నిర్వాసితుల రేషన్ కష్టం
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:34 AM
బుట్టాయగూడెం మండలం రామన్నగూడెం పునరావాస కాలనీలో ఉంటున్న నిర్వాసితులకు రేషన్ సరుకులు 300 కిలో మీటర్ల దూరం నుంచి తెచ్చుకోవాలి.
రేషన్ సరుకులు తెచ్చుకోవాలంటే 300 కిలో మీటర్లు వెళ్లాలి
రూ.30 వేల ఖర్చు తప్పదు
బుట్టాయగూడెం పునరావాస కాలనీలో అల్లూరి
సీతారామరాజు మన్యం జిల్లా నిర్వాసితులు
రెండేళ్లుగా రేషన్ కార్డులు మార్చలేదు!
బుట్టాయగూడెం మండలం రామన్నగూడెం పునరావాస కాలనీలో ఉంటున్న నిర్వాసితులకు రేషన్ సరుకులు 300 కిలో మీటర్ల దూరం నుంచి తెచ్చుకోవాలి. రెండు వాహనాలకు సుమారు రూ.30 వేలు చెల్లించాలి. మన్యం జిల్లా పోచవరం నిర్వాసితులను ఇక్కడికి తరలించారు. వారి రేషన్ కార్డులు ఇక్కడి బదిలీ కాలేదు. రేషన్ సరుకులు అలాట్‌మెంట్ లేదు. ప్రతి నెల 300 కిలో మీటర్ల దూరం నుంచి రేషన్ తెచ్చుకోవలిసిందే. రెండేళ్లుగా రేషన్ కార్డు సమస్యపై ఎంతమంది అధికారులకు విన్నవించినా పట్టించుకున్న వారే లేరు.
బుట్టాయగూడెం, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): రేషన్ కష్టాల ను ఎప్పటికి తీరుస్తారని రామన్నగూడెం (పోచవరం) ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన నిర్వాసితులు అడుగుతున్నారు. రెండేళ్ల నుంచి రేషన్ సరుకుల కోసం ఇబ్బందులు పడుతు న్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ తెచ్చుకోవాలంటే సుమారు 300 కిలో మీటర్లు వెళ్లాలని, రూ.30 వేలు ఖర్చు చేయాలని గగ్గోలు పెడుతున్నారు. తమ కష్టాలను ఐటీడీఏ అధికారులు, రెవె న్యూ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఆగస్టు నెల రేషన్ బియ్యం ఇస్తున్నా పోచవరం కాలనీ నిర్వాసితులకు పిలుపు రాలేదు.
గత ప్రభుత్వ హయాంలో అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా చింతూరు ఐటీడీఏ పరిధిలోని వీఆర్ పురం మండలం పోచవరం గ్రామానికి చెందిన 160 నిర్వాసిత కుటుంబాలను బుట్టాయగూడెం మండలం నిమ్మలగూడెం, రామన్నగూడెం ప్రాంతాల్లో నిర్మించిన కాలనీలకు తరలించా రు. రెండేళ్ల క్రితం తరలించినా ప్రతినెల రేషన్ బియ్యాన్ని 260 కిలో మీటర్ల దూరంలో పోచవరం వెళ్లి రేషన్ బియ్యాన్ని తెచ్చుకుంటున్నారు. కాలనీలకు నిర్వాసితులను తరలించేటపుడు అధికారులు వారి రేషన్ కార్డుల్లో మార్పులు చేయకపోవడంతో కష్టాలు పడుతున్నారు. రేషన్ కష్టాలు తొలగించాలని ప్రజా ప్రతినిధులను, అధికారులను వేడుకుంటూనే ఉన్నారు. ఆగస్టు నెల రేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. పోచవరం రెవెన్యూ అధికారుల నుంచి నిర్వా సితులకు పిలుపు రాకుంటే రేషన్ బియ్యం రానట్లే. వర్షాలు, వరదలు కారణంగా ఇప్పటి వరకు నిర్వాసితులకు బియ్యం పిలుపు రాలేదు. పోచవరంలోని రేషన్‌కార్డులను ఆన్‌లైన్‌లో మార్పులు చేసి రామన్నగూడెం కాలనీలోనే రేషన్ బియ్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఉన్నతాధికారులకు నివేదించాం
నిర్వాసితుల రేషన్ కష్టాలపై తహసీల్దార్ పీవీ చలపతిరావు, సీఎస్‌ఆర్‌ఐ కె.పద్మను వివరణ కోరగా అందరి వివరాలు తీసుకున్నామని, డివిజన్, జిల్లా అధికారులకు నివేదిక పంపించామన్నారు. త్వరలోనే వారికి రామన్నగూడెంలోనే రేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. వీఆర్ పురంలో ఆఫ్‌లైన్ విధానం ఉందని, బుట్టాయగూడెం మండలంలో ఆన్‌లైన్ విధానం కొనసాగుతున్నందున ఆలస్యం జరుగుతుందన్నారు. వీఆర్ పురం రెవెన్యూ అధికారులతో మాట్లాడామని, అన్ని కుటుంబాల కార్డులను మార్పుచేసి ఆన్‌లైన్ చేయడం ద్వారా రేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. వర్షాకాలం అయినందున 3 నెలల రేషన్ వచ్చిందని త్వరలోనే ఇస్తామన్నారు.
రేషన్ బియ్యానికి వేల ఖర్చు
రేషన్ బియ్యానికి వేలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. పది మందికి పైగా కూలి పనులు మానుకుని వాహనాల్లో రేషన్ తెచ్చుకోవడం కష్టంగా ఉంటుంది. కార్డులు మార్పు చేయకపోవడంతో రేషన్‌తోపాటు ఇతర ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కారించాలి.
వేట్ల ముత్యాలరెడ్డి, కాలనీ నిర్వాసితుడు
రేషన్ బియ్యమే ఆధారం
ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని వేలు ఖర్చుచేసి తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. అన్ని కుటుంబాలవారు రేషన్‌పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం బియ్యం కోసం వెళదామంటే వర్షాలు, వరదలు వస్తున్నాయి రావద్దంటున్నారు. రేషన్ కోసం వెళితే తిరిగోస్తామో లేదో తెలియదు. నిర్వాసిత కుటుంబాలకు వెంటనే రేషన్ అందెలా చర్యలు తీసుకోవాలి.
అందెల సీతారామరెడ్డి, కాలనీ పెదకాపు