Share News

భ..స్టాండ్‌!

ABN , Publish Date - Jun 01 , 2025 | 12:10 AM

బస్టాండ్‌.. ఆటో స్టాండ్‌.. టాక్సీ స్టాండ్‌.. రిక్షా స్టాండ్‌.. ఇవన్నీ ఆయా వాహనాలు నిలిపిఉంచే ప్రాంతాలు. కానీ బస్టాండ్‌ మాత్రం దీనికి విరుద్ధం. ఇక్కడ బస్సు నిలిపి ఉంచే ప్రదేశంలో బస్సు బదులు ప్రయాణికులు నిలిచి ఉండే ప్రదేశం అని అర్థం చేసుకోవాలి.

భ..స్టాండ్‌!
ఏలూరు పాత బస్టాండ్‌లో బస్సుల కోసం నిలువు కాళ్లపై వేచిచూస్తున్న ప్రయాణికులు

బస్‌ స్టేషన్‌, షెల్టర్లలో ప్రయాణికులకు తప్పని తిప్పలు

బస్టాండ్‌.. ఆటో స్టాండ్‌.. టాక్సీ స్టాండ్‌.. రిక్షా స్టాండ్‌.. ఇవన్నీ ఆయా వాహనాలు నిలిపిఉంచే ప్రాంతాలు. కానీ బస్టాండ్‌ మాత్రం దీనికి విరుద్ధం. ఇక్కడ బస్సు నిలిపి ఉంచే ప్రదేశంలో బస్సు బదులు ప్రయాణికులు నిలిచి ఉండే ప్రదేశం అని అర్థం చేసుకోవాలి. బస్టాండ్‌ లేదా షెల్టర్‌ ఉన్నా లేకున్నా ప్రయాణికులు నిలబడి ఉండాల్సిందే. జిల్లాలో అనేక చోట్ల బస్సు ఎక్కడానికి రోడ్డుపైనా.. దుకాణాల చెంత నిలబడి ఉండాలి. పేరుకు షెల్టర్లు ఉన్నా సౌకర్యాలు ఉండవు. కూర్చునే బెంచ్‌లు ఉండవు.. తాగునీరు దొరకదు.. మరుగుదొడ్లు నిర్వహణ లేక దుర్వాసన వెదజల్లుతున్నాయి. బస్టాండ్‌లో బిస్కెట్‌, కూల్‌ డ్రింక్‌ ఏదైనా కొనాలంటే దాదాపు రెట్టింపు ధర చెల్లించుకోవాలి.

(ఏలూరు, ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

ఒకప్పటి రోడ్డు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ (ఆర్‌టీసీ) ఎలా ఉండేది.. పర్యవేక్షణ.. అలక్ష్యం వహిస్తే తీవ్ర పరిణామాలు ఉండేవి.. కానీ బస్సులు, బస్టాండ్‌, షెల్టర్ల నిర్వహణ అధ్వానమే. ఇపుడు పేరు మారినా పాత పోకడ పోలేదు. ఉమ్మడి జిల్లాలో అనేక బస్టాండ్‌లు వర్షం వస్తే నీట మునుగుతాయి. మరికొన్నింటిలో నిర్వహణ లోపాలు కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నాయి. బస్టాండ్‌లో ప్రయాణికులు నిలువు కాళ్లపై నిలబడి ఉండాల్సిందే. నిత్య పర్యవేక్షణకు తగినంత సిబ్బంది ఉన్నా కొన్ని సమయాల్లో మాత్రం అంతా గాలికి వదిలి వేస్తున్నారు. రానున్నది వర్షాకాలం. బస్టాండ్‌ ఆవరణలో డ్రెయినేజీ వ్యవస్థను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏలూరు బస్టాండ్‌ వద్ద నుంచి దాదాపు అన్ని ప్రధాన బస్టాండ్‌లలో సమస్యలు తిష్ట వేశాయి. బస్‌ షెల్టర్ల పరిస్థితి మరింత అధ్వానం. ఎంపీ కోటాలో నిర్మించిన షెల్టర్లు, దాతల సహకారంతో నిర్మించిన షెల్టర్లన గాలికొదిలేశారు. షెల్టర్లు ఉన్న ప్రాంతంలో బస్సులు నిలపడం మానేశారు. పలు చోట్ల నిరుపయోగంగా ఉంటే మరికొన్ని చోట్ల అసాంఘిక కార్యకలాపాలకు ఆవాసాలుగా ఉన్నాయి. బస్టాండ్‌లు, బస్‌ సెల్టర్‌లు పై ఆంధ్రజ్యోతి బృందం చేసిన పరిశీలన ఇది.

ఏలూరు నగరంలో నిలువ నీడ లేదు

ఏలూరు క్రైం: ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైనా ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపడలేదు. జిల్లా కేంద్రమైన ఏలూరు లో బస్టాండ్‌ల పరిస్థితి అధ్వానం. బస్టాండ్‌లో వ్యాపారులు ఎంఆర్‌పి కంటే రూ.5 నుంచి రూ.20 అదనపు ధరలు వసూలు చేస్తున్నారని ప్రయా ణికులు వాపోతున్నారు. పాత బస్టాండ్‌లో కూర్చోడానికి బెంచీలు, సిమెం టు బల్లలు లేవు. రాత్రి వేళ లైట్లు వెలగడం లేదు. గతంలో డీఎస్పీ డి శ్రావణ్‌కుమార్‌ పాత బస్టాండ్‌ను పరిశీలించి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని తెల్లవార్లు విద్యుత్‌ లైట్లు వెలుగుతూ ఉండాలని ఆదేశించినా పట్టించుకునే వారే లేరు. వాష్‌రూమ్‌ల నిర్వహణ అధ్వానం. కొత్త బస్టాండ్‌లో పంపులకు నీళ్లు కూడా రావడం లేదు. తంగెళ్లమూడి, కండ్రికగూడెం సెంటర్‌, వసంతమహల్‌, ఫైర్‌స్టేషన్‌, సత్రంపాడు, వట్లూ రు, గూడ్స్‌షెడ్‌ రోడ్డులోని రైల్వే స్టేషన్‌ వంటి ప్రాంతాల్లో నిత్యం ఆర్టీసీ బస్సులు ఆగి ప్రయాణికులను ఎక్కించుకుంటూ ఉంటాయి. ఎక్కడా బస్‌ షెల్టర్లు లేవు. ప్రయాణికులు బస్సు కోసం రోడ్డుపై దుకాణాల వద్ద వేచి ఉండాల్సిందే. వర్షాకాలం ప్రయాణికులకు మరిన్ని కష్టాలు తప్పవు.

కొత్త బస్టాండ్‌లో విజయవాడ నాన్‌స్టాప్‌ బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులను వ్యాపారులు అడ్డగోలుగా దోచేస్తున్నారు. బస్సులో ప్రయా ణికులు షాపుల్లో ఏమి కొన్నా రూ.10 అదనం. అధికారులు కనపడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కలెక్టర్‌ వెట్రిసెల్వి బస్‌స్టాండ్‌ను పరిశీలించి హెచ్చరికలు జారీ చేసినా పరిస్థితిలో మార్పు లేదు.

జంగారెడ్డిగూడెం బస్టాండ్‌లో సౌకర్యాలు లేవు

జంగారెడ్డిగూడెం: ఏజెన్సీ ముఖ ద్వారమైన జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్‌లో మౌలిక వసతులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్‌లో కనీసం తాగునీటి సదుపాయం కల్పించలేదు. కొంత కాలం క్రితం దాత మంచినీటి ఫిల్టర్‌ అందజేసినా వినియోగించక పోవడంతో తిరిగి తీసుకుపోయారు. బస్టాండులో మరుగు దొడ్లను ఉపయోగించాలంటే ప్రయాణికులు రూ.10 చెల్లించాలి. ఉచితంగా ఉపయోగించుకునే మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. దీంతో పలువురు బస్టాండ్‌ ప్రాంగణంలో మూత్ర విసర్జన చేస్తున్నారు.

బస్టాండ్‌లో వ్యాపారులు తినుబండారాలు అధిక ధరలకు విక్రయిస్తు న్నారు. నాసిరకం కూల్‌ డ్రింక్స్‌, గడువు ముగిసిన తినుబండారాలు అమ్ముతున్నా పట్టించుకునే వారే లేదు. సైకిల్‌ స్టాండు వద్ద నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు అద్దె వసూలు చేస్తున్నారు.

నిరుపయోగంగా మారిన బస్‌ షెల్టర్లు

పాత బస్టాండులో చిరంజీవి యువత ఏర్పాటు చేసిన బస్‌షెల్టర్‌ నిరుపయెగంగా మారింది. లోపలి భాగం కుంగిపోవడంతో ప్రయాణికులు రోడ్డుపై వేచి ఉంటున్నారు. గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో సినీ నిర్మాత డి.రామానాయుడు చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్మించిన బస్‌ షెల్టర్‌ నిరుపయోగంగా మారింది. బస్‌ షెల్టర్లను వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jun 01 , 2025 | 12:10 AM