ప్రైవేటు బస్సులపై నిఘా
ABN , Publish Date - Oct 26 , 2025 | 12:50 AM
కర్నూలులో వేమూరి కావేరి బస్సు అగ్నిప్రమాదానికి గురైన సంఘటన నేపథ్యంలో రవాణాశాఖ అధికారులు అప్రమత్తమై ప్రైవేటు ట్రావెల్ బస్సులపై కొరడా ఝుళిపిం చారు.
జంగారెడ్డిగూడెం, కలపర్రులో రవాణాశాఖ తనిఖీలు
55 బస్సు నిర్వాహకులపై కేసు.. మూడు బస్సులు సీజ్
రూ. 2.80 లక్షల జరిమానా
ఏలూరు క్రైం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): కర్నూలులో వేమూరి కావేరి బస్సు అగ్నిప్రమాదానికి గురైన సంఘటన నేపథ్యంలో రవాణాశాఖ అధికారులు అప్రమత్తమై ప్రైవేటు ట్రావెల్ బస్సులపై కొరడా ఝుళిపించారు. ఏలూరు జిల్లా ఉప రవాణా కమిషనర్ షేక్ కరీమ్ ఆదేశాల మేరకు ఆర్టీవోలు ఎస్‌బి శేఖర్, ఎస్‌ఎస్ రంగనాయకులు పర్యవేక్షణలో జంగారెడ్డి గూడెంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకూ తనిఖీలు నిర్వహించారు. ఏలూరు సమీపంలోని 16వ నెంబర్ జాతీయ రహదారి కలపర్రు టోల్‌గేటు వద్ద తనిఖీలు నిర్వహించారు. రికార్డు ప్రకా రం ఇంజన్, చాసిస్, రిజిస్ట్రేషన్ నంబర్లు స్వయంగా పరిశీలించారు. డోర్ సెన్సర్లు పనితీరు, అగ్నిప్రమాదం జరిగినప్పుడు మంటలను ఆర్పడానికి అవసరమైన పరికరాలు పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన 55 బస్సుల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. మూడు బస్సులను సీజ్ చేశారు. మొత్తం రూ.2.8 లక్షల జరిమానా విధించారు. 8 మంది మోటారు వాహన ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు.