో వారి అవినీతి తారస్థాయికి చేరిం దన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కొల్లేరు గ్రామాల్లో చెరువుల మరమ్మతులు, గట్లు ఏర్పాట్లలో రూ.లక్షల్లో దండుకుంటు న్నారన్న విమర్శలున్నాయి. కార్యాలయాల్లో వీఆర్వో, ఆర్‌ఐ, ఇతర సిబ్బంది అందుబాటు లో ఉండడం లేదన్న ఆరోపణలున్నాయి. క్షేత్రస్థాయిలో సర్వేకు వెళుతున్నామని విధు లకు డుమ్మా కొడుతున్నారు. చాలా మండ లాల్లో కొందరు ఉద్యోగులు, అనధికార వ్యక్తు లు తహసీల్దార్లకు మామూళ్లు వసూలు బాధ్యతను స్వీకరించారన్న ఆరోపణలున్నాయి.
దొరికితే దొంగలు..
వీఆర్వో, ఆర్‌ఐ పనితీరుపై పర్యవేక్షణ లేకపోవడంతో దొరికితే దొంగలు.. లేకపోతే దొరల్లా చెలామణి అవుతున్నారు. 2023లో మండవల్లి ఆర్‌ఐ పద్మరోజా ల్యాండ్ పేరు మార్పు కోసం రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి సస్పెండ్ అయ్యారు. ఇటీవల చాట్రాయిలో మహిళా తహసీల్దార్‌కు కలెక్టర్ వెట్రిసెల్వి 10 మెమోలు జారీ చేస్తే 8 మెమోల్లో ఆమెపై తీవ్ర ఆరోపణలు వాస్తవమని తేలడంతో సస్పెండ్ చేశారు. ఇది జరిగి కొన్ని నెలలు కాకముందే నూజివీడు నియోజకవర్గంలో వివాదాస్పద తహసీల్దార్‌ను ఏరికోరి తీసుకురావడం విమర్శలకు తావిస్తోంది.
కొరవడిన పర్యవేక్షణ
కొన్ని మండలాల్లో తహసీల్దార్లు ఆర్డీవో స్థాయిలో వ్యవహరిస్తున్నారు. జిల్లా స్థాయి అధికారుల ఆదేశాలను అమలు చేయాల్సిన డివిజన్, మండల స్థాయి అధికారులు పట్టుకోల్పోయిన స్థితిలో ఉన్నారు. జిల్లాలో తహసీల్దార్ పోస్టులు పదుల సంఖ్యలో.. డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు 15 వరకు ఖాళీగా ఉండడంతో పలు మండలాల్లో కిందిస్థాయిలో అవినీతి పెచ్చుమీరింది. జిల్లాస్థాయిలో సమీక్షలు పెద్దగా లేకపోవడంతో ఇష్టారాజ్యం అవుతోంది.