Share News

పంచాయతీలకు పదోన్నతులు

ABN , Publish Date - May 18 , 2025 | 01:32 AM

గ్రామ పంచాయతీలకు పదోన్నతులు లభించనున్నాయి. పంచాయతీల్లో జనాభా, ఆదాయం ప్రాతిపదికన గ్రేడ్‌లు కేటాయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పంచాయతీలకు    పదోన్నతులు

నాలుగు వేల నుంచి పది వేలలోపు జనాభా వుంటే గ్రేడ్‌–1

గ్రేడ్‌లు మార్చేందుకు జిల్లాలో 409 పంచాయతీల వివరాలు పంపాలని ప్రభుత్వం ఆదేశం

భీమవరం రూరల్‌, మే 17(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీలకు పదోన్నతులు లభించనున్నాయి. పంచాయతీల్లో జనాభా, ఆదాయం ప్రాతిపదికన గ్రేడ్‌లు కేటాయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన నిబంధనలు కలిగిన వివరాలు పంచాయతీల వారీగా అందించాలని పంచాయతీరాజ్‌ శాఖను ఆదేశించింది. ఇప్పటి వరకు ఉన్న పంచాయతీలకు ఉన్న గ్రేడ్‌లు మారనున్నాయి. ఇకపై స్పెషల్‌ గ్రేడ్‌ పంచాయతీలుగా నిర్ణయించనున్నారు. అసలు గ్రేడ్‌లు కలిగిన పంచాయతీలుగా 2001లో ఏర్పాటుచేశారు. అప్పట్లోనే ప్రతి పంచాయతీకి కార్యదర్శులను అందుబాటులోకి తెచ్చారు. మరలా ఇప్పుడు పంచాయతీ గ్రేడ్‌లలో మార్పులు రానున్నాయి. జిల్లాలో 409 పంచాయతీలు ఉన్నాయి. వీటి లో 125 పంచాయతీలు గ్రేడ్‌–1గాను, 69 గ్రేడ్‌–2గాను, 49 గ్రేడ్‌–3గాను 50 గ్రేడ్‌–4గాను, 116 పంచాయతీలు గ్రేడ్‌–5గా నడుస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని గ్రామ పంచాయతీల గ్రేడ్‌లలో మార్పులు రాబోతున్నాయి.

వీటికి స్పెషల్‌ గ్రేడ్‌లే

పట్టణానికి ఆనుకుని ఉన్న పంచాయతీలకు మండల ముఖ్య కేంద్రాలుగా వున్న గ్రామాలకు స్పెషల్‌ గ్రేడ్‌లు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో పెనుగొండ, గణపవరం, రాయలం, చిన అమిరం ఇలాంటి గ్రామాలు ఆదాయంలో రూ.కోటి పైబడి జనాభా 10 వేలు పైబడి ఉన్నాయి. దీంతో ఇలాంటి పంచాయతీలు స్పెషల్‌ గ్రేడ్‌లో వెళ్తాయి.

ఇకపై గ్రేడ్‌లు ఇచ్చేదిలా..

గ్రామాల్లో 10 వేలకు పైగా జనాభా ఉన్నా లేదా కోటి రూపాయల ఆదాయం మించి ఉన్నా వాటిని స్పెషల్‌ గ్రేడ్‌ పంచాయతీలుగా పరిగణిస్తారు.

నాలుగు వేల నుంచి 10 వేలలోపు జనాభా ఉన్న గ్రామాలు, లేదా రూ.50 లక్షల పైబడి ఆదాయంవున్న పంచాయతీలను గ్రేడ్‌–1గా నిర్ణయిస్తారు.

రెండు వేల నుంచి నాలుగు వేలలోపు జనాభా ఉన్న పంచాయతీలు గ్రేడ్‌ –2గా ఇస్తారు.

రెండు వేలలోపు జనాభా కలిగిన వాటికి గ్రేడ్‌–3గా కేటాయిస్తారు.

Updated Date - May 18 , 2025 | 01:32 AM