సొసైటీల్లో గోల్డెన్ ఛాన్స్
ABN , Publish Date - Aug 25 , 2025 | 12:00 AM
సహకార రంగానికి పునరుజ్జీవం పోసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.
బంగారంపై రుణాలకు వడ్డీ తగ్గింపు
డీసీసీబీ ద్వారా 9 శాతం వడ్డీ
ఉమ్మడి జిల్లాలో లక్ష మందికి ప్రయోజనం
సహకార రంగానికి పునరుజ్జీవం పోసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గత పాలకులు వైఫల్యాలు, అవినీతి కార్యక్రమాలకు వంతపాడడంతో డీసీసీబీ రూ.100 కోట్ల మేర నష్టాల్లో కూరుకుపోయింది. దాని నుంచి బయటపడటానికి వ్యాపార విస్తరణకు అడుగులు పడుతున్నాయి. బంగారంపై తక్కువ వడ్డీతో సహకార సంఘాల్లో సభ్యులకు రుణాలు అందించానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలో కార్యరూపంలోకి తీసుకురానున్నారు.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో సహకార సంఘాల ద్వారా రైతుల అవసరా లకు రుణాల మంజూరు, విత్తనాలు, పురుగుమందుల విక్రయాలతో సొసైటీలు వ్యాపారాలను చేస్తున్నాయి. తాజాగా వివిధ రూపాల్లో వ్యాపార విస్తరణకు సాధ్యా సాధ్యాలను పరిశీలిస్తున్నారు. బంగారం ధరలు విపరీ తంగా పెరుగడంతో బంగారంపై వడ్డీ తగ్గించి రుణాల మంజూరు ద్వారా రైతులకు చేరువకావడంతో పాటు వ్యాపారం పెరుగుతుందని అంచనా వేశారు. రైతులకు బంగారంపై రుణాలు ఇవ్వడానికి డీసీసీబీ చైర్మన్ గన్ని వీరాంజనేయులు కసరత్తు చేస్తున్నారు. తొలుత ప్రయో గాత్మకంగా ఉమ్మడి జిల్లాలో ప్రారంభించడానికి చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్నారు.
వాణిజ్య బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకులు బంగారం పై 10.5 శాతం వడ్డీ లెక్కన రుణాలు ఇస్తున్నాయి. డీసీసీబీ 33 శాఖల పరిధిలో బంగారంపై 9 శాతం వడ్డీకే రుణాలు జారీకి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తు న్నారు. త్వరలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బోర్డు సమావేశంలో చర్చించి, దసరా నాటికి బంగారంపై రు ణాలు అందజేతకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వాణిజ్యబ్యాంకులకు దీటుగా ఇప్పటికే గ్రాముకు రూ.5 వేలు రుణాలు ఇస్తున్నట్లు అధికారులు చెప్పారు.
లక్షమంది రైతులకు ప్రయోజనం
బంగారంపై తక్కువ వడ్డీతో రుణాల మంజూరుతో ఉమ్మడి జిల్లాలో లక్ష మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఏటా స్వల్ప, దీర్ఘకాలిక రుణాలను 6 లక్షల మంది పైబడి తీసుకొంటున్నారు. దీనికి తోడు విద్యానిధి, వ్యక్తిగత రుణాలు, గృహ తనఖా రుణాలు కూడా తీసుకుంటున్నారు. మన జిల్లా– మన బ్యాంకు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో పొదుపు చేయండి – జిల్లా అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కండి అంటూ డీసీబీబీ రింగ్‌టోన్ ద్వారా ప్రచారం చేస్తోంది. బంగారంపై 9 శాతం వడ్డీకి రుణాలు ఇవ్వగలిగితే లక్ష మందికి ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది రూ.200 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఆప్కాబ్ నుంచి రుణం తీసుకుని బంగారంపై వ్యాపారం చేయడానికి డీసీసీబీ చైర్మన్ గన్ని వీరాంజనే యులు, సీఈవో పి.సింహాచలం అడుగులు వేస్తున్నారు.