రూటు మార్చిన.. రేషన్ మాఫియా
ABN , Publish Date - Dec 05 , 2025 | 11:36 PM
రేషన్ మాఫియా జడలు విప్పుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి బియ్యం అక్రమంగా ఇతర జిల్లాలకు, ఆపై విదేశాలకు తరలి వెళుతోంది. రేషన్ బియ్యం రీసైక్లింగ్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం కనిపించడం లేదు. విజిలెన్స్ అధికారులు వ్యాపారులపై దాడులు చేసి బియ్యాన్ని పట్టుకుంటున్నా వారు వెనక్కి తగ్గడం లేదు.
ఉమ్మడి పశ్చిమ నుంచి చెన్నయ్ పోర్టుకు.. అక్కడ నుంచి విదేశాలకు ఎగుమతి
40 శాతం రేషన్ బియ్యం
మళ్లీ మార్కెట్‌లోకే..
రీసైక్లింగ్‌కు వెనుకాడని వ్యాపారులు
(ఏలూరు/భీమవరం–ఆంధ్రజ్యోతి)
రేషన్ మాఫియా జడలు విప్పుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి బియ్యం అక్రమంగా ఇతర జిల్లాలకు, ఆపై విదేశాలకు తరలి వెళుతోంది. రేషన్ బియ్యం రీసైక్లింగ్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం కనిపించడం లేదు. విజిలెన్స్ అధికారులు వ్యాపారులపై దాడులు చేసి బియ్యాన్ని పట్టుకుంటున్నా వారు వెనక్కి తగ్గడం లేదు. ఫలితంగా ప్రతీ నెల టన్నుల కొద్దీ బియ్యం చెన్నై పోర్టుకు అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి అవుతోంది. రేషన్ బియ్యంలో వున్న పోషకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలం కావడమే విక్రయాలకు కారణంగా కనిపిస్తోంది.
భారత ఆహార సంస్థకు జిల్లాలో బియ్యాన్ని అప్పగి స్తుంటారు. ప్రభుత్వం మిల్లర్లకు లక్ష్యాలను నిర్దేశిస్తుంది. అందుకే ఇక్కడ కొద్దిమంది తప్ప మిల్లర్లు రీసైక్లింగ్‌కు సాహసించడం లేదు. అదే తూర్పు గోదావరి జిల్లాలో భారత ఆహార సంస్థకు అంతగా కేటాయించడం లేదు. దీంతో రేషన్ బియ్యాన్ని వ్యాపారులంతా అదే జిల్లాకు తరలిస్తున్నారు. జిల్లా నుంచి ప్రధాన రహదారులపై పొరుగు జిల్లాకు వెళుతున్నాయి. దీంతో అక్కడ వ్యాపా రులు డెన్‌లు ఏర్పాటు చేసి జిల్లా నుంచి రేషన్ బియ్యా న్ని సేకరిస్తున్నారు. తాడేపల్లిగూడెం కేంద్రంగానే ఓ డెన్ నడిచింది. ఇటీవల దానిపై ఉక్కుపాదం మోపారు. ఇతర జిల్లాల నుంచి వ్యాపారులు ఇక్కడకు వస్తున్నారు. రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు.
40 శాతం పక్కదారి
పశ్చిమగోదావరిలో ప్రతి నెలా 8,750 టన్నుల బియ్యా న్ని రేషన్ లబ్ధిదారులకు అందజేస్తున్నారు. గతం లో కేవలం ఖరీఫ్ బియ్యాన్ని ఇచ్చేవారు. ఇప్పుడు రబీలో ఉత్పత్తి అవుతున్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెలా 40 శాతం రేషన్ బియ్యం మార్కెట్‌కు తరలి పోతోంది. అంటే ప్రతినెలా 3,500 టన్నుల బియ్యం మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. వినియోగదారులే వ్యాపా రులకు అమ్ముతున్నారు. డిమాండ్‌ను బట్టి గరిష్టంగా కిలో రూ.15 లకు కొంటున్నారు. అదే బియ్యం ఇతర దేశాలకు కిలో రూ.40కు అమ్ముడుపోతోంది. గతంలో కాకినాడ వ్యాపారుల వద్దకు రేషన్ బియ్యమంతా చేరేది. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాకు తరలివెళుతోంది.
రేషన్ బియ్యమే గిట్టుబాటు
గతంలో తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలకు చెంది న మిల్లర్లు జిల్లా నుంచి ధాన్యం కొనుగోలు చేసే వారు. తాడేపల్లిగూడెం, తణుకు మండలాల్లో ఇతర దేశాల్లో డిమాండ్ వున్న రకాలను పండిస్తుంటారు. ఇటీవల విదేశాలకు ఎగుమతులు గిట్టుబాటు కావడం లేదంటూ ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. లేదంటే ప్రభుత్వ మద్దతు ధరకంటే అధికంగా చెల్లించి కొనుగోలు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇతర జిల్లాల మిల్లర్లు జిల్లాలోని ధాన్యం కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. అంతా ప్రభుత్వానికి అమ్మకాలు సాగిస్తున్నారు. ఫలితం గా ఇతర దేశాలకు ఎగుమతి చేయాలన్నా, రీసైక్లింగ్ చేయాలన్నా రేషన్ బియ్యం గిట్టుబాటు అవుతోంది. వీటి పైనే వ్యాపారులు ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఎగు మతులు చేస్తున్నారు.
ఎన్నెన్నో ఆరోగ్య పోషకాలు
గతంలో రేషన్ బియ్యం ముతగ్గా.. రాళ్లు, బెడ్లతో ఉండేవి. అందువల్ల వాటిని తినడానికి ఇష్టపడేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని ఇస్తోంది. వీటిని లబ్ధిదారులకు ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వం కిలోకు రూ.46 భరిస్తోంది. అంటే కిలో రేషన్ బియ్యం రవాణా, నిర్వహణ చార్జీలతో కలిపి రూ.50 అవుతుంది. బియ్యంలో నూక, రాళ్లు వంటి వాటిని నివా రించడానికి సార్టెక్స్ మిషన్లను వాడుతోంది. దీంతో గతంలో 25 శాతం నూక ఉంటే ఇప్పుడు 15 శాతం, పాడైన, రంగు మారిన బియ్యం మూడు నుంచి 1.5 శాతానికి పరి మితమయ్యాయి. ఆరోగ్యపరంగా మేలు చేయడానికి మైక్రో న్యూట్రియంట్స్ కలిగిన కెర్నెల్స్‌ని కలుపుతున్నారు. రేషన్ బియ్యంలో బాగా తెల్లగా కనబడేవి ఇవే. పిల్లలు, మహిళల్లో రక్తహీనతకు చెక్ పెట్టడానికి ఐరన్, నరాలు, మెదడు చురుగ్గా పని చేయడానికి, రక్తం తయారు కావడానికి విటమిన్ బి 12, మహిళల ఆరోగ్యానికి ఫోలిక్ యాసిడ్ వంటి వాటితో కూడినవి ఈ కెర్నెల్స్. వీటిని ప్లాస్టిక్ బియ్యం అనే అపోహలో జనం ఉండిపోయారు. వీటిపై అవగాహన కల్పించడంలో ఆ శాఖలు విఫలమవుతున్నాయి. దీంతో రేషన్ బియ్యం కిలో రూ.20లకు దుకాణం వద్ద విక్రయిం చేస్తున్నారు.
ఏలూరు జిల్లాలో నెలకు 120 లారీలకు పైనే..
పౌరసరఫరాల మంత్రి ఇన్‌చార్జిగా ఉన్న ఏలూరు జిల్లాలోను రేషన్ మాఫియాకు అడ్డుకట్ట పడడం లేదు. పాతసీసాలో కొత్తసారా చందంగానే వైసీపీ నేతలతో, గతంలో బియ్యం అక్రమంగా తోలకాలు చేసిన చోటా, బడా నేతలతో కొందరు కూటమి నేతలు కుమ్మక్క య్యారు. ప్రస్తుతం కొన్నిచోట్ల ప్రజా ప్రతినిధులు అనుచరగణం పేరు మీదుగా రేషన్ మాఫియాకు బలం చేకూర్చి కాసులు దండుకుంటున్నారు. ఏలూరు జిల్లా నుంచి తాడేపల్లిగూడెంలో కొన్నిచోట్ల రేషన్ బియ్యం రీస్లైకింగ్ జరుగుతోంది. తర్వాత మండపేట, రావుల పాలెం, పిఠాపురాల్లో రేషన్ మాఫియా ముఠా రేషన్ బియ్యం వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలు గా చేస్తున్నారు. ఏలూరు బైపాస్ నుంచి నల్లజర్ల మీదుగా దేవరపల్లి వయా రాజమండ్రి కాకినాడ పోర్టుకు చేర్చుతున్నారు. భీమడోలు –గుండుగొలను జాతీయ రహదారి లోపలకు గోడౌన్లు ద్వారా చేర్చి సరుకును మాఫియా దారి మళ్లిస్తోంది. జిల్లాలో 28 మండలాలుండగా, రేషన్ పంపిణీ పూర్తైన నెలలో కనీసం ప్రతీ మండలంలో 5 నుంచి 6 లారీల సరుకు కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి జరుగు తోంది. రైతుల నుంచి కొన్న 1010 రకం బియ్యాన్ని కొద్దినెలలుగా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నా రు. కనీసం పదిశాతం కూడా ప్రజలు తినకుండా మొత్తంగా సంచుల్లోనే బియ్యం దుకాణాల్లో, ఇంటికి వచ్చే మోటారు సైకిళ్లు, చిరు వ్యాపారులకు కిలో 12 నుంచి 15 వరకు అమ్మేస్తున్నారు. తాడేపల్లిగూడెం వద్ద ఈ బియ్యం 18 రూపాయలకు, కాకినాడ వద్ద క్వింటాకు 3,200కు బ్రోకర్లు కొని ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. అత్యధికంగా వీరే మార్జిన్ ఎక్కువ పొందుతున్నట్టు ఆరోపణలున్నాయి. సగటున ప్రతీ నెల 120 లారీలు వరకు బియ్యం లోడులారీలు తరలిపోతున్నాయి. ఈ అక్రమాలను అడ్డుకోకుండా చూస్తూ ఉంటున్న అన్నిశాఖలకు భారీగానే మాఫియా చేతులు తడుపుతున్నారే ఆరోపణలున్నాయి.