ఉప్పుటేరు ఆక్రమణలను ఎలా తొలగించాలి ?
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:14 AM
కొల్లేరులో వరద ముంపును నివారించేందుకు ఉప్పుటేరు వద్ద ఆక్రమణలను ఎలా తొలగించాలి? సూచించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సి పల్ కన్సర్వేటర్ డాక్టర్ పీవీ చలపతిరావు అధికారులను ఆదేశించారు.
కొల్లేరు వరద ముంపు నివారణ చర్యలేమిటి ?
ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అటవీ శాఖ ప్రిన్సిపల్ కన్సర్వేటర్ చలపతిరావు ఆదేశం
ఏలూరు, పశ్చిమ జిల్లాల అధికారులతో సమీక్ష
అభయారణ్యంపై సీఈసీకి త్వరలో నివేదిక
ఏలూరు/ఏలూరు రూరల్, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): కొల్లేరులో వరద ముంపును నివారించేందుకు ఉప్పుటేరు వద్ద ఆక్రమణలను ఎలా తొలగించాలి? సూచించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సి పల్ కన్సర్వేటర్ డాక్టర్ పీవీ చలపతిరావు అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్‌లో గురువారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, పశ్చిమ గోదావరి జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డిలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘అభయారణ్యం సరిహద్దులను గుర్తించండి. సుప్రీంకోర్టు నియమించిన సాధి కారిత కమిటీ కోరిన అంశాలపై నివేదికను సిద్ధం చేయండి. కొల్లే రు ఆక్రమణల తొలగింపు, వర ద ముంపు నివారణకు జలవన రుల శాఖ తీసుకున్న చర్యలపై సీఈసీ రూపొందించిన ప్రశ్నావళికి అనుగుణంగా నివేదికను సమర్పించాలి. ఉప్పు టేరు సరిహద్దులను గుర్తించి, నివేదికలు సమర్పించాలి. దీనికనుగుణంగా కొల్లేరులో వరద నియంత్రించేందుకు ఆక్రమణలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కొల్లేరు అభయారణ్యం సరిహద్దులను రూపొందించినప్పు డు ఇప్పటికే వున్న రికార్డులతో ప్రస్తుతం ఆధునిక లిడార్ సర్వే టెక్నాలజీ ద్వారా గుర్తించిన నివేదికలను, కొల్లేరు అభయారణ్యం పరిధిలోని జిరాయితీ, డి–ఫారం పట్టా భూ ముల వివరాలను సమర్పించాలి’ అని స్పష్టం చేశారు. జేసీ ఎంజే అభిషేక్‌గౌడ, జిల్లా అటవీ శాఖాధికారి బి.విజయ లక్ష్మి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ శేషుబాబు, ఎస్‌ఈ సీహెచ్ దేవప్రకాశ్, ఆర్డీవో అచ్యుత్ అంబరీష్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ రమేష్, డీపీవో కె.అనురాధ పాల్గొన్నారు.
కొల్లేరు రైతుల నిరసన
‘అభయారణ్యం పేరుతో మా పొట్ట కొట్టవద్దు. సంప్ర దాయ వ్యవసాయానికి అనుమతి ఇవ్వండి’ అంటూ నిడ మర్రు మండలం ఆముదాపల్లికి చెందిన కొల్లేరు రైతులు వేడుకున్నారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద గురువారం కొల్లేరు అభయారణ్య జిరాయితీ భూయజమానులు, రైతుల డి పట్టాదారుల హక్కుల సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన తెలిపారు. సమితి నాయకులు జి.గంగాధర్‌రావు, భలే వెంకటేశ్వరరావు, భలే నారదముని తదితరులు మాట్లాడుతూ ఆముదాలపల్లిలో 120 దళిత కుటుంబాలు నివసిస్తున్నామన్నారు. గ్రామ సొసైటీ ఆధ్వర్యంలో కొల్లేరులో పూర్వం నుంచి సంప్రదా య వ్యవసాయమైన వరిని పండిస్తూ జీవనం సాగిస్తు న్నామని తెలిపారు. ఇటీవల తాము పొలం పనులు చేసుకుంటుండగా అటవీ శాఖ అధికారులు అనుమతి లేదని నిలిపి వేశారన్నారు. అభయారణ్యంలో వ్యవసా యం చేయరాద్దంటూ మైకు ద్వారా టాం టాం వేయిం చారని ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లేరుపై ఆధారపడి జీవిస్తున్నామని, వన్యప్రాణులకు ఎలాంటి అపాయం తలపెట్టలేదని భవిష్యత్తులోను చేయబోమన్నారు.
ఎమ్మెల్యే పత్సమట్ల వినతి
ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని కొల్లేరులో సంప్రదాయ వ్యవసాయం చేసుకుని రైతులు జీవనోపాధి కల్పించు కునేందుకు చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ డాక్టర్ పీవీ చలపతిరావు, కలెక్టర్ కె.వెట్రిసెల్వి లను ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు కలెక్టరేట్‌లో గురువారం కలిసి వినతిపత్రం సమర్పించా రు. సంప్రదాయ వ్యవసా యం చేసుకుంటున్న రైతులను అటవీ శాఖాధికారులు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే వివరించారు. ఆయనతోపాటు కొల్లేరు రైతులు ఉన్నారు.