Share News

రబీకి రెడీనా?

ABN , Publish Date - Dec 02 , 2025 | 12:49 AM

ధవళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌ పరిధిలోని మూడు డెల్టాల పరిధిలోని వరి సాగు ఒక పద్ధతిలో సాగడం లేదు. పంట ప్రకృతి వైపరీత్యాల బారిన పడకూడదంటే ముందుగానే పంట సాగు మొదలుపెట్టాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. గతంలో మే నెలలోనే నారుమళ్లకు సిద్ధం చేసుకుని, జూన్‌ నెలలో నాట్లు మొదలు పెట్టేవారు.

రబీకి రెడీనా?
ఆచంటలో వర్షానికి తడవకుండా ధాన్యం రాశులను రక్షిస్తున్న రైతులు

పూర్తికాని ఖరీఫ్‌ మాసూళ్లు.. రబీ నాట్లు జాప్యం

తూర్పు డెల్టాకు నీరు విడుదల.. పశ్చిమకు ఎప్పుడో ?

ఖరీఫ్‌ రైతును వెంటాడుతున్న వానలు

ధవళేశ్వరం సర్కిల్‌ పరిధిలో 8,96,507 ఎకరాల్లో రబీ

(భీమవరం రూరల్‌/రాజమహేంద్రవరం–ఆంధ్రజ్యోతి)

ధవళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌ పరిధిలోని మూడు డెల్టాల పరిధిలోని వరి సాగు ఒక పద్ధతిలో సాగడం లేదు. పంట ప్రకృతి వైపరీత్యాల బారిన పడకూడదంటే ముందుగానే పంట సాగు మొదలుపెట్టాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. గతంలో మే నెలలోనే నారుమళ్లకు సిద్ధం చేసుకుని, జూన్‌ నెలలో నాట్లు మొదలు పెట్టేవారు. కొన్నేళ్ల నుంచి ఈ క్రమం తప్పింది. బాగా ఆలస్యం అవుతోంది. డిసెంబరు నెల వచ్చేసినా వరి కోతలు ఇంకా పూర్తికాలేదు. దిత్వా తుఫాన్‌ వల్ల ప్రస్తుతం కోతలు ఆపేసినా, ఆరబోసిన ధాన్యా న్ని రక్షించుకోవడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండడంతో చాలావరకూ ధాన్యం కొనుగోలు జరుగుతోంది. కానీ రబీ సాగు విషయంలో ఆలస్యమయ్యే అవకా శం ఉంది. ధవళేశ్వరం సర్కిల్‌ పరిధిలోని తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌ డెల్టాల్లో సోమ వారం నుంచే రబీ ప్రారంభమైంది. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు అనుకూలం గా లేవు. సంక్రాంతి తర్వాత వరకూ రబీ సాగు కొనసాగే పరిస్థితి ఉంది. ఇక ఫిబ్రవరి 1 నుంచి సాగు నీటిని వంతుల వారీగా అమలుచేయడానికి నిర్ణయించారు. వచ్చే ఏడాది మార్చి 31కి రబీ సాగు పూర్తి చేయాలనేది నిర్ణయం.

8,96,507 ఎకరాల్లో రబీ సాగు

ధవళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌ పరిధిలో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి వచ్చే నీటితో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని తూర్పు, సెంట్రల్‌, పశ్చిమ, డెల్టాలకు సంబంఽధించి రబీలో 8,96,507 ఎకరాల్లో వరి పంట సాగు చేయనున్నారు. అందులో తూర్పుడెల్టా, పీబీసీ పరిధిలో 2,64,507 ఎకరాలు, గోదావరి సెంట్రల్‌ డెల్టా పరిధిలో 1,72,000 ఎకరాలు, పశ్చిమ డెల్టా పరిధిలో 4,60,000 ఎకరాల ఆయకట్టు సాగులో ఉంటుంది. దీనికోసం 93.26 టీఎంసీల సాగునీరు అవసరం. అంత నీరు అందుబాటులో ఉందని అధికారులు కథనం. మార్చి 31వ తేదీకి పూర్తవ్వాలని అధికారులు చెబుతున్నా, ఇతర ప్రాంతాల వారు మాత్రం ఏప్రిల్‌ 15వ తేదీ వరకూ నీరు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

తూర్పు డెల్టాకు నీరు విడుదల

రబీ సాగు కోసం తూర్పు డెల్టాకు సోమవారం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేశారు. కానీ ఇంకా సెంట్రల్‌, పశ్చిమ డెల్టాలకు నీటిని విడు దల చేయలేదు. సోమవారం ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. బండారు సత్యానందరావు సమక్షంలో తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ మురాలశెట్టి సునీల్‌కుమార్‌ నీటిని విడుదల చేశారు. రబీ పంట సాగుకోసం నీటిని విడుదల చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్‌ ఎస్‌ఈ కె.గోపినాథ్‌, ఈఈ శ్రీనివాస్‌, డిఈరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

తప్పిన దిత్వా ముప్పు

పశ్చిమ గోదావరి జిల్లాపై దిత్వా తుఫాన్‌ ప్రభా వం పెద్దగా లేకపోవడంతో రైతాంగం ఊపిరి పీల్చుకుంది. ఆదివారం రాత్రి అక్కడక్కడా వర్షాలు కురవడంతో ఆందోళన మొదలైంది. వాయుగుం డం బలహీనపడడంతో సోమవారం మబ్బుల వాతావరణంతోనే సరిపెట్టుకుంది. ఎక్కడా వర్షాలు, గాలులు లేవు. పంట చేలుగా ఉన్న లక్షా 27 వేల ఎకరాలకు, 30 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి ఏ విధమైన నష్టం వాటిల్లలేదు. కొన్ని ప్రాంతాల్లో వరి కోత యంత్రాలతో పంట మాసూళ్లు జరిగాయి. మొంథా తుఫాన్‌ మొదలుకుని వరుస అల్పపీడనాలు, తుఫాన్లు రైతులను భయపెడుతూ వస్తున్నాయి. గడిచిన నెల రోజులు భారీ వర్షాలు నమోదు కాకపోవడంతో సార్వా సాగుకు పంట దశలో ఏ విధమైన దెబ్బ తగలలేదు. దీంతో రైతులు ప్రస్తుతానికి సార్వాలో సేఫ్టీలో ఉన్నారు. మరో పది, పదిహేను రోజులు వాతావరణం అనుకూలిస్తే పంట మాసూళ్ళు పూర్తిస్థాయిలో చేసుకుంటారు. గడిచిన రెండు రోజుల్లో 165.8 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతం పంట చేలకు దాళ్వా నారుమడులకు ఎటువంటి హాని చేయలేదని రైతులు చెబుతున్నారు. మంగళవారం నుంచి వాతావరణం అనుకూలంగా ఉంటే మాసూళ్ల పనులు తిరిగి మొదలు పెట్టడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Updated Date - Dec 02 , 2025 | 12:49 AM