Share News

పండు‘గొప్ప’

ABN , Publish Date - Jul 14 , 2025 | 12:10 AM

పండుగప్ప... ఎట్టకేలకు మార్కెట్‌ ధర పెరిగింది. ప్రస్తుతం 4 కిలోల చేప కిలో ధర రూ.430 ఉంది.

పండు‘గొప్ప’

ఆక్వా రైతులకు సిరుల పంట

సముద్ర తీరంలో వెయ్యి ఎకరాల్లో సాగు

హౌరా మార్కెట్‌కు ఎగుమతి

4 కిలోల చేప కిలోకు రూ.430

పండుగప్ప... ఎట్టకేలకు మార్కెట్‌ ధర పెరిగింది. ప్రస్తుతం 4 కిలోల చేప కిలో ధర రూ.430 ఉంది. 15రోజులుగా కిలో ధర రూ.370 నుంచి రూ.430 వరకు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ధర ఎంతకాలం ఉంటుందోనని భయం వారిని వెన్నాడుతోంది. పశ్చిమ గోదావరి, మచిలీపట్నం సముద్ర తీర ప్రాంతంలో వెయ్యి ఎకరాల్లో పండు గప్ప సాగు చేస్తున్నారు. ఇక్కడి నుంచి హౌరా మార్కెట్‌కు ఎగుమతి అవుతోంది. ఇదే ధర కొన్ని రోజులు కొనసాగితే రైతుకు లాభాల పంటే..

ఆకివీడు రూరల్‌, జూలై 13(ఆంధ్రజ్యోతి): ఆక్వా సాగులో పండుగప్ప రైతులకు సిరులు కురిపిస్తోంది. మార్కెట్‌లో ప్రస్తుత ధర లాభదాయకంగా ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా రైతులు కట్లా, రోహూ (శీలావతి), గడ్డిచేప, మోసు వంటి రకాలు ఎక్కువగా చేస్తారు. కొంతమంది రైతులు పండుగొప్ప సాగు చేపట్టారు. దీనినే పండు చేప అని పిలుస్తారు. ఇది మాంసాహార చేప, బతికున్న, చనిపోయిన చేపలు, కప్పలు, జీవాలను తిని పెరుగుతుంది. మంచినీరు, ఉప్పునీరులో జీవించే పండు చేప ఏరు, సముద్రంలో ఉంటుంది. ప్రస్తుతం సముద్ర తీర ప్రాంతంలో చెరువులో సాగు చేస్తున్నారు. పశ్చిమగోదావరి, మచిలీ పట్నం సముద్ర తీరప్రాంత గ్రామాలలో సుమారు వెయ్యి ఎకరా లలో సాగవుతోంది. సాగుకు 14 నుంచి 15 నెలలు సమయం పడుతుంది. సరాసరి 4కిలోల వచ్చే వరకు చేపను పెంచుతారు. టన్ను చేప ఉత్పత్తికి 7టన్నుల మేత ఖర్చు అవుతుంది.

ధర ఆశాజనకం

ప్రస్తుతం 4కిలోల చేప కిలో ధర రూ.430 ఉంది. 15రోజులుగా కిలో ధర రూ.370 నుంచి రూ.430 వరకు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ధర ఎంతకాలం ఉంటుందోనని భయం వారిని వెన్నాడుతోంది. ప్రస్తుత ధర స్థిరంగా ఉంటే రైతు లు ఊరట చెందుతారని చెబుతున్నారు. రెండేళ్ల మార్కెట్‌ను పరిశీ లిస్తే ప్రస్తుతం ఉన్న ధర గరిష్ఠ ధర అని రైతులు చెబుతున్నారు. హౌరా మార్కెట్‌ పండు చేపకు మంచి మార్కెట్‌. నరసాపురం, లోసరి, బందరు ప్రాంతాలలో కొనుగోలు చేసి బెంగాల్‌ ఎగుమతి చేస్తున్నారు. కేరళ, ఉత్తరప్రదేశ్‌కు కిలో సైజు చేపలు ఎగుమతి అవుతున్నాయి. కిలో బరువున్న చేపలకు 8 నుంచి 10 నెలలు సమయం పడుతుంది, ధరతో పోలిస్తే 4కిలోల చేపకు మధ్య వ్యత్యాసం రూ. 50 వరకు ఉంటుంది. 2కిలోల తరువాతే చేప వేగంగా పెరుగుతుంది. దీనితో రైతు సరాసరి 4కిలోల వరకు చేపలను పెంచుతారు.

నాణ్యమైన సీడ్‌ కీలకం

పండుగప్ప సాగుకు నాణ్యమైన సీడ్‌ కీలకం. ముత్యాలపల్లిలో హేచరీ ద్వారా సీడ్‌ ఉత్పత్తి అవుతున్నది. చెరువులో సాగు చెయ్యడానికి 80 గ్రాములు పిల్ల నుంచి 100 గ్రాములు పిల్లను ఎంచుకుంటారు. పిల్ల బరువును బట్టి ధర రూ.100 – 120 పలుకుతుంది. చెరువు లోతును బట్టి ఎకరాకు 2 వేల నుంచి 4వేల పిల్లలను వేస్తున్నారు.

మేతలో జాగ్రత్తలు తీసుకోవాలి

ప్రస్తుతం పండుగప్ప చేపకు గొరక, సముద్రం చేపలు మాత్రమే ఆహారంగా ఉపయోగిస్తున్నారు. మార్కెట్‌లో లభించే చైనా గొరక, లేదా సముద్రం చేపలను కొనుగోలు చేసి వాటిని ముక్కలుగా చేసి ఆహారంగా ఇస్తున్నారు. టన్ను చేప దిగుబడికి 7టన్నుల గొరక లేదా సముద్రం చేప ఆహారంగా అందించాలి. గొరక కిలో రూ.32 నుంచి రూ.35 వరకు ధర పలుకుతున్నది. వీటిని ప్రాసెసింగ్‌ చేసి ఆహారంగా వేస్తారు. పండుగొప్ప చేప సాగులో మార్కెట్‌ ధరలో మార్పులు మినహా ఇతర నష్టాలు ఉండవు. పెట్టుబడికి ఢోకా ఉండదు. ఎకరాకు వేసిన పిల్లలను బట్టి దిగుబడి టన్నేజీ ఉంటుంది. సాధారణంగా 4కిలోలు దాటిన తరువాతే చేపలను పట్టడం జరుగుతుంది. దీంతో 2 వేలు పిల్ల వేస్తే ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడి వస్తుంది. చెరువు లోతును బట్టి పిల్ల వెయ్యడం, దిగుబడి హెచ్చు తగ్గులుంటాయి.

ప్రతికూలతలూ ఉన్నాయి..

కొంతమంది ఖర్చు తగ్గించుకోవడానికి పండుగొప్పకు రొయ్యల తలకాయ మేతగా ఉయోగిస్తున్నారు. దీనితో చేప నాణ్యత తగ్గుతుందని, దూర ప్రాంతం వెళ్లిన చేప రంగు మారిపోతుందని రైతులు చెబుతున్నారు. అంతే కాకుండా శంఖుజలగ వ్యాధి వ్యాపించి మార్కెట్‌ పడిపోతుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, రొయ్యల తలకాయల అక్రమ రవాణా, కొంతమంది అవగాహన లేని రైతులతో పండు చేప సాగుకు ముప్పు వాటిల్లుతోంది. అధికారులు నిఘా పెట్టి నాణ్యమైన మేతను మాత్రమే ఉపయోగించి సాగు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

పెట్టుబడి గ్యారంటీ

పండు చేపకు ప్రస్తుత ధర రైతులకు లాభదాయకం. 15రోజులు క్రితం రూ.370 వున్న ధర ప్రస్తుతం 430 రూపాయలకు పెరిగింది. రెండేళ్ల నుంచి అనేక ఇబ్బందులు పడ్డాం. ప్రస్తుత ధర నిలబడితో తేరుకుంటాం. 15 ఏళ్లుగా పండు చేప సాగు చేస్తున్నాను. ఎకరంతో సాగు ప్రారంభించి 15 ఎకరాల వరకు సాగు చేస్తున్నాను. పెట్టుబడికి గ్యారంటీ, ఖర్చులు లభిస్తాయి.

వీరబాబు పండుచేప రైతు

Updated Date - Jul 14 , 2025 | 12:10 AM