Share News

రేషన్‌ బియ్యం మాఫియా

ABN , Publish Date - Jul 06 , 2025 | 12:30 AM

నూజివీడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.

 రేషన్‌ బియ్యం మాఫియా

ఈ నెలలో ఇప్పటికే రెండుసార్లు పట్టివేత

ప్రభుత్వం మారినా ఆగని దందా

నూజివీడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా సాగిన రేషన్‌ బియ్యం దందా టీడీపీ ప్రభుత్వంలోను యఽథావిధిగానే సాగుతుండడం విశేషం.

నూజివీడు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ బియ్యం అక్రమ రవాణ యథేచ్ఛగా సాగు తోంది. ఏ ప్రభుత్వం ఉన్నా ఈ బియ్యం అక్ర మ రవాణాలో ప్రధాన పాత్రధారులు మాత్రం మారరు. పోలీస్‌, రెవెన్యూ, అధికార పార్టీకి చెందిన నేతల సహకారంతో గత ఆరేళ్ల నుంచి ఈ బియ్యం అక్రమ రవాణా సాగుతోంది. ఈ నెలలో ఇప్పటికే రెండుసార్లు నూజివీడు నియోజకర్గంలో రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈనెల మూడో తేదీన నూజివీడు బైపాస్‌ రోడ్‌ లో ఐదు టన్నుల బియ్యాన్ని పట్టుకోగా, తాజా గా 26 క్వింటాళ్ల బియ్యం మర్సపూడిలో పట్టుబడింది. ఈ బియ్యం అధికారుల తనిఖీల్లో కాకుండా గ్రామస్థులే పట్టించడం గమనార్హం.

పక్కాగా బియ్యం సేకరణ

రేషన్‌ బియ్యం అర్హత ఉన్న లబ్ధిదారుల నుంచి కొందరు రేషన్‌షాప్‌ డీలర్లే కేజీ రూ.12 నుంచి రూ.15 వరకు డిమాండ్‌ను బట్టి కొంటున్నారు. డీలర్‌ దగ్గర నుంచి రూ.15 నుంచి రూ.18 చెల్లించి దళారి కొనుగోలు చేస్తాడు. ఆగిరిపల్లి నూజివీడు ముసునూరు చాట్రాయి మండలాల నుంచి ఈ బియ్యం కొనుగోలును మండలానికి ఒకరు చొప్పున నలుగురు పర్యవేక్షిస్తున్నారు. వీరి వద్ద నుంచి పీఆర్‌ అన వ్యక్తి రూ.20 నుంచి రూ.22లకు కొనుగోలు చేస్తాడు. ఇతను గన్నవరం,తిరువూరు, మైలవరం నియోజవర్గాల నుంచి భారీగా ఈ రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి హనుమాన్‌ జంక్షన్‌ వద్ద జాతీయ రహదారికి అతి చేరువలో ఉన్న ఒక గ్రామంలో రైస్‌ మిల్లు లీజుకు తీసుకుని స్టాక్‌ పాయింట్‌గా ఉపయోగిస్తున్నాడని ప్రచారంలో ఉంది.

డీలర్లకు సైతం వేధింపులే..

కోళ్లఫాారాల యజమానులు వారి అవసరార్థం రేషన్‌ షాప్‌ డీలర్‌ నుంచి ఈ రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేస్తుంటారు. దళారుల కన్నా రెండు రూపాయల వరకు ఎక్కువ ధర ఇచ్చి కొంటుంటారు. అయితే డీలర్లు రేషన్‌ బియ్యాన్ని తమకే అమ్మాలని, విరుద్ధంగా జరిగితే మీపై ప్రభుత్వ అధికారులతో దాడులు చేయిస్తామని బెదిరింపులకు దిగడంతో దళారులకే బియ్యాన్ని అమ్ముతున్నట్టు ప్రచారంలో ఉంది. గ్రామాల్లో రిక్షాలపై ఉప్పు లేదా ఉల్లిపాయలు వంటి సరుకులను బియ్యం మారకంతో అమ్ము కునే చిల్లర వ్యాపారులను సైతం రేషన్‌ బియ్యం దళారులు వదలడం లేదు. ఆ బియ్యా న్ని సైతం తమకే ఇవ్వాలని బెదిరించి మరి తీసుకుంటున్నారని తెలుస్తోంది. అన్ని రకాలుగా సేకరించిన బియ్యాన్ని స్టాక్‌ పాయింట్‌ వద్దకు చేరుస్తారు. అక్కడి నుంచి పెద్ద లారీల్లో బియ్యం లోడ్‌ అయ్యి కాకినాడ పోర్టుకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతీ లారీ ముందు ఒక కారులో ఇద్దరు వ్యక్తులు మార్గమధ్యలో అవసరమైన చోట సొమ్ములు చెల్లించుకుంటూ పోర్టు వరకు ఎస్కార్ట్‌గా వెళ్లతారు.

పట్టుబడిన బియ్యం లెక్కలేమిటి..!

రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడిన రేషన్‌ బియ్యం లెక్కలు తీస్తే మరో స్కాం బయటపడుతుందని ప్రచారం ఉంది. పట్టుబడిన రేషన్‌ బియ్యాన్ని సమీపంలోని రైస్‌ మిల్లులుకు తరలిస్తారు. కాగా ప్రభుత్వం దృష్టి సారించి వివిధ రైస్‌ మిల్లులు వద్దకు చేరిన ఈ సదరు బియ్యాన్ని ఎన్ని టన్నులు వినియోగించబడింది...? ఎన్ని టన్నులు పురుగులు పట్టి పనికి రాకుండా పోయింది..? లెక్కలు తీస్తే మరో స్కాం బయట పడుతుందని పలువురు పేర్కొంటున్నారు.

26 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

నూజివీడు మండలం మర్సపూడిలో శుక్రవారం అర్ధరాత్రి గ్రామంలోని రేషన్‌ షాపు నుంచి మినిలారీలోకి రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా లోడ్‌ చేస్తుండగా, చుట్టుపక్కల గ్రామస్థులు బియ్యం, అక్రమ రవాణాను అడ్డుకున్నారు. పోలీసులకు రెవెన్యూశాఖకు సమాచారం అందించడంతో, అధికారులు వచ్చి లారీకి సీజ్‌ చేసి శనివారం ఉదయం నూజివీడు పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. డీలర్‌ అచ్చయ్య బత్తులవారిగూడెంకు చెందిన సొంగ రాముపై కేసు నమోదు చేసినట్టు నూజివీడు డిప్యూటీ తహసీల్దార్‌ జి.వెంకటేశ్వరరావు తెలిపారు.

Updated Date - Jul 06 , 2025 | 12:30 AM