మాకేంటి భయం!
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:56 PM
రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. ఉచితంగా ప్రభుత్వం అందించే బియ్యంకు అధిక ధర ఆశ చూపి కార్డుదారుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం అందించే బియ్యం నాసిరకమంటూ ప్రచారంతో చీకటి వ్యాపారాన్ని పెంచుకుంటు న్నారు.
రేషన్ బియ్యం మాఫియా బరి తెగింపు
పక్కదారి పడుతున్న పేదల బియ్యం
కేజీ రూ.12 నుంచి రూ.15 వరకు కొనుగోలు
గుట్టుచప్పుడు కాకుండా రాత్రిళ్లు తరలింపు
పట్టించుకోని సివిల్ సప్లైస్, విజిలెన్స్ అధికారులు
(జంగారెడ్డిగూడెం రూరల్)
రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. ఉచితంగా ప్రభుత్వం అందించే బియ్యంకు అధిక ధర ఆశ చూపి కార్డుదారుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం అందించే బియ్యం నాసిరకమంటూ ప్రచారంతో చీకటి వ్యాపారాన్ని పెంచుకుంటు న్నారు. పగలంతా సేకరించిన బియాన్ని రాత్రి సమయంలో దర్జాగా వాహనాలపై తరలిస్తు న్నారు. ‘ఎవరి పర్సంటేజ్ వారికి అందించాం.. మాకేంటి భయం’ అంటూ నిర్భీతితో బియ్యాన్ని సేకరించి తరలిస్తున్నారు. కళ్ల ముందే అంతా జరుగుతున్నా వారిపై చర్యలు శూన్యం.
జిల్లాలో మొత్తం 1,123 చౌక దుకాణాలు ఉన్నాయి. ప్రతి నెల 9,200 నుంచి 9,500 మెట్రిక్ టన్నుల బియ్యం జిల్లాలకు సరఫరా అవుతోంది.వీటిలో 8,500 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం చౌక దుకాణాల ద్వారా కార్డులకు అందుతుంది. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్డే మీల్స్‌కు సంబంధించి 500 మెట్రిక్ టన్నుల బియ్యం, అంగన్‌వాడీలకు 200 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ వాహనాల ద్వారా కార్డుదాలకు ఇళ్ల వద్దకే వెళ్లి చౌక డిపోలకు సంబంధించిన నిత్యావసర సరుకులను అందించేవారు. ఈ క్రమంలో కార్డుదారుల నుంచి ఎండీయూ వాహన నిర్వాహకులు బియ్యాన్ని కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని కూటమి ప్రభుత్వం భావించింది. అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎండీయూ వ్యవస్థనే తొలగించి ఎప్పటి మాదిరిగానే చౌక డిపోల వద్దకు వెళ్లి బియ్యం తెచ్చుకునేలా నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలో కొందరు కార్డుదారులు బియ్యంను రేషన్ డీలర్లకే అమ్మేస్తున్నారు. దీనికితోడు 60 ఏళ్లు దాటిన వృద్ధులు, మంచానపడ్డ వారికి ఇళ్లకు వెళ్లి రేషన్ ఇవ్వా లనే కొత్త నిబంధన కొంతమంది డీలర్లకు బాగా కలిసొచ్చినట్టు చెబుతున్నారు. నేరుగా ఈ–పోస్ మిషన్‌ను వీళ్ల ఇంటికి తీసుకువెళ్లి వారి వేలి ముద్రలు తీసుకుని ఎంతో కొంత సొమ్ము ముట్టచెప్పి వచ్చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు బియ్యం అక్రమ రవాణాలు రెట్టింపైనట్టు సమాచారం.
ఉమ్మడి పశ్చిమ నుంచి తూర్పునకు..
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణ ప్రాంతాల నుంచి రేషన్ బియ్యాన్ని వాహనాలపై తూర్పుగోదావరి జిల్లాలోని మిల్లర్లకు, పోర్టుకు తరలిస్తున్న ట్టు ప్రచారం. విజిలెన్స్ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేసినా ఈ దందాకు బ్రేక్ పడడం లేదు. గతంలో రేషన్ బియ్యంను తక్కువ ధరలకు కొనుగోలు చేసి వాటిని రీసైక్లింగ్ చేసి మార్కెట్‌లో విక్రయించేవారు. ఇప్పుడు ఆ వ్యాపారం కాస్త తగ్గి నేరుగా కాకినాడు పోర్టుకు తరలించేం దుకు తూర్పుగోదావరికి చెందిన కొంతమంది బడా వ్యాపారస్తులు ఇక్కడ కొంతమంది ద్వారా వ్యాపారాన్ని చేస్తున్నట్టు చెబుతున్నారు. వీరితో పాటు ప్రతి గ్రామంలో బియ్యంను కొనుగోలు చేసే వారు తయారయ్యారు. ఒక లారీ ట్రిప్ లక్ష్యంకు చేరితే రాత్రికి రాతే లక్షల్లో ఆదాయం వస్తుంది. దీంతో కేసులు పెట్టినా పట్టించుకోకుండా ఈ చీకటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
కిలోకు రూ.15
ఒకప్పుడు రేషన్ బియ్యం కిలోకు రూ.8 నుంచి రూ.10లు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం కేజీ రేషన్ బియ్యం రూ.15 నుంచి రూ.16 వర కు ధర కట్టి కార్డుదారుల నుంచి కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు. ఎక్కు వ మొత్తంలో రేషన్ బియ్యం అందించే వ్యాపారస్తులకు, కొంతమంది డీలర్లకు నేరుగా కేజీకి రూ.20నుంచి రూ.22లు ధర ఇస్తున్నట్టు సమాచారం.
పట్టని అధికారులు
రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తి నట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు విని పిస్తున్నా యి. ఒకవేళ పట్టుకున్నా కొంతమంది రాజకీయ నాయకులు, ఉన్న తాధి కారులు తమకు బంధు వులంటూ బెదిరింపు లకు దిగుతున్నారు. కూటమి ప్రభుత్వం దృష్టి సారించి బియ్యం మాఫియా పై కఠిన చర్యలు తీసుకుని అడ్డుకో వాలంటూ పలువురు కోరుతున్నారు.