సా..గుతున్న రీసర్వే
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:36 AM
జిల్లాలో భూముల రీ సర్వే ప్రహసనంలా సాగుతోంది. ఈ నెలాఖరు నాటికి మూడో విడత సర్వే పూర్తి చేయడానికి సర్వే, రెవెన్యూ శాఖల అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
నెలాఖరుకు మూడో దశ పూర్తికి కసరత్తు
మందకొడిగా సాగుతున్న సర్వే
మరో నాలుగుదశల్లో చేస్తేనే అంతా పూర్తి
జిల్లాలో భూముల రీ సర్వే ప్రహసనంలా సాగుతోంది. ఈ నెలాఖరు నాటికి మూడో విడత సర్వే పూర్తి చేయడానికి సర్వే, రెవెన్యూ శాఖల అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఒక పక్క పంటల కోతలు.. మరో పక్క విపరీతమైన చలిగాలులతో సర్వే ప్రక్రియ కొంత మందకొడిగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా భూముల రీ సర్వే చేయా లంటే మరో నాలుగు దశలు చేపట్టాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
(ఏలూరు–ఆంధ్ర జ్యోతి)
జిల్లాలో భూముల రీ సర్వేపై అధికారులు కుస్తీలు పడుతున్నారు. ఈ ఏడాది జనవరి 20న తొలి విడత పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన మొదలుకుని.. ఇప్పుడు మూడో దశ వరకు చాలా వరకు పురోగతి కనిపిస్తోంది. ప్రధానంగా వైసీపీ హయాంలో చేపట్టి జగనన్న భూహక్కుల సర్వే మాయాజాలంతో రైతులు జిల్లా అంతటా ఇబ్బందులే ఎదుర్కొన్నారు. భూముల సరిహద్దుల వివాదాల లెక్క తేల్చేందుకు కూటమి ప్రభుత్వం వ్యయప్రయాసల కోర్చి ఈ కార్యక్రమం చేపట్టింది. దాదాపుగా 11 నెలలుగా సర్వే ప్రక్రియ సాగుతోంది. ఇటీవల మూడు నెలలు భారీ వర్షాలు, మొంథా తుఫాన్ మూడో దశ సర్వేకు శరాఘాతంగా మారాయి. మరోవైపు పీజీఆర్‌ఎస్‌లో, ఇతర చోట్ల రీ సర్వే, ఆన్‌లైన్ అంశాల పైనే ప్రజలు భారీగా వినతు లు ఇవ్వడంతో రీ సర్వేకు కొంత ఆటంకాలుగా పరిణ మిస్తున్నాయి. జిల్లాలో ఇటీవల స్వమిత్ర సర్వే కింద గ్రామకంఠాలు, ఇళ్ల పట్టాల వ్యవహారాలపై సర్వేలను ల్యాండ్ అండ్ సర్వే అధికారులు చేస్తుండడంతో మూడో దశలో ఆటుపోట్లే ఎక్కువగా ఎదుర వుతున్నాయి.
నెలాఖరుకు మూడో విడత పూర్తి
జిల్లాలో భూముల రీ సర్వేను మొదటి విడతలో 24 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా 24,605 ఎకరాల్లో ప్రారంభించారు. అనంతరం రెండోదశ కింద 30 గ్రామాల్లో 36,540 ఎకరాల్లో అధికారులు రీ సర్వేను పూర్తి చేశారు. రెండు విడతల్లోను భూములు కొలిచే రోవర్ల సంఖ్య తక్కువగా ఉండడంతో పనులు నెమ్మ దించాయి. ఇప్పుడు మూడో విడత కింద సెప్టెం బరులో 59 గ్రామాల్లో సర్వే ప్రారంభించగా 105 రోవర్లను వినియోగిస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో సరిహద్దులు గుర్తింపును 21,927 ఎకరాల్లో పూర్తి చేశారు. ప్రైవేట్ భూముల్లో 70,943 ఎకరాలకు ఇప్పటి వరకు 54,070 ఎకరాలు పూర్తి చేసి 74 శాతం పురోగతి సాధించినట్టు అధికారులు చెబుతున్నారు. ఇంకా 16,885 ఎకరాల సరిహద్దులు, పొలం గట్లు సర్వే చేసి లెక్కలను తేల్చాల్సి ఉంది. ఎట్టిపరిస్థితు ల్లోనూ ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయిం చుకున్నారు. డిసెంబరులో మొత్తం మూడు విడతలుగా చేపట్టిన సర్వే తాలూకా వివరాలను రెవెన్యూశాఖ వెబ్‌ల్యాండ్ పోర్టర్ అప్‌లోడ్ చేయనున్నారు.
191 గ్రామాలు.. నాలుగు విడతలు
జిల్లాలో మూడు విడతలుగా చేపట్టిన సర్వే పారదర్శకంగానే చేపట్టామని, ఇక వచ్చే ఏడాది నుంచి నాలుగు విడతలుగా 191 గ్రామాల్లో రీ సర్వే చేయాలని ప్రణాళికను రూపొందిస్తున్నామని సర్వేఅండ్ ల్యాండ్స్ రికార్డ్సు ఏడీ అన్సారీ తెలిపారు. అన్ని అంశాలు అనుకూలిస్తే 2026 చివర నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నామన్నారు.