బదిలీలు.. పదోన్నతుల వివాదం
ABN , Publish Date - Jun 05 , 2025 | 12:29 AM
జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఇద్దరు కీలకాధికారుల నిర్వాకం ఏఎన్‌ఎంలు, విలేజ్ హెల్త్ అసిస్టెంట్ల మధ్య వైషమ్యాలకు దారితీసింది.
ఇద్దరు కీలక అధికారుల నిర్వాకం?
వైద్య ఆరోగ్య శాఖలో పరిపాలనా వైఫల్యం
ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టిన అధికారులు
ఏలూరు జిల్లా కార్యాలయం వద్ద ఉద్రిక్తత
8న పదోన్నతులిచ్చేందుకు ప్రతిపాదన
కోర్టును ఆశ్రయించేందుకు యత్నాలు
ఏలూరు అర్బన్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఇద్దరు కీలకాధికారుల నిర్వాకం ఏఎన్‌ఎంలు, విలేజ్ హెల్త్ అసిస్టెంట్ల మధ్య వైషమ్యాలకు దారితీసింది. సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్–3 ఏఎన్‌ఎంలను వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోకి చేర్చి ఎంపీహెచ్‌ఏ(ఫిమేల్) ఉద్యోగులుగా పదోన్నతులి వ్వడానికి సుమారు నెలరోజుల క్రితం ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వ ఆదేశాల అమలులో తాత్సారంతో ఈ పరిస్థితి నెలకొంది. సాధారణ బదిలీలకోసం ఏళ్లతరబడి ఎదురుచూస్తున్న రెగ్యులర్ ఏఎన్‌ఎంలు బదిలీస్థానాల ఎంపికలో నష్టాన్ని అడ్డుకునేందుకు బైఠాయించారు. పదోన్నతి అభ్యర్థుల వాదోపవాదాలతో బుధవారం జిల్లా వైద్యాధికారి కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పదోన్నతి కౌన్సెలింగ్‌కోసం విలేజ్ హెల్త్ సెక్రటరీలు(గ్రేడ్–3 ఏఎన్‌ఎంలు), దానికంటే ముందుగా మార్గదర్శకాలమేరకు బదిలీలు చేపట్టాలని రెగ్యులర్ ఏఎన్‌ఎంల ఆందోళన, ధర్నాలతో హోరెత్తించారు.
కార్యాలయ సిబ్బంది వద్దని వారిస్తున్నా..
ఉమ్మడి జిల్లాలో మొత్తం 256మంది గ్రేడ్–3 ఏఎన్‌ఎంలకు ఎంపీహెచ్‌ఏ (ఫిమేల్) ఉద్యోగులుగా పదోన్నతి ఇవ్వాల్సిఉంది. ఆ మేరకు పొరుగు జిల్లాల్లో ఇప్పటికే కౌన్సెలింగ్ పూర్తయింది. జిల్లాలో కూడా దాదాపు నెలరోజుల క్రితమే అనుమతి వచ్చింది. రోస్టర్ పాయింట్లు సరిచూడడం, తదితర కారణాలతో ఇప్పటివరకు పదోన్నతి ఇవ్వకుండా డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఇద్దరు ప్రధాన అధికారులు తాత్సారం చేశారని సమాచారం. మరోవైపు సాదారణ బదిలీలకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. హఠాత్తుగా పదోన్నతి అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో పలు ఆరోపణలు వచ్చాయి. సాధారణ బదిలీలు పూర్తికాకుండా పదోన్నతులు ఇవ్వడం మార్గ దర్శకాలకు విరుద్ధమని డీఎంహెచ్‌వో కార్యాలయవర్గాలు ఆ ఇద్దరు అధికారులకు నచ్చజెప్పేప్రయత్నంచేసినట్టు తెలుస్తోంది. పదోన్నతి కౌన్సెలింగ్‌పై రాష్ట్ర అధికారి ఒకరిని ఆ ఇద్దరు అదికారులు సంప్ర దించగా, జిల్లాలో ఇబ్బందులు లేకుంటే పదోన్నతి ఇవ్వచ్చని సూచనలు ఇచ్చారు. జిల్లాలోని గ్రేడ్–3 ఏఎన్‌ఎంలకు పదోన్నతి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు మంగళవారం హఠాత్తుగా మెసేజ్‌లు పంపారు. వారిద్దరూ జిల్లా అధికారులు కావడంతో నిబంధనలకు విరుద్ధం అయినా కార్యాలయవర్గాలు పదోన్నతి కౌన్సెలింగ్‌కు బుధవారం ఏర్పాట్లు చేశాయి. మరోవైపు సీనియర్ రెగ్యులర్ ఏఎన్‌ఎంలకు బదిలీలపై ఆ ఇద్దరు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రెండురోజుల క్రితమే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనితో ఇద్దరు కార్యాలయ అధికారులను రెగ్యులర్ ఏఎన్‌ఎంలు కలుసుకున్నారు. తమకు బదిలీలు పూర్తయిన తర్వాతే గ్రేడ్–3 ఏఎన్‌ఎంలకు ఎంపీహెచ్‌ఏ (ఫిమేల్)గా పదోన్నతులు ఇవ్వాలని అభ్యర్థించినా అరణ్యరోదనే అయింది. గ్రేడ్–3 ఏఎన్‌ఎంలు పదోన్నతి కౌన్సెలింగ్ నిమిత్తం చేరుకున్నారు. తమకు బదిలీలు పూర్తయిన తర్వాతే వారికి పదోన్నతులు ఇవ్వాలని రెగ్యులర్ ఏఎన్‌ఎంలు కూడా డీఎంహెచ్‌వో కార్యాలయా నికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎవరి డిమాండ్లపై వారు ఆందోళనకు దిగడంతో రాత్రి 10 గంటలు దాటినా ఉద్రిక్తత కొనసాగింది. ఈ విషయంకాస్తా జిల్లా కలెక్టర్ దృష్టికివెళ్లడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏలూరు ఆర్డీవో వైద్యాధికారి కార్యాలయానికి చేరుకున్నారు. తమకు పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించే వరకు కార్యాలయ ప్రాంగణాన్ని వీడేదిలేదని గ్రేడ్–3 ఏఎన్‌ఎంలు తేల్చిచెప్పడంతో వివాదం తారస్థాయికి చేరింది.
ఏలూరు ఆర్డీవో, డీఎంహెచ్‌వో, ఏవోల సమక్షంలో బుదవారం రాత్రి చర్చలు జరిగిన నేపథ్యంలో గ్రేడ్–3 ఏఎన్‌ఎంలకు పదోన్నతులు ఈ నెల 8న నిర్వహించేలా అధికారులు ప్రతిపాదన చేశారు. దీనిపై రాత్రి వరకు ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరోవైపు మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుగా సాధారణ బదిలీలు నిర్వహించిన తర్వాతే పదోన్నతులు చేపట్టాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అదికారులను ఆదేశించాలని అభ్యర్థిస్తూ రెగ్యులర్ ఏఎన్‌ఎంలు గురువారం న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి యోచిస్తున్నట్టు సమాచారం.