అయ్యో.. రొయ్య..!
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:59 PM
వైరస్...వైరస్.. ఇప్పుడు ఆక్వా రైతుల నోట ఇవే మాటలు వినిపిస్తున్నాయి.. ‘‘18 రోజులకే వైరస్ వచ్చి చెరువులు పాడై పోయాయని జాగ్రత్తగా ఉండాలంటూ ఒకరు హెచ్చరిస్తుంటే నెలరోజుల లోపు పిల్ల రొయ్యలకు వైరస్ రాదు కదా అని మరొకరు డౌట్ పడుతుంటే.. ఏమో మా పక్కన 15 రోజులకే వైరస్ అటాక్‌తో చెరువు పోయిం దంటూ ఇంకొకరు ఆవేదన వ్యక్తం చేసు కుంటున్నారు..
రొయ్యలను వెంటాడుతున్న వైరస్
నెలరోజుల లోపు పిల్లలకూ అటాక్
నాణ్యత లేని సీడ్, వాతావరణంలో మార్పులతో తీవ్ర నష్టాలు
సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు
లబోదిబోమంటున్న ఆక్వా రైతులు
వైరస్...వైరస్.. ఇప్పుడు ఆక్వా రైతుల నోట ఇవే మాటలు వినిపిస్తున్నాయి.. ‘‘18 రోజులకే వైరస్ వచ్చి చెరువులు పాడై పోయాయని జాగ్రత్తగా ఉండాలంటూ ఒకరు హెచ్చరిస్తుంటే నెలరోజుల లోపు పిల్ల రొయ్యలకు వైరస్ రాదు కదా అని మరొకరు డౌట్ పడుతుంటే.. ఏమో మా పక్కన 15 రోజులకే వైరస్ అటాక్‌తో చెరువు పోయిం దంటూ ఇంకొకరు ఆవేదన వ్యక్తం చేసు కుంటున్నారు.. రైతులు కలుసుకున్నా ఫోన్‌లో అయినా నెలరోజులుగా ఇదే టాపిక్ నడుస్తోంది.. వాతావరణంలో మార్పులు, సీడ్‌లో నాణ్యత లేకపోవడం, వైరస్ అన్నీ కలిసి రైతులను నట్టేట ముంచుతున్నాయి..
ఆకివీడు రూరల్ సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి) :వర్షాకాలం అంటేనే ఆక్వాకు గడ్డుకాలం. ప్రస్తుతం ఉన్న తీవ్ర పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. వర్షాకాలంలో ముసుర్లు, తుఫాన్లు, అల్పపీడనాల వంటి పరిస్థితులతో డీవో సమస్యలు వచ్చి పిల్లవేసి 40 రోజులు దాటిన చెరు వులు మాత్రమే ఎఫెక్ట్ అయ్యేవి. ప్రస్తుతం అలా కాదు.. రోజులతో సంబంధం లేదు.. చెరువులో వేసి 15 రోజులు వయసున్న పిల్లకూడా వైరస్ ఎటాక్‌తో చనిపోతున్నాయి. వాతావరణంలో మార్పుల వల్ల నీటిలో పారా మీటర్స్ మారిపోతుంటాయి. దీంతో రొయ్యలలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. దీంతో వైరస్ బారిన పడు తున్నాయి. దీంతో రొయ్యలు ఈదడం మొదలుపెడతాయి. ఆలస్యం చేస్తే చనిపోయి కిందకు దిగిపోతాయి. ఇవి ఈదడం ప్రారంభించగానే కాకులు, కొంగలు, పక్షులు వేటాడడం ప్రారంభిస్తాయి. వీటిని తీసుకెళుతూ పక్క చెరువులలో పాడవేయడం, వాటిలో వాలడం చేస్తే చాలు వాటి ద్వారా పక్క చెరువులకు వైరస్ సోకుతుంది. ఈవిధంగా ప్రస్తుతం దాదాపు 95% సాగు వైరస్ ఎటాక్‌తో నష్టం వాటిల్లింది. మిగిలిన సాగు భయాందో ళనల మధ్య సాగుతున్నది. తక్కువ రోజులు ఉన్న చెరువులలో పిల్లలను కొనుగోలు చేసేవారు లేక పట్టుబడి ఖర్చులు రావన్న ఉద్దేశంతో మందులు పిచికారీ చేస్తున్నారు.
నాణ్యత లేని సీడ్, వాటర్
తక్కువ ఖరీదుకు వస్తుంది.. లక్షకు లక్ష బోనస్ వంటి వాటితో నాణ్యతలు పాటించని హేచరీలలో రైతులు సీడ్ కొనుగోలు చేస్తున్నారు..తక్కువ రేటుకు సీడ్ కావాలన్న ఆలోచనను పసిగట్టిన హేచరీలు నాసిరకం పిల్లను అంటగట్టడంతో వాటిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో వ్యాధుల బారిన పడుతున్నాయి. అంటు వ్యాధిలా అన్ని చెరువులకు పాకేస్తున్నది. అనుమతిలేని హేచరీలను నియత్రించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతు న్నారు. రొయ్యల చెరువుల్లోని నీటిని నేరుగా పంటకాలువలలోకి వదిలేస్తున్నారు. ఈ నీటినే దిగువ ప్రాంతంలో ఉన్న చెరువులు వారు నింపుకోవాల్సిన పరిస్థితి. దీంతో కలుషితమైన నీటిని నింపుకుని మందులు పిచికారీ చేసి సాగు చేస్తుండటం వల్ల ఇబ్బందులు తలెత్తున్నాయని రైతులు వాపోతున్నారు. రొయ్యల సాగునీటిని మురుగు కాలువలలోకి మాత్రమే వదిలేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వ్యాపారుల కనుసన్నల్లోనే అంతా
రొయ్యలను కొనుగోలు చేసే వ్యాపారస్తుల కనుసన్నల్లోనే అంతా జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీడ్ ఎంత కొనుగోలు చేశారు ? ఎంత విస్తీర్ణంలో సాగవుతున్నది ? ఫీడ్ ఎంత వెళుతున్నది ? వైరస్, వైట్‌గట్, ఈహెచ్‌పీ వంటి వ్యాధులు వల్ల ఏ కౌంటు ఎక్కువగా వస్తున్నది తెలుసుకుని ఆయా ధరలు తగ్గిం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. 100 కౌంటు ధర రూ.235 ఉన్నప్పటికీ షరతులు వర్తిస్తున్నాయి, టన్నేజీ 3 కన్నా ఎక్కువగా ఉండాలని, వైరస్, విబ్రో సోకిన రొయ్యలకు ధర తగ్గిస్తున్నారు. ఇదిలా ఉండగా 100 కౌంటు నుంచి దిగువకు 90, 80, 70, 60 కౌంటు రొయ్యల ధరలకు మధ్య పెద్ద వ్యత్యాసం లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో వీటి మధ్య రూ.20 నుంచి రూ.200 వరకు వ్యత్యాసం ఉండేది, ప్రస్తుతం అది కేవలం రూ.100 లోపే ఉందని రైతులు వాపోతున్నారు. ట్రంప్ ఎఫెక్టు వలన పెద్దకౌంటులు అయిన 20 నుంచి 50 వరకు ఇబ్బందులున్నా ఆపై కౌంటులకు ఎఫెక్టు ఎక్కువగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం, వ్యాపారులు ఒకేసారి ఆక్వా రైతులను నష్టాల ఊబిలోకి తోస్తున్నారని, ప్రభుత్వం ఆదుకోవాలని హేచరీల ద్వారా నాణ్యమైన సీడ్‌ను అందించాలని, కోల్డ్ స్టోరేజీలు నిర్మించి ఆక్వా రైతులకు అండగా ఉండాలని కోరుతున్నారు.