చినుకు జాడేది..?
ABN , Publish Date - Jul 15 , 2025 | 12:45 AM
జిల్లాలో మెట్ట ప్రాంతమైన చింతలపూడి సబ్ డివిజన్‌లో వర్షం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.
మెట్ట ప్రాంతంలో ఎండుతున్న నారుమడులు
దుక్కి దున్నినా నీరందక నాట్లు వేయలేదు
బోర్ల కింద విత్తనాలు వెదజల్లిన రైతులు
వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు
చింతలపూడి/లింగపాలెం, జూలై 14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మెట్ట ప్రాంతమైన చింతలపూడి సబ్ డివిజన్‌లో వర్షం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. సుమారు 25 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. ఇప్పటి వరకు వెదజల్లే విధానంలో సుమారు 3,500 ఎకరాలు, నాట్లు, బోర్ల కింద 2,500 ఎకరాల్లో నాట్లు పడ్డాయి. పూర్తిస్థాయిలో నీరందక నారుమ డులు ఎండుతున్నాయి. చెరువుల్లో నీరు లేకపోవడం, గొట్టపు బావుల కింద నాట్లు వేసినా 15 రోజులుగా ఎండ తీవ్రతకు తడులు చాలక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
మెట్ట ప్రాంతంలో వర్షాధార చెరువుల కింద వరి సాగు జరుగుతుంది. గత మే, జూన్‌లో సాధారణ వర్షం పాతం కంటే కొద్ది శాతం ఎక్కువ పడడంతో రైతులు సాగు చేపట్టారు. రెండు నెలల క్రితమే భూములు దుక్కి దున్ని సిద్ధం చేసుకున్నారు. జూలైలో సాధారణ వర్షపాతం 270 మిల్లిమీటర్లు పడాల్సి ఉండగా ఇప్పటి వరకు 50 మిల్లిమీటర్లు కూడా పడలేదు. మధ్యాహ్నం ఎండ, సాయంత్రం ఉక్కబోతతో చినుకు కోసం ఎదురుచూస్తున్నారు. కాంతంపాలెం, రాఘవాపురం, గణిజర్ల, మల్లాయి గూడెం, యండపల్లి ప్రాంతాల్లో వెదజల్లే విధానంతో నాట్లు వేశారు. వారం రోజుల్లో వర్షం పడకపోతే ఈ ప్రాంతంలో వరి ఎండిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతీరోజూ పొలాల వైపు చూస్తూ ఈ రోజైనా వర్షం పడుతుందా అంటూ రైతులు ఎదురు చూస్తున్నారు.
మెట్ట ప్రాంతాలకు గోదావరి జలాలను మళ్లించాలని చింతలపూడి ఎత్తిపోతల పథకం లక్ష్యం. ఫేజ్–1, 2 పనులకు రూ.మూడు వేల కోట్లు ఖర్చు చేసినా రైతులకు ప్రయోజనం లేదని పలువురు వాపోతున్నారు. ఇప్పటికే 20 ఏళ్లు గడిచిందని, ఇంతవరకు కాలువల తవ్వకాలే లేవని, భూములు కోల్పోయామని, గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎండుతున్న చెరువులు
లింగపాలెం మండలంలో చెరువులు ఎండిపోతున్నాయి. బోర్ల ఆధారి త పంటలు తప్ప ఇతర భూముల్లో సాగుపై రైతులలో ఆందోళన నెలకొంది. మేలో కురిసిన వర్షాలకు పత్తి, వరి సాగు చేశారు. వరుణుడు ముఖం చాటేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బోరు బావు లు తప్ప మిగిలిన చోట్ల సాగు చేపట్టలేదు. అక్కడక్కడా నారుమడి వేసి నా నీరందక ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.