దళారులదే రాజ్యం!
ABN , Publish Date - Nov 08 , 2025 | 01:00 AM
స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ శాఖలో ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా దళారులదే ఇంకా పైచేయిగా నిలుస్తోంది. స్లాట్ బుకింగ్, అర్బన్ మ్యుటేషన్ సులభతరం చేయడం, కార్డు 2.0 సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి తీసు కొచ్చినా ఇంకా సిబ్బంది, బయట వ్యక్తులతో లాలూచీలతో లావా దేవీలు సాగుతుండడం గమనార్హం.
రిజిస్ర్టేషన్ల శాఖలో ఆగని దందాలు
పొరుగున ఏసీబీ దాడులతో అప్రమత్తం
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ శాఖలో ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా దళారులదే ఇంకా పైచేయిగా నిలుస్తోంది. స్లాట్ బుకింగ్, అర్బన్ మ్యుటేషన్ సులభతరం చేయడం, కార్డు 2.0 సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి తీసు కొచ్చినా ఇంకా సిబ్బంది, బయట వ్యక్తులతో లాలూచీలతో లావా దేవీలు సాగుతుండడం గమనార్హం.
ఏలూరు జిల్లా రిజిస్ర్టార్ కార్యాలయంలో పాటు 11 చోట్ల సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో సగటున రోజుకు 350కు పైగా భూక్రయ, విక్ర యాలు సాగుతుంటాయి. గతేడాది పలుచోట్ల ఏసీబీ తనిఖీలు చేయగా, ఈ ఏడాది ఏలూరు జిల్లాను మినహాయించారు. అవినీతి ఆరోపణ లు వచ్చినప్పుడల్లా ఏసీబీ అధికారులు దాడు లు చేయడం రెగ్యులర్ జరుగుతుంటాయని అధికారులు కొట్టి పారేస్తున్నారు. జిల్లా కేంద్రం లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండడంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా సాఫీగానే రిజిస్ర్టేషన్లు సాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు దాడులతో జిల్లా లోని అధికారుల్లో అలజడి రేగింది.
ఇటీవల జిల్లాలో భీమడోలు, చింతలపూడి సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో కింద స్థాయి సిబ్బందిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. చింతల పూడిలో ఐదునెలలు క్రితం మాన్యువల్‌గా కార్యాలయంలో ఉండాల్సిన రికార్డులు బయట వ్యక్తుల చేతుల్లో ఉండడంపై తీవ్ర దుమారం రేగింది. కొంత మంది ఉన్నతస్థాయిలో ఫిర్యా దులు చేశారు. దీనిపై విచారణలను పూర్తి చేసిన ఉన్నతాధికారులు సబ్ రిజిస్ర్టార్‌తో పాటు, కింద స్థాయి సిబ్బందిని చాలావరకు వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు. భీమడోలు లోను పాత సిబ్బంది అక్కడ తిష్టవేసి అక్రమ లావాదేవీలను నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు రాగా జిల్లా రిజిస్ర్టార్ కె.శ్రీనివాసరావు స్వయం గా రికార్డులను పరిశీలించి, అక్కడ సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. ఎవరికి లంచాలు ఇవ్వనక్కర్లేదని బహిరంగంగానే ప్రకటించారు.
చాప కింద నీరులా..
జిల్లాలో చాప కింద నీరులాగా దళారుల చేతుల మీదుగా 50 శాతం పైబడి ఆన్‌లైన్ లావాదేవీల్లో జోక్యం పెచ్చుమీరింది. రిజిస్ర్టార్ కార్యాలయాలు కంటే అత్యాధునిక వసతులు దళారుల కార్యాలయాలకు ఉండడం గమ నార్హం. వట్లూరు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం వద్ద రిటైర్డు రెవెన్యూ సిబ్బంది దళారుల అవతారం ఎత్తుతుండడం గమనార్హం. కైక లూరు, నూజివీడు, కామవరపుకోట, గణప వరం, మండవల్లిల్లోనూ అనధికారిక ప్రైవేట్ వ్యక్తులే రాజ్యమేలుతున్నారు.
అధికారులకు ప్రైవేట్ సిబ్బంది
సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారాయి. కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ.. అడ్డగోలు వ్యవహారాలతో జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు అధికారులు వసూళ్ల కోసమే ప్రత్యేకంగా సిబ్బంది నియమించుకున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫిర్యాదులు అందిన సమయంలో అడపాదడపా విచారణలు జరిపి వదిలేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుంటే వీరి ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని పలువురు కోరుతున్నారు.