అప్పుల తిప్పలు
ABN , Publish Date - Aug 25 , 2025 | 01:12 AM
ఇంజనీరింగ్ కళాశాలలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకుపోతున్నాయి. బటన్ నొక్కి సొమ్ములు చెల్లించేశామంటూ గత వైసీపీ ప్రభుత్వం కళాశాలలను మోసం చేసింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఎదురుచూపులు
వైసీపీ హయాంలో మూడు విడతలు పెండింగ్
కూటమి రాకతో ఒకటి మంజూరు
మరో మూడు విడతల బకాయిలు
జిల్లాలో రూ. 175 కోట్లు పెండింగ్
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ఇంజనీరింగ్ కళాశాలలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకుపోతున్నాయి. బటన్ నొక్కి సొమ్ములు చెల్లించేశామంటూ గత వైసీపీ ప్రభుత్వం కళాశాలలను మోసం చేసింది. మూడు విడతల సొమ్మును చెల్లించకుండా బకాయి పెట్టింది. అప్పట్లో తల్లుల ఖాతాలకు సొమ్ములు జమ చేసేవారు. ఫీజులపైనా నియంత్రణ పెట్టి ఆర్థిక సంక్షోభంలోకి కళాశాలలను నెట్టేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత విధానాన్నే తెరపైకి తెచ్చారు. కళాశాలల ఖాతాలకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా ఒక్క విడత మాత్రమే నిధులు విడుదల చేసింది. మరో మూడు విడతల ఫీజు రీయిం బర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టింది. మొత్తంపైన ఆరు విడతల బకాయిలు విడుదల కాకపోవడంతో ఇంజనీరింగ్ కళాశాలలు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాయి.
ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు
కళాశాలల నిర్వహణ కోసం ఆస్తులను తాకట్టు పెడుతున్నారు. అప్పులు తీసుకొస్తున్నారు. వేతనాలు ఇస్తున్నారు. తిరిగి వాయిదాలు చెల్లించడానికి ఆపసోపాలు పడుతున్నారు. బ్యాంకుల వాయిదాలు చెల్లించడానికి సిబ్బందికి చెల్లించాల్సిన వేతనాలను నిలిపివేసే దుస్థితి దాపురించింది. ప్రతీఏటా వేతనాలు పెంచే పరిస్థితి ఉండేది. ప్రభుత్వం నుంచి సకాలంలో బకాయిలు విడుదల కాకపోవడంతో సిబ్బందికి వేతనాలు పెంపునకు కళా శాలలు సాహసించ లేకపోతు న్నాయి. తాడేపల్లిగూడెం ఓ ఇంజనీరింగ్ కళాశాలకు ప్రభుత్వం నుంచి రూ. 27 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. భీమవరంలో మరో కళాశాలకు రూ. 50 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా రూ.150 కోట్లు మేర ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజు రీయింబర్స్ మెంట్ జమచేయాలి. గత ప్రభుత్వంలో తల్లుల ఖాతాలో సొమ్ములు జమ చేసేవారు. దాంతో విద్య పూర్తిచేసుకుని బయటకు వెళ్లిన విద్యార్థులు ఫీజులు చెల్లించేశారు. వారంతా ప్రభుత్వం బకాయి చెల్లిస్తుందని ఎదురు చూస్తున్నారు. విద్యార్థులు ఫీజు చెల్లించనట్టయితే కళాశాలల ఖాతాలోనే జమ చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా పరిశీలన పూర్తయింది. నివేదికలను సిద్ధం చేశారు. బకాయిల కోసం కళాశాలలు ఎదురుచూస్తున్నాయి.
ఫీజుల పెంపుపై ఆశలు
ఫీజు నిర్ధారణలో వైసీపీ ప్రభుత్వం కొన్ని కళాశాలలపై కక్ష సాధింపులకు పాల్పడింది. కోర్టులను ఆశ్రయిస్తారన్ని ఫీజుల్లో కోత పెట్టింది. తాడేపల్లిగూడెంలో ఓ కళాశాల నాక్ ఎప్లస్ గుర్తింపు పొందింది. అదే కళాశాలకు రూ. 90 వేల ఫీజును గత ప్రభుత్వం రూ. 43 వేలకు కుదించింది. ఇలాంటి కళాశాలలు జిల్లాలో ఇంకా ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగు తుందని ఆశిస్తున్నారు. అయితే ఫీజు నిర్ధారణ కమిటీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం కొత్త కమిటీ వేసేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటిదాకా ఉన్న కమిటీ కాల పరిమితి సెప్టెంబ రుతో ముగుస్తుంది. ఆ తర్వాత కొత్త కమిటీ వేయనున్నారు. అప్పుడైనా న్యాయం జరుగుత ుందన్న ఆశతో కళాశాలలున్నాయి. అప్పటిదాకా ఉన్న బకాయిల్లో కొద్దిపాటి అయినా విడుదల చేస్తే కొంతమేర ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుందని యాజమాన్యాలు ఆశిస్తున్నాయి.