భక్తులకు దైవ దర్శనం
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:54 PM
రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వీడడంతో సోమవారం తెల్లవారుజామున చిన్న వెంకన్న ఆలయ ద్వారాలు తెరచుకున్నాయి.
తెల్లవారుజామున వీడిన చంద్ర గ్రహణం
సంప్రోక్షణ అనంతరం తెరుచుకున్న ఆలయాలు
ద్వారకాతిరుమల, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వీడడంతో సోమవారం తెల్లవారుజామున చిన్న వెంకన్న ఆలయ ద్వారాలు తెరచుకున్నాయి. ముందుగా ఆలయ నాలుగు రాజ గోపుర ద్వారాలను తెరచిన సిబ్బంది ఆలయాన్ని, పరిసరాలను, ప్రధాన రాజగోపుర మెట్లదారిని శుభ్రం చేశారు. అంతకు ముందే ఆలయ అర్చకులు శుద్ధి సంప్రోక్షణాధి కార్యక్రమాలు నిర్వహించారు. తరువాత తిరుమంజనాలను నిర్వహించి ఉదయం నుంచి భక్తులకు స్వామివారు, అమ్మవార్ల దర్శనం కల్పించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అన్ని ఆర్జిత సేవలను పునరుద్ధరించారు. శ్రీవారి నిత్యార్జిత కల్యాణంలో భక్తులు పాల్గొని కల్యాణతంతును భక్తిప్రపత్తులతో తిలకించారు.
కిటకిటలాడిన ఆలయాలు
భీమవరం టౌన్: చంద్రగ్రహణం అనంతరం తెల్లవారుజామున ఆలయ సంప్రోక్షణ చేసి ఆలయాలను శుభ్రం చేశారు. మండపాలను, ఆలయం అంతరాయాలను శుద్ధి చేశారు. స్వామి, అమ్మవార్లకు సంప్రోక్షణ అనంతరం అర్చకులు అభిషేకాల అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు. భక్తులు ముందుగా చంద్రగ్రహ దోష నివారణ దానాలను ఇచ్చుకున్నారు. పంచారామ క్షేత్రమైన గునుపూడి సోమేశ్వరస్వామి ఆలయం సోమవారం తెల్లవారుజాము 5 గంటల నుంచి 11 గంటలకు భక్తులతో కిటకిటాలాడింది. దోష నివారణ పూజలతో ఆలయంలోని మండలపాలన్ని రద్దీగా మారిపోయాయి. భక్తులు అధిక సంఖ్యలో రావ డంతో అధికారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. జిల్లాలో మరో పంచారామం పాలకొల్లు క్షీరామలింగేశ్వరస్వామి, ప్రముఖ శివాలయాలైన భీమేశ్వరస్వామి, రామలింగేశ్వరస్వామి, శక్తీశ్వరరస్వామి, ఆచంట రామలింగేశ్వరస్వామి, నత్తారామేశ్వరం రామలింగేశ్వరస్వామి, జుత్తిగ ఉమా వాసుకీ రవి సోమేశ్వరస్వామి ఆలయాలు కిటకిటలాడాయి.