లైన్ క్లియర్
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:14 AM
భూసేకరణలో నెలకొన్న అడ్డంకులు తొలగిపో వడంతో కోటిపల్లి–నరసాపురం రైల్వేలైన్ పనులు జోరందుకోనున్నాయి.
కోటిపల్లి–నరసాపురం రైల్వేలైన్ పనులు వేగవంతం
భూసేకరణపై వున్న స్టేను ఎత్తివేసిన హైకోర్టు
వచ్చే ఏడాదికి పూర్తి కావచ్చని రైల్వే అధికారుల అంచనా
(నరసాపురం–ఆంధ్రజ్యోతి):
భూసేకరణలో నెలకొన్న అడ్డంకులు తొలగిపో వడంతో కోటిపల్లి–నరసాపురం రైల్వేలైన్ పనులు జోరందుకోనున్నాయి. కోనసీమ జిల్లాలో భూసేకరణ నిలిపి వేయాలంటూ కొందరు రైతులు న్యాయస్థానా న్ని ఆశ్రయించడంతో ఏడాది కాలంగా పనులు నిలిచిపోయాయి. బుధవారం రాష్ట్ర ఉన్నత న్యాయస్థా నం రీఅలైన్‌మెంట్, భూసేకరణను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై ఉన్న స్టేను ఎత్తివేసి పనులను వేగవంతం చేయాలని ఆదేశించింది. దీంతో ఈ ప్రాజెక్టు పనులు వేగవంతం కానున్నాయి.
నరసాపురం–కోటిపల్లి రైల్వేలైన్ ఉభయగోదావరి జిల్లాలవాసుల చిరకాల కోరిక. ఈ ప్రాజెక్టుకు 2014లో అప్పటి కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రూ.2,200 కోట్ల అంచనాలతో చేపట్టే ఈ ప్రాజెక్టు పనులు 2015లో ప్రారంభించారు. ఐదేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయంలో 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం, మిగిలినది కేంద్రం భరించాలి. 57 కిలోమీటర్ల మేర చేపట్టే ఈ రైల్వేలైన్‌లో వంతెన నిర్మాణాలకే భారీ వ్యయాన్ని వెచ్చించాల్సి వచ్చింది. ఇందులో చించినాడ–దిండి వద్ద వశిష్ఠ గోదావరిపై నిర్మించే వంతెనకు వేయాల్సిన 20 ఫిల్లర్లలో ఇప్పటికే 18 పూర్తయ్యాయి. అతిపెద్ద వంతె న ముక్తేశ్వరం–కోటిపల్లి మధ్య నిర్మిస్తున్నారు. ఇందు లో 43 ఫిల్లర్లు పూర్తయ్యాయి. మూడో వంతెన పాసర్ల పూడి–బోడసకుర్రు మధ్య నిర్మించాల్సిన వంతెనకు 20 ఫిల్లర్లలో 16 పూర్తయ్యాయి. పశ్చిమలో నరసాపురం నుంచి చించినాడ వరకు భూసేకరణ పూర్తయింది. రైతులకు పరిహారం చెల్లించారు. కోనసీమ జిల్లాలో గతంలో ప్రతిపాదించిన ట్రాక్ రూట్‌ను మార్చడంతో కొందరు రైతులు తాము నష్టపోతున్నామంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. భూసేకరణ పనులపై హైకోర్టు స్టే విధించింది. ఈ కారణంగా వంతెన పను లు మినహా మిగిలినవి ముందుకు సాగలేదు. తాజా గా ప్రభుత్వానికి అనుకూలంగా న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో ప్రాజెక్టుకు వున్న అడ్డంకులన్నీ తొలగినట్లే.
వచ్చే ఏడాదికి పూర్తి చేయాలన్న లక్ష్యం
షెడ్యూల్ ప్రకారం 2020లో ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి. కొవిడ్, గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజె క్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా చెల్లించకపో వడం తదితర కారణాల వల్ల పనులు వేగవంతం కాలేదు. ప్రస్తుతం విజయవాడ–రాజమండ్రి మధ్య ట్రాఫిక్ పెరిగింది. మూడోలైన్ నిర్మిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ రూట్‌లో ట్రాఫిక్ మరింత పెరిగినా.. ఇబ్బం దులు లేకుండా కోటిపల్లి రైల్వేలైన్ మీదుగా మళ్లించాలని రైల్వే శాఖ భావిస్తోంది. దీనికి అనుగుణంగా ఈ పనులు పూర్తి చేస్తే నరసా పురం–కోటిపల్లి–సామర్లకోట మీదుగా కొంత ట్రాఫిక్‌ను మళ్లించేందుకు ఛాన్స్ ఉంటుంది. కొత్త రైళ్లను ఈ రూట్‌లో ప్రవేశపెట్టవచ్చు. ఇటు కోనసీమకు కొత్త రైలు మార్గం ఏర్పడనుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలనుకున్నారు. కోర్టు స్టే కారణంగా పనులు పెండింగ్‌లో పడ్డాయి. ప్రస్తుతం క్లియర్ కావడంతో వచ్చే ఏడాది నాటికైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని రైల్వే అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.