Share News

సక్రమమా?.. అక్రమమా ?

ABN , Publish Date - Aug 29 , 2025 | 12:33 AM

పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణాకు నూజివీడు కేంద్రంగా మారుతోంది. గతంలో పీడీఎస్‌ బియ్యం గ్రామాల్లోని మారుమూల ప్రాంతాల్లో పాడుపడిన ఇళ్లను అద్దెకు తీసుకుని రహస్యంగా రాత్రి వేళ నిల్వ చేయడం ఎగుమతి చేయడం లేదా బియ్యాన్ని రవ్వగా మార్చేవారు.

సక్రమమా?.. అక్రమమా ?
శోభనాపురంలో ప్రైవేట్‌ గొడౌన్‌ను పరిశీలిస్తున్న అధికారులు

శోభనాపురంలో భారీ ప్రైవేట్‌ గొడౌన్లు

అనుమతులపై పెదవి విప్పని అధికారులు

రేషన్‌ బియ్యం అక్రమ రవాణా కోసమే రూ.కోటితో రైస్‌మిల్లు?

దృష్టి సారించిన సబ్‌ కలెక్టర్‌ వినూత్న

అక్రమ అధికారుల్లో టెన్షన్‌

(నూజివీడు–ఆంధ్రజ్యోతి)

పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణాకు నూజివీడు కేంద్రంగా మారుతోంది. గతంలో పీడీఎస్‌ బియ్యం గ్రామాల్లోని మారుమూల ప్రాంతాల్లో పాడుపడిన ఇళ్లను అద్దెకు తీసుకుని రహస్యంగా రాత్రి వేళ నిల్వ చేయడం ఎగుమతి చేయడం లేదా బియ్యాన్ని రవ్వగా మార్చేవారు. ఇప్పుడు ఆ స్థితి నుంచి నియోజక వర్గంలోనే మామిడి తోటల్లో భారీగా పౌరసరఫరాల శాఖ గిడ్డంగుల్లాగా, బియ్యం అక్రమ రవాణా దారులు సొంత గొడౌన్‌లను నిర్మించుకోవడం విశేషం. గత గురువారం ఆగిరిపల్లి మండలం శోభనాపురం పరిధి లో మామిడితోట మధ్యలో భారీ స్థాయిలో నిర్మించిన గొడౌన్లపై పౌరసరఫరాలు, రెవెన్యూ శాఖ అధికారులు దాడిచేసి నూతనంగా నిర్మించిన ఈ గొడౌన్‌లను చూసి నోరెళ్లబెట్టారు. రెండు గొడౌన్లు నిర్మితమై ఉన్నా యి. ఒక్కొక్క దానిలో వంద లారీల సరుకు పట్టేంత భారీస్థాయిలో ఉన్నాయి. చుట్టుపక్కల మండలాల నుంచి పీడీఎస్‌ బియ్యాన్ని కొనుగోలు చేసిన అక్రమ బియ్యం వ్యాపారులు ఆ బియ్యాన్ని ఈ గొడౌన్లకు చేరుస్తారు. రెండు, మూడు లారీల లోడు రాగానే బియ్యాన్ని రాత్రి వేళ తరలిస్తారు. ఇలా ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీలోపు జరుగుతాయి. ఒక బ్యాచ్‌ ఈ గొడౌన్‌లను నిర్వహిస్తుండగా, చాట్రాయి మండలంలోని ఒక వ్యక్తితో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో పీడీఎస్‌ డాన్‌గా ప్రసిద్ధి గాంచిన ఉయ్యూరు ప్రాంతా నికి చెందిన ఒక అక్రమ బియ్యం వ్యాపారి కలిసి చాట్రాయికి సమీపంలోని విస్సన్నపేట–మైలవరం మధ్య కోటి రూపాయల వ్యయంతో రైస్‌ మిల్లును ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ అక్రమ పీడీఎస్‌ బియ్యాన్ని కవరింగ్‌ చేయడానికే ఆ మిల్లును ఏర్పాటు చేసినట్టు సమాచారం. వీరు పోలవరం, చింతలపూడి నియోజక వర్గాల్లోని అనేక గ్రామాల నుంచి రేషన్‌ బియ్యాన్ని సేకరిస్తారని తెలుస్తోంది. ఇటు నూజివీడు నియోజక వర్గంలో పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా కు పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. ఈ విధంగా చేయడానికి అధికార యంత్రాంగంలోని కొందరు అధికారులు, ఇతర పెద్దలు సహకారం లేకుండా చేయడం అసాధ్యమనే గుసగుసలు విన్పిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత బహిరంగంగా అక్రమ బియ్యం వ్యాపారానికి తెగబడడం నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది. 2వ తేదీ నాటికే అనేక గ్రామాల్లో రేషన్‌ షాపుల వద్ద బియ్యం అయిపోయాయని సమాధానం వస్తున్నట్టు పలువురు కార్డుదారులు పేర్కొంటున్నారు.

తనిఖీలు సరే.. అనుమతుల ఊసేది

మామిడి తోటల్లో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను ప్రస్తావిస్తూ ‘ఆంధ్రజ్యోతి’లో ఈనెల 21వ తేదీన ‘మామిడి తోటలో.. రేషన్‌ బియ్యం దందా!’ శీర్షికన ప్రచురితమైన కథనం సంచలనం రేపింది. దీంతో గత గురువారం నూజివీడు పౌరసరఫరాల డీడీతో పాటు ఏలూరు, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని ఇతర పౌర సరఫరాల శాఖ అధికారులు బృందంగా ఏర్పడి ఆగిరిపల్లి మండలంలో వరుస తనిఖీలను నిర్వహించారు. శోభనాపురం పరిధిలోని మామిడితోటలో పౌరసరఫరాల శాఖ గొడౌన్‌ను మించి దాదాపు వంద లారీలకు పైబడి (10 వేల నుంచి 20 వేల టన్నుల) సామర్ధ్యం గల ప్రైవేట్‌ గొడౌన్లు దర్శనమిచ్చాయి. అయితే అధికారులు అక్కడ ఎటువంటి బియ్యం నిల్వలు లేవని తేల్చారే కాని, సీఆర్‌డీఏ పరిధిలోని శోభనాపురంలో నిర్మించిన ఈ గొడౌన్‌లకు అనుమతులు ఉన్నాయా? అను మతులు తీసుకుంటే ఏ పంట నిల్వలు ఉంచేందుకు.. లేదా ? వాణిజ్య అవసరాలకు తీసుకున్నారా ? అనే అంశాలను వారు పరిగణలోకి తీసుకోలేదు. మరోవైపు అసలు ఈ గొడౌన్‌లు ఎవరి పేరున నిర్మా ణం అయ్యాయి? అనేది సైతం తెలుసుకోకుండానే కొండను తవ్వి ఎలుకను పట్టామన్న చందంగా వెనుతిరిగారు. జిల్లాస్థాయి అధికార యంత్రాంగం ఇటీవల కాలంలో వెలసిన ఇటువంటి గోడౌన్‌లను పరిశీలిస్తే మరిన్ని అక్రమ నిల్వలు బయటపడే అవకాశం ఉంది. ఆంధ్రజ్యోతి కథనం నేపధ్యంలో ఏడాదిన్నరగా సాగుతున్న రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై నియోజకవర్గంలో చర్చ సాగుతోంది.

సబ్‌ కలెక్టర్‌ దృష్టి సారింపు

నూజివీడు నియోజకవర్గ కేంద్రంగా బియ్యం అక్రమ రవాణాపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం నేపథ్యంలో నూజివీడు సబ్‌ కలెక్టర్‌గా తొలిసారి బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్‌ అధికారిణి వినూత్న తక్షణం దాడులను నిర్వహించాలని ఆదేశిస్తూ పౌరసరఫరాల శాఖనే కాక రెవెన్యూ అధికారులను బృందంలో చేర్చడంతో బియ్యం అక్రమ రవాణాకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న కొంత మంది అధికారుల్లో అంతర్మథనం ప్రారంభమైంది. ఇదేరీతిన మున్ముందు దాడులను నిర్వహిస్తే బియ్యం అక్రమ రవాణాకు పూర్తిగా తెరపడినట్లే.

Updated Date - Aug 29 , 2025 | 12:33 AM