విద్వేషాలు సృష్టించేందుకే..
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:24 AM
గ్రామాల్లో విద్వే షాలు రేపి, అల్లర్లు సృష్టించేందుకు ప్రణాళికాబద్ధంగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్‌రంగా విగ్రహాలకు పేడ పూసినట్లు కైకలూరు రూరల్ సీఐ వి.రవికుమార్ తెలిపా రు.
రంగా విగ్రహాలకు పేడ పూశారు.. ఇద్దరు యువకులు, మైనర్ బాలుడి అరెస్ట్
కైకలూరు, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి):గ్రామాల్లో విద్వే షాలు రేపి, అల్లర్లు సృష్టించేందుకు ప్రణాళికాబద్ధంగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్‌రంగా విగ్రహాలకు పేడ పూసినట్లు కైకలూరు రూరల్ సీఐ వి.రవికుమార్ తెలిపా రు. ఈ కేసులో ఇద్దరు యువకులతోపాటు ఓ మైనర్ బాలుడిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కైకలూరు పోలీసు స్టేషన్‌లో మంగళ వారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ‘ఈ నెల 22 రాత్రి కలి దిండి, సానారుద్రవరంలోని రంగా విగ్రహాలకు గొల్లగూడెం కు చెందిన కట్టా ఈశ్వర్‌కుమార్(22), కలిదిండికి చెందిన ఉండ్రాల అయ్యప్ప(26)తోపాటు మరో మైనర్ బాలుడు పథకం ప్రకారం విగ్రహాలకు పేడ పూశారు. 23న కేసు నమోదు చేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఐదు బృం దాలుగా ఏర్పడి సీసీ కెమెరాల ఆధారంగా దుండగులను గుర్తించాం. వీరు ముగ్గురు మంగళవారం కలిదిండి ఏఎంసీ ప్రాంతంలో బైక్‌పై వెళుతుండగా అదుపులోకి తీసుకుని విచారించాం. వారు నేరం అంగీకరించడంతో అరెస్టు చేశాం. గత ఏడాది ఇదే తేదీల్లో కలిదిండి ప్రాంతంలో జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకుని మళ్లీ విద్వేషాలు రెచ్చగొట్టినా ఎవరూ గుర్తించలేరని పక్కా ప్రణాళికతో ఈ ముగ్గురిని విగ్రహాలకు హాని కలిగేలా కొందరు ప్రేరేపించారు. ఇలా చేస్తే రెండు వర్గాల మధ్యన విద్వేషాలు పెరుగుతాయని, ఒక వర్గానికి హాని కలిగే విధంగా ఉంటుందని ఆలోచన చేశారు. పోలీసులు అప్రమత్తమై వీరిని అరెస్టు చేయడంతో వారి కుట్ర వెలుగులోకి వచ్చింది. ఈశ్వర్‌కుమార్ గతంలో హత్యకేసులో నిందితుడని ఈ కేసును మరింత విచారించి వీరి వెనుక వున్న వ్యక్తులను బయటకు తీస్తాం’ అని సీఐ వెల్లడించారు. సమావేశంలో ఎస్‌ఐలు వి.వెంకటేశ్వరరావు, వి.రాంబాబు పాల్గొన్నారు.