చినుకు లోటు..
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:05 AM
సార్వా సీజన్‌లో జిల్లాలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో సరాసరి వర్షపాతం కాస్తా పెరిగినా గత నాలుగు నెలల్లో 12 మండలాల్లో మైనస్ వర్షపాతాలు నమోదు కావడం గమనార్హం. నైరుతి సీజన్‌లో జిల్లాలో 765.9 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతం కాగా 804.9 మిల్లీమీటర్లు వర్షపాతం సరాసరిన నమోదైంది.
కొన్ని ప్రాంతాల్లోనే వర్షం.. మరికొన్ని చోట్ల వర్షాభావం
సార్వా దిగుబడులపై ప్రభావం
రైతుల్లో ఆందోళన
సార్వా సీజన్‌లో జిల్లాలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో సరాసరి వర్షపాతం కాస్తా పెరిగినా గత నాలుగు నెలల్లో 12 మండలాల్లో మైనస్ వర్షపాతాలు నమోదు కావడం గమనార్హం. నైరుతి సీజన్‌లో జిల్లాలో 765.9 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతం కాగా 804.9 మిల్లీమీటర్లు వర్షపాతం సరాసరిన నమోదైంది. అంటే సాధా రణం కన్నా 5.1 శాతం మాత్రమే వర్షాలు అధికంగా కురిసినట్టు జిల్లా ప్రణాళికా శాఖ నివేదికలు చెబుతున్నాయి.
– ఏలూరుసిటీ–ఆంధ్రజ్యోతి
జూన్‌లో సాధారణం కన్నా మించి..
ఈ ఏడాది జూన్‌లో సాధారణ వర్షపాతం 111.9 మిల్లీ మీటర్లు కాగా 182.1 మిల్లీ మీటర్లు (62.8 శాతం అధికంగా) వర్షపాతం నమోదైంది. అయినా ఈనెలలో వేలేరుపాడు మండలంలో మైనస్ 50.4, కుక్కునూరు మండలంలో మైనస్ 56.5, బుట్టాయిగూడెం మైనస్ 0.1, ఆగిరిపల్లి మండలంలో మైనస్ 6.1 శాతం వర్షపాతాలు నమోదయ్యాయి.
జూలైలో మైనస్ 22.4 శాతం
జూలైలో మొదటి నుంచి వర్షాలు పూర్తిగా మందగిం చాయి. ఈ నెలలో సాధారణ వర్షపాతం 242.1 మిల్లీమీటర్లు కాగా 187.9 మి.మీ మాత్రమే అంటే మైనస్ 22.4 శాతం వర్షపాతం నమోదైంది. జిల్లాలో 24 మండలాల్లో సాధారణం కన్నా తక్కువగానే వర్షపాతాలు నమోదయ్యాయి. కుక్కు నూరులో మైనస్ 18.5, టి.నరసాపురం మైనస్ 18.3, జీలుగు మిల్లి మైనస్ 5.4, బుట్టాయిగూడెం మైనస్ 16.6, పోలవరం మైనస్ 30.3, కొయ్యలగూడెం మైనస్ 31.9, జంగారెడ్డిగూడెం మైనస్ 10.4, ద్వారకాతిరుమల మైనస్ 24.2, ఉంగుటూరు మైనస్ 53, భీమడోలు మైనస్ 37.9, పెదపాడు మైనస్ 40.1, ఏలూరురూరల్ మైనస్ 48.2, దెందులూరు మైనస్ 34.4, నిడమర్రు మైనస్ 60.6, మండవల్లి మైనస్ 26.1, కలిదిండి మైనస్ 1.7, ముదినేపల్లి మైనస్ 23.2, ఏలూరు అర్బన్ మైనస్ 51.6, చింతలపూడి మైనస్ 26.1, లింగపాలెం మైనస్ 41.5, చాట్రాయి మైనస్ 19., ముసునూరు మైనస్ 6.1, నూజివీడు మైనస్ 46.9, ఆగిరిపల్లి మైనస్ 3.7 మి.మీ వర్షపాతాలు నమోదయ్యాయి.
ఆగస్టులో 13 మండలాల్లో తక్కువే..
ఆగస్టులో సాధారణంగా 239.4 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతం కాగా 237 మి.మీ వర్షపాతం నమోదు అయింది. మైనస్ ఒక్కశాతం మైనస్ వర్షపాతం సరాసరిగా నమోద యింది. జిల్లాలోని 13 మండలాల్లో సరాసరి కన్నా చాలా తక్కువగా వర్షపాతాలు నమోదయ్యాయి. జీలుగు మిల్లిలో మైనస్ 12 శాతం, బుట్టాయిగూడెం మైనస్ 51.4, కొయ్యల గూడెం మైనస్ 32.6, జంగారెడ్డిగూడెం మైనస్ 58.4, పెద వేగి మైనస్ 3.8, పెదపాడు మైనస్ 51.3, ఏలూరు రూరల్ మైనస్ 41.8, కైకలూరు మైనస్ 16.1, మండవల్లి మైనస్ 32.5, కలిదిండి మైనస్ 25.8, ఏలూరు అర్బన్ మైనస్ 25.3, నూజివీడు మైనస్ 26, ఆగిరిపల్లి మైనస్ 0.8 శాతం వర్షపా తాలు నమోదయ్యాయి.
సెప్టెంబరులో అధికంగానే..
సెప్టెంబరులో బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడడంతో సాధారణ వర్షపాతం 172.5 మిల్లీమీటర్లు కాగా 197.9 మి.మీ వర్షపాతం నమోదైంది. అయినా 9మండలాల్లో మైనస్ వర్షపాతాలు నమోదు కాగా 19 మండలాల్లో సాధా రణం కన్నా మించి వర్షపాతాలు నమోదయ్యాయి. పోల వరంలో మైనస్ 0.9 శాతం, కొయ్యలగూడెం మైనస్ 25 శాతం, కామవరపుకోట మైనస్ 1.7 శాతం, ఏలూరు రూరల్ మైనస్ 42శాతం, నిడమర్రు మైనస్ 18.6 శాతం, మండవల్లి మైనస్ 7.1 శాతం, కైకలూరు మైనస్ 17.5 శాతం, కలిదిండి మైనస్ 1.3శాతం ఏలూరు అర్బన్ మైనస్ 28.1 శాతం వర్షపాతాలు నమోదయ్యాయి.
సార్వా దిగుబడులపై ప్రభావం
జిల్లాలో అంతంత మాత్రంగా కురుస్తున్న వర్షాల వల్ల సార్వా సాగులో రోజురోజుకు గడ్డు పరిస్థితులు ఎదురవు తున్నాయి. సార్వా సాగు ఈసారి ఎలా ఉంటుందో అన్న ఆందోళన రైతులలో కనిపిస్తోంది. జిల్లాలో ఈ ఏడాది 89,983 హెక్టార్లలో సార్వా సాగు జరగాల్సి ఉండగా ఇప్పటివరకు 72,783 హెక్టార్లలో (80.9శాతం ) సార్వా వరి నాట్లు వేశారు. మొక్కజొన్న 637 హెక్టార్లకు 125.63 హెక్టార్లు, పెసలు 72.47 హెక్టార్లు, మినుములు 1065.59 హెక్టార్లు, వేరుశనగ 310.91 హెక్టార్లు, పత్తి 1717.61 హెక్టార్లు, చెరకు 127.44 హెక్టార్లు, పొగాకు 18.74 హెక్టార్లలో సాగు జరుగుతోంది. మిగిలిన పంటల సాగు కూడా జరుగుతోంది. నైరుతి సీజన్‌లో వర్షాభావం ప్రభావం సార్వా దిగుబడులపై ఎక్కువగా కనిపిస్తుందని రైతులు వాపోతున్నారు.
12 మండలాల్లో లోటు వర్షపాతం
జిల్లాలో నైరుతి సీజన్ మొత్తంలో (జూన్, జూలె, ఆగస్టు, సెప్టెంబరు) నాలుగు నెలలు కలిపి జిల్లాలోని 16 మండ లాల్లో సాధారణం కన్నా మించి వర్షపాతాలు నమోదు కాగా 12 మండలాల్లో మైనస్ వర్షపాతాలు నమోద య్యా యి. మొత్తం సాధారణ వర్షపాతం 593.4 మిల్లీమీటర్లు కాగా 607 మి.మీ వర్షపా తం నమోదైంది. ఈ నాలుగు నెలల్లో మొత్తం కలిపితే కేవలం 5.1 శాతం సాధా రణం కన్నా ఎక్కువగా వర్షపాతం నమోదైంది.
విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు
ఏలూరుసిటీ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపఽథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. ఏలూరు, జంగారెడ్డిగూడెం డివిజన్‌లలో అత్యవసర సేవలకు కంట్రోల్‌రూమ్స్ ఏర్పాటు చేసింది. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ పి.సాల్మన్‌రాజు ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. పూర్తి సన్నద్ధతతో వారి హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఏలూరు సర్కిల్ కార్యాలయం , విద్యుత్ భవన్ , ఆర్‌ఆర్‌పేటలో 94409 02926 నెంబర్‌తో, జంగారెడ్డిగూడెం డివిజన్ కార్యాలయంలో 94910 30712 నెంబర్‌తో 24 గంటలు మూడు షిప్టులలో పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. భారీ వర్షాలు, వరదలు కారణంగా విద్యుత్ అంతరాయం లేదా ఇతర సమస్యలు తలెత్తితే ప్రజలు దగ్గరలోని విద్యుత్ సెక్షన్ కార్యాలయానికి , లేదా టోల్‌ఫ్రీ నెంబరు 1912కు, లేదా కంట్రోల్‌రూమ్ నెంబర్లకు సంప్రదించి ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.
భీమడోలులో 17.8 మిల్లీ మీటర్ల వర్షపాతం
జిల్లాలో గత 24 గంటల్లో జిల్లాలోనే అత్యధికంగా భీమడోలు మండలంలో 17.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. జీలుగుమిల్లి మండలంలో 10.2, వేలేరుపాడు మండలంలో 2.4, టి.నరసాపురం మండలంలో 1 మిల్లీ మీటరు వర్షపాతాలు నమోదయ్యాయి. ఆదివారం రాత్రి పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసింది.