ఓటీపీలు వస్తేనే రిజిస్ట్రేషన్లు
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:10 AM
కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ తరచూ కొత్త విధానాలను రూపకల్పన చేయడంతో క్రయవిక్రయదారులతో పాటు అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెల 27వ తేదీ నుంచి ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌కు ఓటీపీ విధానం తీసుకొచ్చింది.
తరచూ కొత్త విధానాలతో కక్షిదారుల అసంతృప్తి
ప్రభుత్వ ఆదాయానికి గండి
ఆధార్‌కు ఫోన్ నంబరు లింక్ కాకపోవడంతో ఓటీపీ అవస్థలు
అయినా ఓటీపీ విధానానికే మొగ్గు చూపిన రిజిస్ట్రేషన్ శాఖ
క్రయ విక్రయదారులు సైబర్ నేరగాళ్లపై జాగ్రత్తగా ఉండాలని పోలీసుల హెచ్చరిక
కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ తరచూ కొత్త విధానాలను రూపకల్పన చేయడంతో క్రయవిక్రయదారులతో పాటు అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెల 27వ తేదీ నుంచి ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌కు ఓటీపీ విధానం తీసుకొచ్చింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పటికీ ఓటీపీ విధానానికే రిజిస్ట్రేషన్ శాఖ మొగ్గుచూపుతుంది. మొదటిలో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ క్రమక్రమంగా సమస్యలు తొలగిపోతాయని రిజిస్ట్రేషన్ శాఖ ముందుకు వెళుతోంది. దీనిపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
ఆచంట, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వానికి ప్రతిరోజూ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. అటువంటి ఆదాయం వచ్చే శాఖపై రిజిస్ట్రేషన్ శాఖ కొత్తవిధానం తీసుకువస్తుండడంతో ముఖ్యంగా క్రయ విక్రయదారులతోపాటు అధికారులు తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించి తరచూ కొత్త విధానాలు తీసుకువస్తుండడంతో ఇటీవల కాలంలో రిజిస్ట్రేషన్లు సజావుగా జరగడం లేదు. ప్రభుత్వ ఆదాయానికి పెద్దఎత్తున గండి పడుతుంది. అమ్మకం, కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి 2.0 కొత్త విధానం తీసుకువచ్చింది. మొదటిలో అనేక మంది ఈ విధానం వ్యతిరేకరించినప్పటికి క్రమక్రమంగా ఈ విధానానికి అలవాటు పడి రిజిస్ట్రేషన్‌లు జరుగుతున్నాయి. ఇటీవల రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి ప్రభుత్వం స్లాట్ బుకింగ్ విధానం తీసుకువచ్చింది. ఈ విధానం కూడా మొదటిలో కక్షిదారులు పెద్దఎత్తున అసంతృప్తి వ్యక్తం చేశారు.
కొత్తగా ఓటీపీ విధానం..
మళ్లీ కొత్తగా గతనెల 27 నుంచి రిజిస్ట్రేషన్‌కు సంబంధించి క్రయ విక్రయదారులకు ఓటీపీ విధానం తప్పనిసరి చేసింది. ఈమేరకు క్రయ విక్రయదారులు ప్రస్తుతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమందికి ఆధార్‌కి మొబైల్ నంబరు లింక్ చేసుకోవడం లేదు. దీనివల్ల ఓటీపీలు రాక అవస్థలు పడుతున్నారు. కొంతమంది ఓటీపీలకు సంబంధించి వృద్ధాప్యం కలిగిన వారు వారి కుమార్తెలు, కుమారులకు మొబైల్ నంబరుకు లింక్ చేయడంతో వారి కుటుంబసభ్యులు వేరే దూరప్రాంతంలో ఉండడంతో మొబైల్ పని చేయని కారణం ఒకటి అయితే మరికొంతమంది ఓటీపీ ఎందుకని వారి కుటుంబ సభ్యులనే ప్రశ్నిస్తున్నారు. భూమి స్థలాలు ఇల్లు క్రయవిక్రయాలు జరపాలంటే ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌శాఖ విధించిన ఓటీపీ విధానం వల్ల దస్తావేజుల్లో పొందు పరిచిన క్రయ విక్రయదారులకు తప్పనిసరిగా ఆధార్ ఓటీపీ వస్తేనే పబ్లిక్‌డేటా ముందుకువెలుతుంది. అలా కాకపోతే రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయి. కొంతమంది వారి కుటుంబ సబ్యులకు సంంధించి పెండ్లి కానుకగా, అలాగే అనారోగ్య కారకంగా దస్తావేజులు ఓటీపీల వల్ల నిలిచిపోవడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఓటీపీతోనే స్లాట్ బుకింగ్..
ఇది ఒక పద్ధతి అయితే దీనికి సంబంధించి స్లాట్ బుకింగ్ విధానంలో కూడా ఓటీపీ చెబితేనే స్లాట్ బుకింగ్ అవుతుంది. మరోసారి క్రయ విక్రదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం గతనెల జూలైలో చేపట్టిన ఓటీపీ విధానం ద్వారా క్రయ విక్రయదారులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కోట్ల రూపాయలు ఆదాయం ఇచ్చే శాఖపైనే ఇటువంటి నిబంధనలు విధిస్తున్నారని కొంత మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఓటీపీ విధానం వల్ల కొంతమందికి ఆధార్ లింక్ కాకపోవడంతో క్రయ విక్రయదారులు ఆధార్ సెంటర్‌లకు క్యూ కడుతున్నారు. ఓటీపీ విధానం ద్వారా ఇటీవల కాలంలో రిజిస్ట్రేషన్లు ఎక్కడా కూడా సజావుగా సాగడం లేదు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబంలో తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు స్పందించి తక్షణమే తరచూ రిజిస్ట్రేషన్‌లో కొత్త విధానాలను తీసుకురాకుండా ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త విధానాన్ని సవరించి సజావుగా రిజిస్ట్రేషన్‌లు అయ్యేట్లు చూడాలని పలువురు కక్షిదారులు కోరుతున్నారు.
పోలీస్ శాఖ ప్రచారం..
ఓటీపీ విషయంలో ప్రజలందరూ సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే పోలీసు శాఖ వారు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. చరవాణిలో కూడా సైబర్ నేరగాళ్ల పట్ల ఓటీపీ విషయంలో ఎవరికి చెప్పవద్దంటూ పదేపదే చెబుతున్నారు. బ్యాంక్ అధికారులు కూడా ఓటీపీ ఎవరికి చెప్పవద్దంటున్నారు. ఇలాంటి పరిస్థితిల్లో రిజిస్ట్రేషన్ శాఖ కొత్తగా ఓటీపీ విధానం ఎందుకు తీసుకువచ్చిందంటూ కక్షిదారులే ప్రశ్నిస్తున్నారు.