Share News

ఆస్తి పన్ను పెంపుపై సర్వే

ABN , Publish Date - Jul 09 , 2025 | 12:29 AM

మునిసిపాల్టీల్లో 20 శాతం ఆస్తి పన్ను పెంచాలనే లక్ష్యంతో అధికారులు ఇంటింట సర్వే చేపట్టారు.

ఆస్తి పన్ను పెంపుపై సర్వే
తణుకు మునిసిపాల్టీలో ఎంపిక చేసిన అసెస్‌మెంట్‌ను కొలుస్తున్న దృశ్యం

ఆరు పట్టణాల్లో 372 అసెస్‌మెంట్‌ల గుర్తింపు

భీమవరం టౌన్‌, జూలై 8(ఆంధ్రజ్యోతి): మునిసిపాల్టీల్లో 20 శాతం ఆస్తి పన్ను పెంచాలనే లక్ష్యంతో అధికారులు ఇంటింట సర్వే చేపట్టారు. దాని పర్యవేక్షణలో భాగంగా 2021లో క్యాపిటల్‌ విలువ ద్వారా నిర్ణయించిన పన్నుల్లో తగ్గిన అసెస్‌మెంట్‌లలో ర్యాండమ్‌గా గుర్తించి వాటిని ప్రత్యేక బృందాలతో సర్వే చేయిస్తున్నారు. భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, పాలకొల్లు, ఆకివీడు మునిసిపాల్టీలకు ప్రత్యేక బృందాలు 372 ఎస్‌ఎస్‌మెంట్‌ను పరిశీలించి ఈ నెల పదో తేదీలోగా నివేదిక ఇవ్వనున్నారు. వీటిలో భీమవరం 74, తాడేపల్లిగూడెం 116, తణుకు 105, నరసాపురం 6, పాలకొల్లు 13, ఆకివీడు 58 ఎంపిక చేశారు.

పరిశీలించే బృందాలు

తణుకు, నరసాపురం, పాలకొల్లు మునిసిపాల్టీలకు భీమవరం అసిస్టెంట్‌ కమిషనర్‌ రాంబాబు, భీమవరం మునిసిపల్‌ రెవెన్యూ ఆఫీసర్‌ బీవీ రంగారావు, ఆర్‌ఐ శ్రీనివాసరాజు, ఇద్దరు అడ్మిన్‌ సెక్రటరీలు ఉన్నారు.

భీమవరం మునిసిపాల్టీకి పాలకొల్లు కమిషనర్‌ విజయసారధి, రెవెన్యూ ఇనస్పెక్టర్‌ టి.బద్రీనాద్‌, ఇద్దరు అడ్మిన్‌ సెక్రటరీలు.

ఆకివీడుకు నరసాపురం మునిసిపల్‌ కమిషనర్‌ ఎం.అంజయ్య, రెవెన్యూ ఆఫీసర్‌ పి.రవిబాబు, ఆర్‌ఐ ఎస్‌.కృష్ణమోహన్‌, ఇద్దరు రెవెన్యూ ఇనస్పెక్టర్లు.

తాడేపల్లిగూడెం మునిసిపాల్టీకి నిడదవోలు కమిషనర్‌ టీఎల్‌పీఎస్‌ఎస్‌ కృష్ణవేణి, రెవెన్యూ ఆఫీసర్‌ నాగకుమారి, ఆర్‌ఐ సీహెచ్‌ వెంకటేశ్వరరావు, ఇద్దరు అడ్మిన్‌ సెక్రటరీలను నియమించారు.

Updated Date - Jul 09 , 2025 | 12:29 AM