Share News

రేషన్‌ ‘డీలా’ర్లు

ABN , Publish Date - Dec 06 , 2025 | 11:56 PM

చౌక డిపోల ద్వారా సరుకుల పంపిణీపై ప్రభుత్వం ఇస్తున్న కమీషన్‌ పెంచాలంటూ కొన్నేళ్లుగా రేషన్‌ డీలర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

రేషన్‌ ‘డీలా’ర్లు

కమీషన్‌ గిట్టుబాటు కావడం లేదని గగ్గోలు

చౌక డిపో బాధ్యతలకు చెల్లుచీటీ

జిల్లాలో 101 రేషన్‌ దుకాణాలు ఖాళీ

ఇన్‌చార్జిలు, మహిళా సంఘాలకు అప్పగింత

భర్తీకి రాజకీయ నేతల ఒత్తిడి

సాహసించని అధికారులు

చౌక డిపోల ద్వారా సరుకుల పంపిణీపై ప్రభుత్వం ఇస్తున్న కమీషన్‌ పెంచాలంటూ కొన్నేళ్లుగా రేషన్‌ డీలర్లు డిమాండ్‌ చేస్తున్నారు. కమీషన్‌ పెరగకపోగా మరిన్ని బాధ్యతలు పెరగడంతో గిట్టుబాటు కావడం లేదని గగ్గోలు పెడుతున్నారు. ఒక్కొక్కరూ డీలర్‌షిప్‌ వదులుకుంటున్నారు. వయసు మీరిందని, పిల్లలు అందివచ్చారని, కమీషన్‌ గిట్టుబాటు కావడం లేదని జిల్లాలో 101 రేషన్‌ షాపుల డీలర్లు తప్పుకున్నారు. వారిస్థానంలో కొత్తవారిని భర్తీచేయకుండా మరొక డీలర్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నారు. లేదంటే స్వయం సహాయక సంఘాలతో నడుపుతున్నారు.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఖాళీగా ఉన్న చౌకడిపోలకు డీలర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. గతంలో రోస్టర్‌ ప్రకారం చౌక డిపోలు కేటాయించడంతో పాటు రిజర్వేషన్లను అమలు చేశారు. ప్రస్తుతం అదేవిధంగా భర్తీ చేయాల్సి ఉండగా రాజకీయ నేతల ఆకాంక్షలు వేరేగా ఉంటున్నాయి. తమ సానుభూతిపరులకు కేటాయించాలంటూ అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. నిబంధనలు మార్పు చేసి నోటిఫికేషన్‌ విడుదల చేయాలంటూ అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. వాస్తవానికి జిల్లాలో 1052 రేష న్‌ షాపులున్నాయి. 101 షాపులకు డీలర్లు లేరు. వాటిలో 70 షాపుల బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. మరో 31 షాపుల్లో ఇన్‌చార్జి లను నియమించారు. రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో భర్తీకి అధికారులు సాహసించడం లేదు.

కమీషన్‌కోసం ఎదురుచూపు

ఇటీవల ప్రభుత్వం కమీషన్‌ల మంజూరులో కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో 5,62,689 రేషన్‌ కార్డులున్నాయి. వాటిలో 1,46,729 కార్డులకు కేంద్ర ప్రభుత్వం ప్రతీనెలా 2762 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని లబ్ధిదారులకు ఉచితంగా అందజేస్తోంది. రాష్ట్ర ప్రభు త్వానికి చెందిన 4,15,960 కార్డులకు ప్రతినెలా 5580 టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. కిలో బియ్యానికి రేషన్‌ డీలర్లకు రూపాయి వంతున కమీషన్‌ చెల్లిస్తు న్నారు. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా కమీషన్‌ జమ చేసేలా నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కమీషన్‌ను రేషన్‌ డీలర్లు పంచదార కొనుగోలు చేయడానికి మళ్లిస్తున్నారు. రేషన్‌ పంపిణీలో లబ్ధిదారులకు పంచదార కూడా పంపిణీచేసి ఆ సొమ్ము ను కమీషన్‌ రూపంలో సొంత అవసరాలకు వినియో గించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన బియ్యానికి నేరుగా డీలర్ల ఖాతాలో జమ చేస్తా మని ప్రకటించినా గడచిన మూడు నెలల నుంచి పెండింగ్‌ లో పెట్టింది. మొత్తంపైన జిల్లాలోని రేషన్‌ డీలర్లకు కేంద్రం నుంచి రూ.82.86 లక్షలు రావాల్సి ఉంది. ఆ సొమ్ముల కోసం డీలర్లు ఎదురుచూస్తున్నారు.

పెరిగిన ఖర్చులు

ప్రస్తుతం డీలర్‌కు కమీషన్‌ గిట్టుబాటు కావడం లేదు. వృద్ధులకు ప్రతినెలా ఇంటింటికి వెళ్లి బియ్యం చేరవేయడానికి రవాణా చార్జీలు ఇవ్వాలంటూ డీలర్లు ప్రతిపాదిస్తున్నారు. మరోవైపు పట్టణాలు, పల్లెలో రేషన్‌ షాపుల అద్దెలు పెరిగిపోయాయి. వైసీపీ ప్రభుత్వంలో బియ్యం సంచులను కూడా వెనక్కు తీసుకున్నారు. సొమ్ములను జమ చేస్తామని డీలర్లకు భరోసా ఇచ్చినా మొండిచేయి చూపారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత బియ్యం సంచులను డీలర్లకే విడచి పెడుతోంది. వాటి విక్రయాల ద్వారా అదనంగా రూ.2వేలు కలసి వస్తోంది. కార్డుల సంఖ్యను బట్టి నెల కు కమీషన్‌ రూపంలో రూ.10వేల నుంచి రూ.15వేల వరకు లభిస్తోంది. అద్దె, ఇతర ఖర్చులు పోతే పెద్దగా మిగిలేదేమీ లేదంటూ డీలర్లు పెదవి విరుస్తున్నారు. కమీషన్‌ పెంచాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా అనుకూలమైన నిర్ణయం రాలేదు. ఫలితంగా పాత వారు ఒక్కొక్కొరుగా వైదొలగుతున్నా రు. వారి స్థానంలో తమ వారికే రేషన్‌ షాపు కేటాయిం చేలా రాజకీయ ఒత్తిడి రావడంతో అధికార యంత్రాం గం ప్రత్యామ్నాయ పద్ధతుల్లో రేషన్‌ పంపిణీ చేస్తోంది.

Updated Date - Dec 06 , 2025 | 11:56 PM