రాజ్యసభకు ఉద్దండులు
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:26 AM
ఏ పార్టీ అధికారంలో ఉన్న వీలు కుదిరి నప్పుడల్లా ఉమ్మడి పశ్చిమ నుంచి రాజ్యసభ సభ్యులుగా రాజకీయ ఉద్దండులనే ఎంపిక చేసేవారు. దీర్ఘకాలికంగా రాజకీయాలకు ఆలవాలమైన ఉమ్మడి పశ్చిమలోని డెల్టా ప్రాంతానికి చెందిన వారే అల్లూరి సత్యనారాయణ నుంచి పాకా సత్యనారాయణ వరకు ఎంపికవుతూ వచ్చారు.
ఉమ్మడి పశ్చిమలో సీనియర్లకు ప్రాధాన్యం
టీడీపీ నుంచి బీజేపీ వరకు ఇదే క్రమం
తాజాగా పాకా ఎంపిక
ఏ పార్టీ అధికారంలో ఉన్న వీలు కుదిరి నప్పుడల్లా ఉమ్మడి పశ్చిమ నుంచి రాజ్యసభ సభ్యులుగా రాజకీయ ఉద్దండులనే ఎంపిక చేసేవారు. దీర్ఘకాలికంగా రాజకీయాలకు ఆలవాలమైన ఉమ్మడి పశ్చిమలోని డెల్టా ప్రాంతానికి చెందిన వారే అల్లూరి సత్యనారాయణ నుంచి పాకా సత్యనారాయణ వరకు ఎంపికవుతూ వచ్చారు. రాజకీయాలే కాదు పదుగురిలో సేవకుడిగా, మచ్చ లేని నేతలుగా ఎదిగిన వారిని తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎంపిక చేస్తూనే వచ్చారు. రాజకీయ అనుభవం, ముక్కుసూటితనం, అవినీతికి దూరంగా ఉన్న వారినే పెద్దల సభకు పంపారు. ఈ ఆనవాయితీనే భారతీయ జనతా పార్టీ అందిపుచ్చుకుంది. నాలుగు దశాబ్దాలు సుదీర్ఘ సేవలందించిన వివాదరహిత నేత భీమవరం పట్టణానికి చెందిన పాకాను రాజ్యసభకు ఎంపిక చేశారు. రాజ్యసభకు ఎంపిక, ఎన్నికైనవారంతా జిల్లా ప్రతిష్టను మరింత పెంచడానికే ప్రయత్నించారు.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
నాటి నుంచి నేటి వరకు..
1970–80 మధ్య నుంచి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారు రాజ్యసభ సభ్యులుగా ఎంపికవుతూ వచ్చారు. పాలకొల్లు ప్రాంతానికిచెందిన అల్లూరి సుభాష్ చంద్రబోస్ తండ్రి అల్లూరి సత్యనారాయణ సైతం 80వ దశకం ముందే రాజ్యసభ ఎంపికయ్యారు. అప్పట్లో ఈ ప్రాంతానికే కాక రాష్ట్రస్థాయిలో రాజకీయ ప్రాచుర్యం పొందిన కుటుంబాల నుంచే పెద్దల సభకు ఎంపిక చేసేవారు. కుటుంబ నేపథ్యమే కాకుండా రాజకీయాలు, సేవాతత్పరత, కలుపుగోలుతనం, అంతర్గత క్రమశిక్షణకు నూటికి నూరుశాతం బద్దులైన వారి నుంచే రాజ్యసభకు ఎంపికచేసి పంపేవారు. 80వ దశకం ముందు కాంగ్రెస్ హవా కొనసాగింది. అప్పట్లో ఆ పార్టీ సైతం నిష్ణాతులైన అల్లూరి సత్యనారాయణ వంటి వారిని ఎంపిక చేసినట్టు చెబుతారు. తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం దూసుకొచ్చింది. అప్పట్లో టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు సైతం పార్టీకి అత్యధిక సేవలందించిన వారిని రాజ్యసభకు ఎంపిక చేస్తూ వచ్చారు. ఆనాటి రాజకీయాల్లో తనకు చేదోడువాదోడుగా ఉన్న వారిని ఎన్టీఆర్ గుర్తించే ప్రయత్నం చేశారు. పార్టీ వ్యవహారాలు చురుగ్గా నడిపేవారిని, గండిపేట కేంద్రంగా పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడంలో కీలకపాత్ర వహించిన వారిలో ఒకరైన భీమవరం ప్రాంతానికి చెందిన మెంటే పద్మనాభంను రాజ్యసభకు ఎంపిక చేశారు. 1989 నుంచి 1994 వరకు మెంటే పద్మనాభం పెద్దల సభలో కొనసాగారు. భీమవరం ప్రాంతానికి చెందిన నేతగా ఆయన ఢిల్లీ వ్యవహారాల్లో అప్పట్లో అడుగుపెట్టారు. ఆనాడు ఉన్న పరిస్థితులను బట్టి ఎంపీగా ఢిల్లీ వెళ్లడమే ఒక అరుదైన ప్రస్థానం. అప్పటి నుంచే మెంటే పద్మనాభం ఎన్టీఆర్‌కు మరింత సాన్నిహిత్యంగా పలు రాజకీయ సూచనలు చేసేవారని చెబుతారు. మెంటేతో ఆరంభమైన రాజకీయ ప్రస్థానం ఇప్పటి వరకు సాగుతూనే ఉంది. మెంటే అనంతరం ఉమ్మడి పశ్చిమలో రాజకీయ వ్యూహకర్త సీనియర్ అనేక పదవులను విజయవంతంగా నిర్వహించిన యర్రా నారాయణస్వామిని టీడీపీ మరోసారి రాజ్యసభకు పంపింది. ఎంపీగా ఆయన 1994 నుంచి 1999 వరకు కొనసాగారు. ఆయన డెల్టా రాజకీయ వ్యవహారాల్లోనే కాకుండా ఉమ్మడి పశ్చిమలో వివాద రహితుడిగా ఉన్న నారాయణస్వామి రాజ్యసభలోనే గళం విప్పారు. తాగు, సాగు, వ్యవసాయం వంటి అం శాలను సభలో ప్రస్తావించారు. టీడీపీ పక్షాన అంశాలను లేవనె త్తడంలో నారాయణ స్వామికి ఒక గుర్తింపు కూడా వచ్చింది
ఇప్పుడు బీజేపీ వంతు
తెలుగుదేశం మాదిరిగానే బీజేపీ కూడా ఉమ్మడి పశ్చిమలో అటు రాజ్యసభ, ఇటు లోక్‌సభ స్థానాల్లోను తమ పార్టీకి చెందిన వారికే ప్రాధాన్యం ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకుంది. నరసాపురం ప్రాంతానికి చెందిన నిర్మలా సీతారామన్‌కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం ఇచ్చింది. ఇప్పుడు మరోమారు భీమవరం పట్టణానికి చెందిన పాకా వెంకట సత్యనారాయణను రాజ్యసభకు ఎంపిక చేయడం ద్వారా కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నరసాపురం నుంచి ఎన్నికైన భూపతిరాజు శ్రీనివాసవర్మను కేంద్రమంత్రిగా తీసుకుని ఈ ప్రాం తంలో బీజేపీకి మరింత ఊపిరి పోసే నిర్ణయం తీసుకుంది. గతంలో కృష్ణంరాజు నరసాపురం నుంచి ఎన్నికై కేంద్రమంత్రిగా రాణించారు.
టీడీపీ నుంచే అత్యధికులు
ఉమ్మడి పశ్చిమ నుంచి రాజ్యసభకు అభ్యర్థులను ఎంపిక చేసి పంపడంలో తెలుగుదేశందే అందెవేసిన చేయి. మెంటే పద్మనాభం వంటి ఉద్దండులకు అవకాశం ఇచ్చినట్లే పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను కీలక సమయంలో మోసిన నారాయణ స్వామి బంధువు భీమవరానికి చెందిన తోట సీతారామలక్ష్మి 2014 – 2020 వరకు రాజ్యసభ సభ్యురాలిగా వ్యవహరించారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు సామాజిక అంశాలతో పాటు ఉమ్మడి పశ్చిమకు ప్రాధాన్యత ఇచ్చేలా సీతారామలక్ష్మిని రాజ్యసభకు ఎంపిక చేయడం విశేషం. సీతారామలక్ష్మి కూడా రాజ్యసభలో పలు అంశాలను ప్రస్తావనకు తీసుకొచ్చారు. ప్రత్యేకించి టీడీపీ ఢిల్లీ వ్యవహారాల్లో ఆమె చురుగ్గా పాలుపంచుకున్నారు. 1980– 2020 వరకు టీడీపీ వీలుచిక్కినప్పుడుల్లా ఉమ్మడి పశ్చిమే రాజ్యసభ కోటా ఇచ్చేలా ప్రయత్నించింది.
అట్టహాసంగా‘పాకా’ నామినేషన్
భీమవరం టౌన్, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): అభిమానుల కేరింతలు.. బాణసంచా కాల్పులు.. తీన్మార్ డప్పుల మోత మధ్య రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయడానికి బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ మంగళవారం అమరా వతి తరలివెళ్లారు. రాజ్యసభ అభ్యర్థిగా ఆయన ఎంపికతో అభిమానులు పెద్ద ఎత్తున నివాసానికి తరలివెళ్లారు. పూలదండలు బొకేలతో అభినందించారు.
అమ్మవారికి పూజలు
పాకా వెంకట సత్య నారాయణ భార్య, కుమార్తెతో కలిసి మంగళ వారం ఉదయం బలుసు మూడి మావుళ్లమ్మ, శ్రీరాంపురం కనకదుర్గ ఆలయంలో నామినేషన్ పత్రాలకు ఆలయ అర్చకులు పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసిన బీజేపీ అధిష్ఠానానికి, కూటమికి కృతజ్ఞతలు తెలిపారు. అక్కడి నుంచి నామినేషన్ వేయడానికి అమరావతి బయలుదేరి వెళ్లారు. పెద్ద సంఖ్యలో అభిమానులు, నాయకులు అమరావతి బయలుదేరారు. ఆయన వెంట బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్, అసెంబ్లీ కన్వీనర్ కాయిత సురేంద్ర, అల్లూరు వెంకటేశ్వ రరాజు, బీసీ సంఘాల నాయకులు నారాయణ, నాగరాజు, వెంకటేశ్వరరావు, పెద్ద సంఖ్యలో ఉన్నారు.
సీఎం చంద్రబాబును కలిసి..
అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును కుటుంబ సభ్యులతో కలిసి పాకా సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యేలు కామి నేని శ్రీనివాసరావు, ఈశ్వరరావు, పార్థసారధి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, నేతలు ఉన్నారు.